మా వాసన్న, మీకు కనపడితే!

మా ఉప్పలపాడు గ్రామం గురించి నేను మీకు ఇది వరకే చెప్పి యున్నాను. ఓ నాలుగు వందల గడపలు ఉన్న గ్రామం మాది. జీవినం అంతా వ్యవసాయాధారమే, వ్యవసాయమంతా వర్షాధారమే. కలిగిరి చెరువునుండి మొదటి పారుదల మాకు. వర్షాలు సమృద్ధిగా వున్నఏడు రెండు పంటలు లేక పోతే రెండేళ్లకు ఓ పంట. బోర్లతో, మోటరులతో వ్యవసాయం మాకు తెలియని విద్య. వూరు మాత్రం మంచి చైతన్యవంతమే. వ్యవసాయం, సంబంధిత సమస్యలు, వ్యవసాయ సంఘాలకు వ్యతిరేక పోరాటాలు, పశుపోషణ, పుస్తకపఠనం, గుడిలో పురాణశ్రవణాలు, పిల్లయకాయల చదువు సంధ్యలు మున్నగునవి వాళ్ళ పనీ పాటలు. మా ఊరిలో అప్పటిలో ప్రముఖులు రాసిన పుస్తకాలు బాగా చేతులు మారేవి. వాటిమీద చర్చోప చర్చలు. వయస్సొచ్చిన ఆడపిల్లయితే పడవలాటి కారులో దిగే నవలానాయకుల కోసం కలలు కంటూ.

అటువంటి నేపధ్యం లో పుట్టాడు మా వాసన్న. తాను మా తాతకి చెల్లెలి మనవడు. మా తాతలు ఆ రోజుల్లోనే వాళ్ళ చెల్లెలికి వాళ్ళతో పాటే సమవాటాగా ఓ నలుబది ఎకరాలు పంచి ఇచ్చారు. కాస్త కలిగిన కుటుంబం కిందే లెక్క. పి.యూ.సి తప్పి ఇక చదవను అని మా వూరికి చేరిపోయాడు మనోడు. బలాదూర్ తిరుగుళ్ళు, దించే సమయానికి తాటి చెట్ల దగ్గర తేలటం ఇవే నిత్యకృత్యాలు. ఆ సమయంలో అప్పటికి పెళ్లి కానీ నాకు వరసకు అత్త అయ్యే అమ్మాయితో నిండా ప్రేమలో పడిపోయాడు. ఆవిడ చాలా అందగత్తె, చక్కని మేనిచ్చాయతో, చారడేసి కళ్ళతో, నొక్కుల జుత్తుతో, వాణిశ్రీ చీరలతో. సంగీతం లో అపర సుశీల అనే పేరు తనకి.  మా పెద్దమ్మ కూతురు సి. గాన పెసూనాంబ ఆమెకి పెద్ద చెలికత్తె. మా అత్త,  మా వాసన్నల ప్రేమ వ్యవహారానికంత రాయబారమనే భారాన్నంతా మా అక్కే మోసింది. ఇదంతా మా అత్త వాళ్ళ అమ్మ దిశా నిర్దేశం లోనే జరిగిందని మా ఉరి జనుల ఉవాచ.

అలా వాళ్ళ ప్రేమ మూడు దొడ్లు ఆరు గడ్డి వాములలా సజావుగా సాగిపోతున్నవేళ, మా వాసన్న వాళ్ళ అక్క కల్నాయకి అవతారమెత్తింది. ఆమెకి మా అత్తా వాళ్ళ కుటుంబం మీద సదభిప్రాయం లేదు, ఎప్పుడూ నవలా లోకంలో విహరిస్తూ ఉంటారని, అదీకాక మా వూరిలో వున్న కొన్ని తుంపులమారి కుటుంబాలలో వీళ్లది మొదటి వరుస అని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఆమె ముందు, మా అక్క తోక కత్తిరించింది, తర్వాత వాళ్ళ తమ్ముడి వ్యవహారాలన్నీ తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంది. వాళ్ళ నాన్నని, తమ్ముడిని తిరుపతి తరిమేసి,. వాళ్ళ నాన్న గారు అక్కడ ఓ ఇల్లు చూసుకొని కొడుక్కి ఆయనే వండిపెట్టుకుంటూ, పి.యూ.సి గట్టెక్కించేలా ప్రణాళిక రచించి, అమలుకూడా చేయించింది.

