మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు!

మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి తన అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయన అప్పటిలోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ లో మెట్రిక్యూలేషన్ చదివాడు, హిందీ ప్రచారసభ వారి విశారద కూడ ఫ్యాన్ అయ్యాడు. అప్పటిలో నెల్లూరు లో ఓ చిరుద్యోగి ఆయన.

వాళ్ళ కూతురే మా లక్ష్మి పెద్దమ్మ. తాను ఇంటర్మీడియట్ లో ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా చిన్నమ్మమ్మ  నెల్లూరులోనే ఉంటూ, మా ఉప్పలపాడు కి వచ్చి వ్యవసాయం చేయించుకునేది. మా వూరిలో ఆవిడకి ఓ చిన్న ఇల్లు కూడా వుంది, మా దేవాలయానికి ఎదురుగ. మా చిన్న అమ్మమ్మకి  మా అమ్మమ్మంటే కోపం, మా అమ్మమ్మవల్లే తాను చిన్నతనంలోనే విధవరాలు అయ్యిందని. భర్త చనిపోయాక తాను విపరీతమైన పురుషద్వేషిణి  అయ్యింది. వేలెడంత బుడ్డోడిని నేను కూడా తాకరాదు ఆవిడని. ఆవిడ నెల్లూరులో బస్సు ఎక్కి ఉప్పలపాటిలో దిగేసరికి కనీసం ఓ పదిమంది పురుష పుంగవులైనా ఆమె నోటి బారిన పడి  పారిపోవాల్సిందే. ఇంటికి రాగానే సబ్బు పెట్టి వొళ్ళంతా కడగాల్సిందే.

అటువంటి ఆవిడకి మూగ జీవాలంటే చాలా ప్రేమ. కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి ఓపికగా వెతుక్కొని వెళ్లి మరీ ఎదో ఒకటి పెట్టి రావాల్సిందే. ఆవిడ బస్సు దిగుతుందని వాటికి ఎలా తెలుస్తుందో, అవి అన్నీ వెళ్లి ఆవిడని ఇంటి  వరకూ దిగపెట్టి, ఆవిడ ఉన్నన్నాళ్ళు ఆవిడ ముందు వెనకా ఒక సైన్యం లా కవాతు చేసేవి. వాటికి మా ఉప్పలపాటిలో వాటికి మా చిన్నమ్మమ్మ ఆర్మీ అని ముద్దు పేరు.

అలాటి పురుషద్వేషిణి అయిన మా చిన్నమ్మ వాళ్ళ నెల్లూరులోని ఇంటిపైన చేరాడు షోకిల్లా  రమణయ్య. చదువు పేరుతో ఇంట్లో డబ్బు దస్కం తెప్పించుకొని స్నేహితులతో జల్సా చేయటమే జీవిత ధ్యేయం ఆయనకీ. పురుషద్వేషిణి  అయిన మా చిన్నమ్మకి , విలాసపురుషుడైన రమణయ్యకి  క్షణం పడదు. ఆయన మిద్దె మీదకు వెళ్లే సమయంలో, దిగి బయటకు వెళ్లే సమయం లో ఈవిడ ఆయన నెత్తి మీద నీళ్లు కుమ్మరిచ్చేది కూడా అట. ఈ పిల్లీ ఎలుకా చెలగాటం లోనే మా పెద్దమ్మ, ఆయన నిండా ప్రేమలో మునిగిపోవటం మా పిచ్చి చిన్నమ్మ కి  తెలీయనే లేదు. కొంత కాలానికి ఆవిడకి తెలిసినది, కూతురి గర్భవతి అయ్యాక. అందరికీ తెలిసి గొడవ అయ్యాక, రమణయ్య  పారిపోయాడు. వాళ్ళ వూరికెళ్ళిన మా వాళ్లకు తెలిసింది అప్పటికే ఆయన గారికి పెళ్లి కూడా జరిగి ఉందని.

