స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!

నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది,  ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది. ఇంటికి కుడి పక్క పెద్ద బాదం చెట్టు వెనక ఒక ఉసిరిగి చెట్టు, ఎడమ పక్క పెద్ద స్థలం లో గడ్డి వాము, ఆ వాముకి ఆవల పెద్ద ఎరువు దిబ్బ. ఆ దిబ్బ నానుకొని ప్రహరీ, ప్రహరీకి ఆవల పంట పొలాలు. మా ప్రహరీకి పంట పొలాల మధ్య ఒక పంట కాలువ. ఒక రోజు మేము గడ్డి వామి మీద కెక్కి దిబ్బలోకి దూకుతూ ఆడుతున్నాం. అలా ఆడటంలో నాకు ఆ దిబ్బలో ఒక పారేసిన అగ్గి పెట్టె దొరికింది. ఓపెన్ చేస్తే దాన్లో ఒకే ఒక అగ్గిపుల్ల. ఆహా ఇంకేముంది కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు మనం ఆ పుల్ల గీసేశాం. బస్సు మని వెలిగి ఆరి పోయింది. ఆ వెలిగిచ్చామన్న తృప్తితో మరియు ఆరికూడా పోయింది అనే నిర్లక్ష్యంతో ఆ పుల్లని ఆ దిబ్బ లో విసిరేసి అగ్గిపెట్టె మాత్రం అగ్గిచెక్కులాట కోసం జోబీలో వేసు కొని సైలెంట్ గా వచ్చేశాం.

 ఒక అరగంట తర్వాత ఒక్కసారి గా అక్కడనుండి మంటలు మొదలయ్యాయి. పక్కనే గడ్డి వాము. మా అమ్మమ్మ చూసేసింది, వామ్మో మన దిబ్బలో స్కై లాబ్ పడిపోయిందిరా నాయనా అంటూ. అందరూ పరిగెత్తారు. మా శీనన్న హడావుడిగా బిందెలెత్తుకొని తొట్టిలో నీళ్లతో,  దిబ్బలో దూరేసి, నీళ్లు చల్లటం మొదలెట్టాడు. అలా అందరూ ఆ మంటల్ని రంగంలోకి దూకి ఆర్పేశారు. ఆ ఆర్పటంలో మా శీనన్న అరిపాదాలు కూడా కాలాయి . అందరూ స్కై ల్యాబ్ శకలాల కోసం దిబ్బలో వెతికారు. అవి లేవు. ముసలోళ్ళు అమెరికానీ శాపనార్థాలు పెట్టేశారు, తిని కూర్చోక, ప్రయోగాలు అంటూ మా ఊర్ల మీదకు ఎందుకు తెస్తారు అని. మీకు గుర్తుందో లేదో, స్కై ల్యాబ్ భీతి ఆఖరుకు పల్లెల్లో కూడా, యిప్పటిలా నిరంతర వార్తా ప్రసార మాధ్యమాలు, చరవాణులు లేని రోజుల్లో కూడా చొచ్చుకుపోయిందంటే, ఏ ఇద్దరు కలిసిన అది కూలితే, ఒక వూరే నాశనమని, కాదు ఒక జిల్లానే పోతుందని, కాదు కాదు ఒక రాష్ట్రమే కాలి పోతుందని ఒకటే చర్చ. నేను కూడా మా శీనన్న కాలు కాలేసరికి అది నావల్లే అని నోరు విప్పే ధైర్యం చేయలా. కుక్కిన పేనులా గుడ్ల నిండా నీరు నింపుకొనివున్నా.

స్కై ల్యాబ్ ఎప్పుడైన పడొచ్చు ఇది శాంపిల్ మాత్రమే అని, మా వూరు ఊరంతా కోళ్ళని పొట్టేళ్లని కోసేశారు, అవెక్కడ కాలి బూడిద అవుతాయో అన్న భూతదయతో. భుక్తాయాసంతో పడుకున్న నా పొట్ట మీద వాతాపీ జీర్ణం వాతాపీ జీర్ణం అంటూ పొట్ట తమిడింది మా అమ్మమ్మ. ఆ దిబ్బ లో అగ్గి పెట్టె గీసింది నేనేను, కానీ శీనన్న కాలు కాలటంతో చెప్పలేక పోయాను. భయమేసింది అన్నా బెక్కుతూ. నేను చూశాలేరా నువ్వా దిబ్బలోకి వెళ్ళటం, ఎదో చేసిన మొహంతో బయటకి రావటం అన్నది మా అమ్మమ్మ. మరి నువ్వు ఆ స్కై ల్యాబ్ అంటూ అమెరికా వాడిని తిట్టటం అంతా, అంటే పడుకోరా పిచ్చి సన్నాసి, నువ్వూ నీ బుజ్జి బుర్రలో ప్రశ్నలూ అంటూ నవ్వేసింది మా అమ్మమ్మ . ఈ సీక్రెట్ నాకూ మా అమ్మమ్మకు మధ్యలోనే 1983 వరకూ.

4 thoughts on “స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!

  1. సర్, మీ నేరేషన్ సింప్లీ సూపర్భ్. స్కై ల్యాబ్ గడ్డి వాము లో పడింది చదివి పొట్ట చెక్కలు అయింది.‌ కంటికి కట్టినట్టు describe చేశారు మీ ఇంటిని.👍

    మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s