నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!

నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది. కొన్ని రోజులైతే దానితోనే నా లోకం. ఉన్నట్టుండి ఒకసారి దాని ముందు చక్రం ఊడి పోయింది. సరి చేసి పెడితే కొంచెం దూరం వరకు చక్రం ఉండటం, తర్వాత ఊడి, కుంటి గుర్రం లాగా ఒక పక్కకి పడి పోవటం. అలా చక్రం ఊడిన కారు నాకు నచ్చలా. ఒక రాయి తీసుకున్నా, మా దేవళం పంచలో కూర్చున్నా, కారుని పచ్చడి పచ్చడి చేసిపారేశా!. మా మూగ పూజారి నేను చేసే పని చూసి, లబ లబ లాడాడు. ఎత్తుకెళ్ళి దాన్ని మా సుబ్బరామ్ తాత వాళ్ళ స్నానాల నీళ్లు వెళ్లే తూము కింద పారేసా!. అలా మా వాళ్లంతా నీ కారేదిరా అని అనటం, నేను పోయుందని చెప్పటం. మా వాళ్ళు నిజమే కాబోలు వీడికి ఊరంతా పెత్తనాలే కదా, ఎక్కడో పారేసుకుని ఉంటాడని సరిపెట్టుకున్నారు. మా శీనన్న కొన్నాళ్ళకు గండవరం తిరునాళ్ల కెళ్ళి, మళ్ళీ నాకోసం ఓ బొమ్మ కారు పట్టకొచ్చాడు, వాడు జార్చుకుంటే జార్చుకున్నాడులే, ఉన్నన్నాళ్ళు ఆడుకుంటాడు అని.

ఈ లోపల నాకు మా ఊరి వీధిబడిలో చదువుకొనే మహదావకాశం వచ్చింది. పెద్ద పండగలాగా, మా ఉషాకి , మా జయమ్మకి , మా మురళికి , మా కరుణాకి , ఇంకా అందరు పిల్లకాయలకు, పలకలు బలపాలు పంచేసి బడిలో చేరిపోయా. మా అయ్యోరొక పలక మీద, అ! ఆ! రాసిచ్చి, కొంత సేపు రుద్దిచ్చి, ఇంకా రుద్దు కొని రారా అని తరిమిపడ నూకినాడు, ఆయన పోయి కొడవంలో పడ్డ చేపలు తెచ్చుకోడానికి . నేను మా ఇంటికి లగెత్తినా, ఈ లగెత్తడంలో పలక, కిందబడి ఒక చిన్న పెచ్చు ఊడింది. పెచ్చు ఊడిన పలక నాకు నచ్చలా. దారిలో కాశీ రాయొకటి తీసుకొని, పలకను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టినా!. నాలుగు కర్రముక్కలు కలిపిన ఫ్రేమ్ మాత్రం మిగిలింది. మా ఉషాకి ఆ ఫ్రేమ్ ఇచ్చి, మే ! మీ అమ్మని పొయ్యిలో పెట్టుకోమని చెప్పు అని, ఆ పిల్ల మొహాన పడేసి వచ్చా. ఏమిటో మనకి మొదట నుండి అన్నీ సక్రమంగా ఉండాల, తేడా వస్తే పగల కొట్టేయాల్సిందే. షరా మాములే, ఏదిరా నీ పలక అనటం, మనం పగిలి పోయిందనటం. మరలా మనకో కొత్త పలక, దాంతో పాటు మనం అరగ దీయటానికో బలపం కట్ట బోనస్ గా వచ్చేది.


ఒక రోజు నేను, మా పెద్దమ్మ వాళ్ళ కొట్టాం పక్కగా నడుచుకుంటూ వస్తున్నా. చొక్కా గుండీకి దారం పోగు బయటకు వేలాడుతుంది, దాన్ని చూడగానే నాకు చిరాగ్గా వుంది. ఉంటే సక్రమంగా ఉండాలా లేక పోతే ఊడాల ఆ గుండీ. దాన్ని పీకుతూ తలెత్తే సరికి, కొట్టంకి వేసున్న కర్ర తుమ్మ కర మీద, పిచ్చుకలు వాలున్నాయి గుంపుగా. అబ్బా! ఇప్పుడు గాని వాటి మీద ఒక్క రాయి వేస్తే నా సామి రంగా, ఒక్కటన్నా నేలమీద పడదా అని, పక్కకి వొంగి ఓ కంకర రాయి తీసి విసిరా వాటి మీదకి. వెంటనే అవన్నీ చిల్లా పల్లాగా ఎగిరిపోయాయి. కంచె దగ్గరకెళ్ళి చూస్తే ఒక రెక్క తేడాగా ఎగరలేని పిచ్చుక ఒకటి అక్కడ పడుంది. అది ఎగరడానికి ప్రయత్నిస్తూ, ఎగరలేక నేలమీద, దాని చుట్టూ అదే గిరికీలు కొడుతుంది. అలా సక్రమంగా ఎగరలేని పిచ్చుక నాకు నచ్చలా. కొంత సేపటికి ఎగిరి పోతుందిలే అని అక్కడ నుండి కదిలా. కానీ మనసు లాగింది, ఎక్కడో సన్నని బాధ, వెనక్కి మరలా. వెళ్లి పిచ్చుకని చేతిలో తీసుకున్నా. ఇంటికి పట్టుకొచ్చా, ఇంట్లో ఒక మూల ఉంచా. కొంత సేపయ్యాక కొన్ని బియ్యం నూకలు వేసా దాని ముందు, ఒక చిన్న మట్టి మూతలో నీళ్లు తెచ్చిపెట్టా. దాన్నే చూస్తూ కూర్చున్నా. ఎవరో చెప్పారు దాని గాయం దగ్గర మట్టి రాస్తే తగ్గుతుందని, వెంటనే మట్టి తెచ్చి రాసా. ఆ సాయంత్రమంతా దానితోనే. పొద్దుబోయింది నిద్ర వస్తుంది మధ్యలో లేవటం, దాన్ని చూసుకోవటం, ఇలా తెలియకుండానే నిద్ర పోయా.


తెల్లారగానే అది కోలుకొని ఉంటుందని అది ఉన్నవైపు కెళ్ళా, అక్కడ నాకది కనిపించలా, దాని కొన్ని ఈకలు మాత్రం వున్నాయి. అప్పుడు నాకర్థమయ్యింది ఆ మధ్య మా ఇంట్లో ఓ పిల్లి తిరుగుతుందని. అప్పుడొచ్చింది నాకు ఏడుపు. నేను కారు పగలకొడితే ఇంకో కారు తెచ్చారు, పలక పగలకొడితే ఇంకో పలక తెచ్చారు, మరి నాకు ఇంకో పిచ్చుక వద్దు, నేను పగల కొట్టిన పిచ్చుకే కావాలి. తెచ్చి ఇయ్యండి మీరైనా, ఇప్పటికైనా.

One thought on “నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s