నాది కాదు కానీ, మా అనీల్గాడి సోది!

ఎక్కడో మారు మూల పల్లెలో పుట్టాను. ఏకోపాధ్యాయ లేక ఆ పూటకి ఉపాధ్యాయుని రాక దైవాధీనాలు అనేలా వుండే ప్రాధమిక పాఠశాలలో పలకల మీద అక్షరాలూ దిద్దాను, నోటి లెక్కలు నేర్చాను, నాలుగవ తరగతి లోనో లేక ఆపై తరగతులలోనో ఆంగ్ల అక్షరమాలలు నేర్చుకున్నాను. అన్నీ పలకల మీదే, పుస్తకాల మీద రాయటమన్నదే ఎరుగను ఆరవ తరగతి వరకు. వానా కాలం చదువులంటారు ఎందుకో తెలియదు కానీ మా నావీ అట్టివే అనవచ్చు. అదేదో మేము అప్పటికే పొడిచేసి ఇంకా నవీన చదువులు చదవాలన్నట్టు మా బ్యాచ్ తోనే సిలబస్ మారటం మొదలవ్వటం మూలాన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఆరు నెలల తర్వాతే లభ్యమయ్యేవి. కొనే స్తోమతు లేకనో లేక ఇక ఇంకో ఆరునెలలు కోసం కొనటం ఎందుకనో, నేనైతే టెక్స్ట్ బుక్ మొహం చూసి ఎరుగనబ్బా. మా అయ్యోర్లు ఏ నోట్స్ చెబితే అదే నాకు మార్గదర్శనం. అందుకే ఇప్పటికీ ఏదన్న టెక్నికల్ పుస్తకం చదవాలన్న అదేదో బ్రహ్మ విద్య లాగ మనస్సులో ఓ భయం. నా వల్ల కానే కాదబ్బా అనే అంతర్వాణి బలంగా వెనక్కి లాగుతుంది.

లెక్కలు కూడా బట్టీయమే నేను. మిగతా సబ్జెక్టులు పరవాలేదు గాని, నాకు బడిలో లెక్కల రావు అని పేరు. రావు అంటే రావనే అర్థం. అలా లెక్కలంటే ఒక మానసిక భయం పెంచుకున్నా నేను. మా ముందు బ్యాచ్ వాళ్లకి ఎనిమిదో తరగతి నుండి లెక్కల్లో రెండు ఆప్షన్స్ ఉండేవి , ఒకటి కంపోజిట్ అని రెండోది జనరల్ అని. లెక్కల్లో మా శ్రీధర్గాడిలా వుండే మేధావులంతా కంపోజిట్ తీసుకొనే వారు, నా బోటి బట్టీయమ్ గాళ్ళంతా జనరల్ తీసుకొనే వాళ్ళు. నేను కూడా ఫిక్స్ అయిపోయా జనరల్ తీసేసుకుందామని. కానీ మన అకాడెమీ వాళ్ళు ఇలా లెక్కల్ని రెండు విధాలుగా డిస్క్రిమినేట్ చేయరాదని నిశ్చయించి రెండిటినీ కలిపి కలగూర గంప చేసి నా లాటి వాళ్లకు లెక్కల్ని ఓ జీవన్మరణ సమస్య చేసిపారేసారు. లెక్కలంటే ఇంత భయపడే నేను సామాన్య శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము లాటి విషయాల్లో చురుకుగానే వుండే వాడిని. ఇప్పటికీ మైటోకాండ్రియా, హైడ్రా గమనము లాటివి పటము సహాయముతో వివరించగలను, ఏ మూలకముల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమిటో ఇప్పటికీ చెప్పగలను అబ్బా.

పదవ తరగతి గట్టెక్కగానే వెళ్లి నా అన్నీ లెక్కల పుస్తకాలు కిలోల లెక్కన మా అంగటాయనకి తూకం కింద అమ్మేసి , ఆయన రెండు రూపాయలు తక్కువిచ్చినా గీకి బేరమాడకుండా, ఆ డబ్బుల్తో సినిమాకి కూడా వెళ్ళొచ్చా. అలాగే మన నెల్లూరు వి.ఆర్.కాలేజీ వాళ్ళిచ్చే ప్రవేశ పత్రం తెచ్చుకున్న బై .పి .సి కి. ప్రవేశ పత్రానికి మా నాయన సంతకం పెట్టలా అప్పట్లో. ఎంసెట్ లో 500 లోపలే ర్యాంకు రావాలి ఎం.బి.బి.ఎస్ లో సీట్ కావాలంటే, అదే ఇంజనీరింగ్ అయితే ఏ ఐదు వేలొచ్చినా పర్వాలేదు అనే అవగాహన ప్రతీ నాయనలకుంది ఆ రోజుల్లో. నేను బతిమాలా మా నాయన్ని , ఆయన కరగాలా. వెళ్లి మళ్ళి నాకు మరియు మా అక్కకి ఎం.పీ.సి ప్రవేశ పత్రం తెచ్చుకున్న.

