వినదగు నెవ్వరు చెప్పిన !

మల్లిగాడు కరెక్ట్. మనం ప్రతి రోజు చాలా విషయాలు అందరి దగ్గరా నేర్చుకుంటాం. అవి మన పిల్లల దగ్గర నుండి అయితే ఇంకా బాగుంటాయి. నేను ఈ రోజు నా పిల్లల దగ్గర ఏమి నేర్చుకున్నానో చెప్తా. పెద్దపాప అమృతకి ఐదేళ్లు అనుకుంటా, తనకి చదరంగము  నేర్పించాలని అనుకున్నా, అలాగే మొదలెట్టాను ఒక అయస్కాంతపు చదరంగపు అట్ట  కొని. పరవాలేదు త్వరగానే నేర్చుకున్నది. కానీ గుర్రం (నైట్ ) వేసే అడుగులు మాత్రం బాగా అయోమయ పడుతుంది. చాలా సార్లు చెప్పినా అయోమయమే. ఒక రోజు మరల మరల తప్పు చేస్తుంటే కొంచెం చిరాకు పడ్డాను. కాసేపు అన్నీ ఆపేసి నా వైపే చూస్తుండి పోయింది. నాన్న, నేను ఒకటి అడగొచ్చా అన్నది. అసలు ఈ చెస్ ఎందుకు ఆడుతున్నాం మనం. ఇది ఒక ఆట కదా , సరదా కోసమే కదా అన్నది. అవునమ్మా అన్నా నేను సమాధానం గా. మరి నీ అరుపుల్లో సరదా ఎక్కడుంది నాన్న అన్నది. ఒక్కసారి నాకు అవగతమైనది నేను చేసిన తప్పేమిటో. మనః స్ఫూర్తి గా క్షమాపణ కోరాను. అది ఎప్పటిలాగే తనకలవాటైన తనదైన నవ్వుతో ఫరవాలేదు నాన్న అన్నది. అలాగే చదువుల దగ్గర కూడా. ఒక సారి లెక్కల్లో పదే పదే తప్పులు చేస్తుంటే కోపం వచ్చి ఒక్కటి పీకాను. పెద్దగా తను ఏడవటం, నేను ఛీ!  ఎందుకు ఒకటి తగిలించానా అని బాద పడటం. ఎక్కువసేపు ఆగలేక పోయా, వెంటనే బతిమాలటం మొదలెట్టా (సుప్రియ దీన్నీ నా ఓదార్పు యాత్ర అని ఎగతాళి చేస్తుంది. నేనే ఎక్కువ ఓదార్పులు చేసుంటానని కూడా). అది వెంటనే మరల నువ్వు కొట్టావని కాదు నాన్న, ఆ లెక్కలు నాకెందుకు రావటం లేదు అని ఏడుపు వస్తుంది. అంతే నేను ఆ పాపని కొట్టాను అని అనుకోవడానికే నాకు చిరాకు వేసింది. అదే చివరిసారి.

పెద్దది ఇలా అయితే మా చిన్నది వేరే. యూ.ఎస్ లో వున్నప్పుడు అదుండగా ఇంట్లో ఎమన్నా కోపమొచ్చి అరవాలన్న భయమే. అది ముందే రూల్స్ రామనుజం. అసలే వాళ్ళ బడి లో మొదట నేర్పేదే 911 నొక్కమని. కాక పోతే దేవుడి దయవల్ల ఎదెప్పుడు నొక్కలేదు. ఒక రోజు అక్కడ ఒక పెద్ద అంగడికి వెళ్ళాం. పెద్దదాని కేదో ఫ్రాక్ నచ్చింది. అది వాళ్ళమ్మని అడిగింది కావాలని. వాళ్ళమ్మ అక్కడికి దూరం గా వున్న నన్ను చూపించి, మీ నాన్న నడుగు అన్నదట. ఇద్దరు నా దగ్గరకి వచ్చారు, నేను మీ అమ్మనడుగమ్మా అన్నా. మా పెద్దది అమాయకంగా మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తడానికి రెడీ అయ్యింది. మా చిన్నది దాని చెయ్యిపెట్టి ఆపి, అక్కడ అడిగితే ఇక్కడ, ఇక్కడ అడిగితే అక్కడ అని చెప్పినప్పుడే నీకు అర్థం కాలా వాళ్ళు కొనరని, ఇక నీ పరుగు ఆపు అని. అప్పుడర్థమయ్యింది వద్దు అనుకుంటే విడమర్చి చెపితే పిల్లలు అర్థం చేసుకుంటారు, సాకులు చెప్పకూడదని. ఒకసారి వాళ్ళ గది అంత గులాబీ రంగు వస్తువులతో నింపాలి అనుకొని అన్నీగులాబీవే కొనటం మొదలెట్టారు. గులాబీ దుప్పట్లు, గులాబీ బ్లయిండ్స్, గులాబీ వాల్ క్లాక్ మొదలైనవి. ఇక నా ఓపిక నశించి నో అన్నా. దానికి మా చిన్నది మేము పెద్ద వాళ్ళం అయ్యాము, మాకేదీ ఇష్టమో మాకు తెలుస్తున్నాయి అని ఖరాఖండి గా చెప్పింది. ఇంతకీ దాని వయస్సు ఆరేళ్ళు. కాబట్టి వాళ్ళ ఇష్టాల్ని మన్నించడం నేర్చుకున్నాం. కానీ వాళ్ళు కూడా మేము వద్దన్నప్పుడు, సరే వద్దులే అనటం నేర్చుకున్నారు. ఈ పరస్పర గౌరవం మొదలయ్యాక అస్సలు వాళ్ళ నిర్ణయాలకి వాళ్ళను వొదిలేశాము. ఈ మధ్య పెద్దది నాకు ఎం.పీ .సీ వద్దు నాన్న, నేను ఎం.ఈ.సి చదువుతాను అన్నది, మూడు నెలల చదువులు అయ్యాక. అదే ఏ కళాశాల మంచిదో కనుక్కుని ఎం.ఈ.సి లో చేరిపోయింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s