ఆయన నిజస్వరూపం తెలిసిన మా లక్ష్మి పెద్దమ్మ ఇక ఆయన్ని దగ్గరకు రానివ్వలేదు. మా పెద్దమ్మ ధైర్యం గా నిలబడింది, ఒక కొడుకుకి జన్మ నిచ్చింది. చదువు పూర్తి చేసుకొని, కాలేజీ లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో లెక్చరర్ గా చేరిపోయింది. ఆ రోజుల్లోనే మా పెద్దమ్మని మా వాళ్ళు ఎవరూ తప్పు పట్టలేదు, పైపెచ్చు అండగా నిలబడ్డారు, మా అమ్మ, పెద్దమ్మ లు అందరూ. పిచ్చి అమ్మమ్మ అనుకునే మా చిన్న అమ్మమ్మ కూతురిని రెప్పలాగా కాపాడుకుంది.

ఒంటరి అమ్మ, అమ్మమ్మేమో అలా, ఈ వాతావరణం లో పెరిగిన మా పెద్దమ్మ కొడుకు కూడా వింత గానే పెరిగాడు. వాళ్ళమ్మమ్మ క్రమశిక్షణ మీద కోపంతో ఆవిడ పెంచే  పిల్లుల్ని ఆగిన సీలింగ్ ఫ్యాన్ రెక్కల మీద ఉంచి స్విచ్ ఆన్ చేసేవాడు, వాటిల్ని బకెట్ లో ఉంచి బావిలో దించే వాడు, రబ్బర్ బ్యాండ్ లకు గుండు సూదులు గుచ్చి దాన్ని స్ట్రెచ్ చేసి దార్లో వెళ్లే బట్టఫుర్రి వున్న వ్యక్తుల మీదకు సంధించేవాడు. చదువులన్నీ అసంపూర్ణాలే, కానీ ఆయన అంత తెలివి కలవాడు మరియు మంచివాడు లేడని మా వాళ్లలో పెద్ద పేరు, కానీ ఆ తెలివి ఆయనకే కాదు ఎవరికీ ఉపయోగ పడేది కాదు. ఆ రోజుల్లోనే ఎన్నో వెరైటీ బైక్ లు, వాడిన బైక్ వాడకుండా. మహారాష్ట్ర లో ఇంజనీరింగ్ డొనేషన్ కట్టి చేరి మధ్యలోనే మానేసిన చరిత్రతో మా పెద్దమ్మ డబ్బులంతా మంచి నీళ్లు తగిన ప్రాయం లా ఖర్చుపెట్టేవాడు .

కాలక్రమేణా ఆయనకీ పెళ్లయ్యింది, ఆయనకీ ఇద్దరు పిల్లలు. ఏమన్నా ఆయన అనుకున్నది  జరగక పోతే అమ్మ మీద దౌర్జన్యమే. అయినా ఆ అమ్మకి ఆయనంటే పంచ ప్రాణాలు. కనుల ముందర ఉంటే చాలు, సిగరెట్ కి , ముందుకి తగలేసినా  పరవాలేదు. అమ్మా వాళ్ళు కలిసినప్పుడు కుమిలి పోయేది. ఏమి బతుకు నాది, భర్త వలన సుఖం లేదు, కొడుకు వలన నరకం అని. అలాటి మా పెద్దమ్మ, ఓ ఐదేళ్ల  క్రితం, ఓ వరలక్ష్మి వ్రతం నాడు తిరుగుతూ తిరుగుతూ, అలా ఓ కుర్చీ లో కూర్చొని తలవాల్చేసింది. అందరూ వచ్చారు, అబ్బా ఎంత అదృష్టవంతురాలమ్మ, సుఖంగా పోయిందని వాక్రుచ్చారు. మా అన్న కూడా ఓ నెల క్రితం పోయాడు, బ్రెయిన్ స్ట్రోక్ తో శరీరమంతా చచ్చుబడి పోయి, ఆరు నెలలు మంచంలో ఉండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s