అక్కడ దొరికాడు మా అనీల్హాడు నా సహాధ్యాయుడిగా. మా వీ.ఆర్. కాలేజి చాలా ప్రజాతంత్య్ర కళాశాల. తరగతులెప్పుడూ జరగవు. భౌతిక శస్త్ర తరగతులకు హాజరైతే చాలు ప్రాక్టీకల్స్ కి రానిస్తారు, మిగతా క్లాసులన్నీ ఎగ్గొట్టొచ్చు. అప్పుడు నెల్లూరు ఎంసెట్ కోచింగ్ కి చాలా ప్రసిద్ధి. కోరా , నారాయణ , అమీరుద్దీన్ , ఆదిత్య , రత్నం లాటి కోచింగ్ సెంటర్స్ అన్నీ కోచింగ్ తీసుకొనే విద్యార్థులతో కిట కిట లాడుతూ ఉండేది. అలా మేము తంతే వెళ్లి కోరా లో పడ్డాము. బాగా చదువుకొనే వాళ్ళు చదువుకున్నారు , నేను-మా అనీల్గాడు మరికొంత గాంగ్ చదువుని చట్టుబండలు చేసి రోజుకో ముప్పై గంటలు క్రికెట్ ఆడేవాళ్ళము. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి వాడు పాసయ్యాడు, నేను లెక్కల్లోనే తప్పాను. మొత్తానికి 150 మార్కులకు గాను నాకు 44 వచ్చాయి. మా అనీల్గాడు పాసైపోయాడు. గుడ్డిలో మెల్ల నాకు ఎంసెట్లో 3047 రాంక్ రావటంతో మా వాళ్లంతా బిడ్డ బాగా చదివాడమ్మా!, ఆ పేపర్లు దిద్దినవాడి చెయ్యి పడిపోను, అని వాడిని తిట్టుకున్నారు, నన్ను నమ్మేశారు. మనం కూడా మొహం దీనంగా పెట్టుకొని ప్రపంచమే నన్ను ముంచేసినట్టు కొన్నాళ్ళు జీవించేశాను.

మా అనీల్గాడేమో నా వల్లే వాడి ఎంసెట్ రాంక్ దొబ్బిందని, నా దగ్గరుంటే మళ్ళీ దొబ్బద్దని తలచి, నన్ను ఒంటరిని చేసి, వాళ్ళ నంద్యాల వెళ్ళిపోయాడు, ఎంసెట్ కాదు దాని జేజెమ్మ ఐ.ఐ.టి కొడతానని శపధం చేసి మరీ. సరే బాగుపడే వాడినెవరూ చెడగొట్టలేరని వాడినొదిలేసా. నేను కూడా నా సెప్టెంబర్ ప్రిపరేషన్ లో పడిపోయా, మా కాలంలో ఇప్పటిలా ఇన్స్టంట్ ఎగ్జామ్స్ లేవు మరీ. నా సప్లిమెంటరీ పరీక్ష అయ్యింది , పాపం ఈసారి దిడ్డినోడి చెయ్యి మా వాళ్ళ నోట్లో పడి పడిపోకూడదనేమో నాకు 150 కి 144 మార్కులు వచ్చాయి. నేను కూడా మా వాళ్ళ ఇళ్ళకందరికీ వెళ్లి, పోయిన సారి దిద్దినోడు ఎడమ పక్కన ఒకటెయ్యటం మర్చిపోయాడని ప్రకటించేసి వచ్చా. ఆ తర్వాత ఎంసెట్ కి తెగ చదివేసా, లాస్ట్ లో షార్పెన్ ది సా లాగ షార్ట్ టర్మ్ కోచింగ్ లో చేరతానని మా వాళ్ళని పోరు పెడితే మా వాళ్ళు మా అక్క గాజులు కుదవ పెట్టి చేర్చారు మళ్ళీ కోరాలో. అక్కడ చేరడానికి రికమండేషన్ కూడా, ఎందుకంటే ఇంటర్ లో తప్పినోళ్లము మేము చేర్చుకొని, మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్ దిగజార్చలేమన్నారు. కాళ్ళూ, గెడ్డాలు, పట్టుకొని బతిమాలుకుంటే చేర్చుకున్నారు, నీ కుర్చీ నువ్వే తెచ్చుకో ఎందుకంటే మా యన్నీ నిండిపోయాయంజెప్పి. అక్కడ చేరాక ఒక వారం తర్వాత ఒక వారప్పరీక్ష రాద్దామని వెళ్లి మన పక్కన నేల మీద కూర్చొని పరీక్ష తెగ రాసే వాడెవడురా అని చూస్తే మన అనీల్గాడే. వాడి చూపులో ఎక్కడ లేని తిరస్కారం. తూ! నీ వల్లే నా ఎంసెట్ పోయిన సంవత్సరం దొబ్బిపోయింది ,యీసారి కూడానా అనే బాధ కనిపించింది వాడి కళ్ళలో నాకు.

ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, మళ్ళీ అలవాటు ప్రకారమే ఓ పెద్ద రాంక్ నాకు. మా మావాడికెంత వచ్చిందో కూడా తెలీదు, వాడి తిరస్కారంతో నా మనస్సు పాడై, వాడి నెంబర్ కూడా తీసుకోలా, అడిగినా వాడిచ్చిండేవాడు వాడు కాదు. సరేలే అదృష్ట వంతుడు ఏ ఐ.ఐ.టి లో చేరుంటాడు అని సరిపెట్టుకున్నా. నేనేమో దొరికిన దానితో మహా తృప్తి పడి, వాకాడు కాలేజీలో చేరిపోయా మెకానికల్ బ్రాంచ్ లో. క్లాస్ లు స్టార్ట్ కాగానే నా పక్క బెంచీలో ఎవరున్నారబ్బా అని చూద్దును కదా మా వాడే. నాకైతే ఎడారిలో ఒయాసిస్సులాగే. మా వాడు కూడా అప్పటికే వాడి ప్రతిభ గురుంచి ఒక అవగాహన కొచ్చేసినట్టున్నాడు, వాడి మోహంలో నాకు అంత అయిష్టత కనపడలా. ఇక నాతో తప్పదు వాడికి అని, వాడి ఐ.ఐ.టి డ్రీం పక్కన పెట్టి వాకాడులో దొరికిన స్నేహితులతో సర్దుకు పోవాలని కూడా అర్థమైనట్టుంది వాడికి. కానీ ఈ సారి డిసైడ్ అయ్యాము పొద్దస్తమానం ఒకరినొకరం ఏమి కానూక్కుంటాము ఏదన్న డిఫరెంట్గా ప్రయత్నిద్దామని. అంతే వాడు హాస్టల్ మీద పడ్డాడు నేను డేస్కాలర్స్ మీద పడ్డాను. నా ఖర్మకి అక్కడ ఎం-1, ఎం -2, ఎం-౩ అంటూ ఎం-ఇన్ఫినిటీ దాకా మరలా లెక్కలే, వాటికి తోడు ఇంజనీరింగ్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్ మా ప్రాణాలకి. మావాడిగ్గూడా మెషిన్ డ్రాయింగ్ అంటే పాంటు తడుపుడే. ఇంజనీరింగ్ అయ్యాక నా జీవితంలో పేపర్ మీద డ్రాయింగ్ మొహాన్ని చూడను అని శపధం చేసేవాడు.

అలా చావు తప్పి కన్ను లొట్టబోయి అందరూ నాలుగేళ్లలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తే, మా బ్యాచ్ మొత్తం నాలుగున్నర ఏళ్ళు చదివి బయట పడ్డాం. బ్యాచ్ కి బ్యాచ్ ఎలా సంకనాకి పోయిందనేగా మీ ప్రశ్న, అక్కడ మాకన్నా ఘనులున్నారు, వాళ్ళకి సరిగ్గా ఫైనల్ పరీక్షల ముందర, కాస్త రెస్ట్ తీసుకుందామని స్ట్రైక్ అని వాకాడులో అరిచారు, కానీ ఆ అరుపులు తిరుపతి యూనివర్సిటీలో వినపడాల్సినోళ్ళకి వినపడలా, అలా వాళ్లేమో పరీక్షలు వాళ్ళ మానాన వాళ్ళు పెట్టేసుకున్నారు. తీరా మా సంగతేంటి అనడిగితే బయటకు పోయినా ఉద్యోగాలు లేవబ్బయ్య, ఇక్కడే వుండి సెప్టెంబర్ లో రాసుకోండి అన్నారు. నిజమేలే బయటికెళ్తే ఎలాగూ కనపడ్డోడంతా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనడుగుతారు, దాని బదులు ఇదే మేలుకదా అని మేము కూడా ఇదైపోయామమేము.