 తరువాత మా వాసన్న సూక్ష్మజీవ శాస్త్రం లో పట్టా పుచ్చుకొని అమెరికా చెక్కేసాడు. ఈలోపు మా అత్తకి ఆయనకీ ఏమి సంబంధ బాంధవ్యాలు నడిచాయి అనే దాని మీద నాకు సమాచారం  లేదు. ఈ సమయానికి నేను జన్మించి ఆయనచే మర్ఫీ రేడియో బుడ్డోడా అని పిలవబడ్డామని మా అమ్మ సమాచారం. అప్పుడు నాకు ఆ బుడ్డోడికి మల్లె రింగు రింగుల జుత్తు ఉండెడిది అని విని సంతసించాను నేను. మా అత్త ఆయన కోసం ఇక్కడ చకోర పక్షిలా ఎదురు చూస్తూ వుంది అన్నీ పెళ్లి చూపులు ఎగర కొడుతూ, వస్తాడు నా రాజు అని పాడుకుంటూ. కాలంతో పాటు నేను పెరుగుతున్నా, నాకూ ఊహ తెలుస్తూ వుంది. అప్పట్లో మధ్యాహ్నం మా ఊరి మీద ఝుమ్మంటూ ఓ విమానం వెళ్ళేది. పిల్లలమంతా బయటకొచ్చి వాసన్న వస్తున్నాడు, వాసన్న వస్తున్నాడు అంటూ కేకలేసుకుంటూ పైకి చూసుకుంటూ కింద దెబ్బలు బాగా తగిలిచ్చుకొనే వాళ్ళం. ఒక రోజు ఆయన రానే వచ్చాడు, కూడా శింగపేటలో ఓ పెద్ద ఇంజినీరు కూతురిని పెళ్లి కూడా చేసుకొని.

మా అత్త ఎవరితోనూ మాటలాడటం మానేసింది. రేడియోనే ఆమె తోడు, పాటలే ఆమె ప్రపంచం. నా చిన్నప్పుడు వీడి గొంతు ఆడపిల్లలా  వుంది, వీడు పాడితే బాగుంటుంది అని నన్ను దగ్గరకు తీసేది. మా అక్క వాళ్ళింటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటిలో పండిన పొట్లకాయో, సొరకాయో, తంబాకాయో వేసె నాకు అన్నం పెట్టేది. ఒక అందమైన బొమ్మలా వుండే మా అత్త నా కళ్ళముందే కళావిహీనమవటం, శుష్కించిపోవటం, వినపడక ఎవరితోనూ కలవక పోవటం నా కళ్ళ ముందే చూసా. చాలా ఏళ్ళ పిదప, ఆమెని మా చుట్టుపక్కల గ్రామమైన పెయ్యలపాలెం లో ఓ రెండెకరాలు కల ఓ ఆసామికి ఇచ్చి పెళ్ళిచేసారని అనటం కంటే వొదిలిచ్చుకున్నారు. ఆయనకీ ఈమెకీ అభిరుచుల్లో పెద్ద వ్య త్యాసం, ఆమెకప్పటికి అభిరుచులు అంటూ మిగులుంటే.

మనకోసం ఏవీ ఆగవన్నట్టు ఆమెకి ఇద్దరు పిల్లలు కలిగారు. ఆమె ఎలావుందో ఆ పెయ్యలపాలెంలో అని వినడానికే భయపడేలా, ఎవరో చెప్పేవారు బర్రెలు పెట్టుకొని పాలుపోసుకుంటూ కనిపించిందని లాటి కష్టపెట్టే మాటలు. ఆ తర్వాత వారు పిల్లల చదువుల కోసం నెల్లూరు చేరారు, పిల్లల్ని బాగానే చదివిచ్చుకున్నారు. పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. మా అత్తని బాగా చూసుకుంటారు.

అలా మా అత్త పడ్డ కష్టాల నుండి తన కష్టం తో బయట పడింది. ఇంతకీ మా వాసన్న  ఏమయ్యాడనే గా మీ ప్రశ్న. ఆయన అమెరికాలో పేరుమోసిన సైంటిస్ట్ మరియు వ్యాపారవేత్త . ఈ రెండు వృత్తులు కలవవు అంటారు కానీ రెండింటినీ సమన్వయము చేసిన సమర్థుడాయన. మీ అమెరికా వాసులకి ఆయన కనపడితే, ఆయన గతం గుర్తు చేసుకోవటము ఇష్టముంటే, మా అత్త అన్నీ కోల్పోయినా, ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని, పిల్లల్ని ప్రయోజకులని చేసుకొని, వాళ్ళ ఆసరాతో ఇప్పుడు బాగుందని.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s