మా తరగతిలోకెల్లా తెలివిగల్ల మా శ్రీధరగాడు నా సహవాసి కావటంతో, ఇంగువ కట్టిన గుడ్డక్కూడా ఆ వాసనబ్బినట్టు, వాడి పుణ్యాన నాకూ గేట్ లో ఓ మాదిరి స్కోర్ వచ్చింది. తర్వాత నేను బోయి ఖరగపూర్ లో మాస్టర్స్ చేసి ఇదిగో ఇలా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం వెలగబెడుతున్న గత ఇరవై ఐదేళ్లుగా. ఆగండాగండి మా వాడేం చేస్తున్నాడో అని కదా మీ ప్రశ్న, మా వాడు కూడా ఎం.బి.ఏ చేసి ప్రస్తుతం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని విజయవంతంగా నడుపుతున్నాడు. జీవితంలో ఏ డ్రాయింగ్ మోహాన్నైతే చూడనని శపధం చేసాడో ఆ డ్రాయింగ్స్ కట్టల మధ్యే బతుకీడుస్తూ. అబ్బా అప్పుడు ధ్యాస పెట్టలేదుగానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంత ఈజీ సబ్జెక్టు లేదు మామ అంటూ లెక్చర్లు పీకుతూ. మళ్ళీ మేము ఒకే ఊర్లో ఓ ఏడూ కిలోమీటర్ల దూరంలో, యీ మారు ఒకరి నొకరం కానూక్కుంటా మాత్రం కాదు.

ఈ సోది మాకెందుకయ్యా అంటారా, ఈ లోకంలో మేమిద్దరం స్థిరపడగా ,ఇంక ఎవరైనా స్థిరపడగలరు . ఈ లోకం మంచిది ఇక్కడ అందరికీ ఎవరి స్థానం వాళ్లకు వుంది, కేవలం తెలివికల వారికి మాత్రమే కాదు.

కానీ తిన్న దెబ్బల వల్లనేమో కానీ, అప్పుడప్పుడూ ఓ కల, ఆ కలలో అస్సలకి కాలేజీకి వెళ్ళనట్టు, నన్ను పరీక్షలకు రానీయనట్టు, పరీక్షలన్నీ తప్పిపోయినట్టు, ఏ వుద్యోగం సద్యోగం లేక నానా కస్టాలు పడుతున్నట్టు. నిద్ర మధ్యలో లో లేచి, లేదు నేను ఇంటర్ పాస్ అయ్యాను, ఇంజనీరింగ్ పాస్ అయ్యాను, మాస్టర్స్ కూడా చేసాను, ఇప్పుడో కంపెనీ లో పనిచేస్తున్నాను, యీ వుద్యోగం చూసే నన్ను పెళ్ళిజేసుకున్న సుప్రియా కూడా పక్కనే వుంది అనుకొని ధైర్యం చెప్పుకుంటే కానీ నిద్రపట్టదు. ఈ అభద్రతా భావం నన్ను వదిలేది ఎలా? మీకేమన్న చిట్కా తెలుసుంటే చెప్పరూ!

4 thoughts on “నాది కాదు కానీ, మా అనీల్గాడి సోది!

  1. సోది అన్నారు కానీ, చాలా చక్కగా చెప్పారు.. మొత్తం చదివే వరకు ఆప బుధవలేదు.
    అక్కడక ముద్రా రాక్షసాలు ఉన్నాయి సరి చూసుకోండి.

    మెచ్చుకోండి

    1. You described it very well Harsha, this is also one of the art and you demonstrated, even am from same background, from Govt school, Govt college, commerce, MBA, Finance job, finally settled in IT…. it’s a long story but yes anyone can success, confidence, honesty and humanity are very important, I always follow this, Thanks for sharing this.

      మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s