ఆధునిక తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్!

ఆధునిక తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలకంటే ముందు వచ్చినది యాత్రా సాహిత్యమే.

ఆత్మకథ లేక స్వీయ చరిత్రను ఆంగ్లములో మొదటగా వ్రాసిన తెలుగువారు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు గారు.

వారి జీవ యాత్రా చరిత్రలో భాగం గానే వారి కాశీ యాత్రను గురించి వ్రాశారు.

దాదాపు అదే దశాబ్దం లోనే వారి బంధువైన, శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీ యాత్ర చరిత్రను లేఖలు రూపంలో తన చెన్నపట్నం స్నేహితులైన శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై కు తెలిపారు.

ఇరవయ్యవ శతాబ్దపు మొదటి పాతికేళ్లలో, తెలుగునాట అక్షరాస్యత చాలా తక్కువైనప్పటికీ, సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆనంద డోలికలలో ఊగించిన పుస్తకములుగా ప్రముఖమైనవి —-

చిలకమర్తివారి “గణపతి”,

ముని మాణిక్యం వారి “కాంతం”,

మొక్కపాటివారి “బారిష్టర్ పార్వతీశం”

మరియు

మధిర సుబ్బన్న దీక్షితుల గారి “కాశీమజిలీ కథలు”.

“గణపతి”, “కాంతం” కేవలం హాస్యరస స్ఫోరకములు.

హాస్యముతోపాటు యాత్ర విశేషాల వివరణాత్మక చిత్రీకరణలకు, జనప్రియమూ అయిన ట్రావెలాగ్ గా మన మొక్కపాటివారి బారిష్టర్ పార్వతీశం ప్రసిద్ధి కెక్కింది.

(మొక్కపాటి వారి అబ్బాయి కూడా త్వరలో శతాయుష్కుడు కాబోతున్నాడు)

ఒక వ్యక్తి ఆహార్యం, ఆంగికము (చేతులూపటము, కనుబొమ్మలు ఎగర వెయ్యటం వగైరా) వాచ్యము ద్వారానో, సన్నివేశపరంగా – చర్య, ప్రతి చర్య వలనో హాస్యం సృష్టింప బడుతుంది.

పొరపాటు, మరో పొరపాటు, ఆపైన మరోదానికి మూలమై, ఒకదాని తర్వాత ఇంకొకటి సంభవిస్తుంది.

పార్వతీశం పాత్ర, సంభవతః మూర్ఖుడు కాదు, పరిస్థితులచే వెక్కిరింపబడుతాడు. ఆ పాత్ర ఎదుర్కున్న సంఘటనల్ని మనము కూడా మన జీవితాలలో ఎప్పుడో ఎదుర్కొని ఉన్నట్టు అనిపిస్తుంది.

అట్టి సందర్భాల సమాహారం ఈ మన “బారిష్టర్ పార్వతీశం”. అయితే ఈ పుస్తకము హాస్యానికే పరిమితమైనది అని అనుకుంటే పొరపాటు . ఇది ఒక యాత్రా చరిత్ర కూడానూ.

అది ఎలా అంటే, గోదావరి, సముద్రంలో కలిసే ప్రదేశానికి పడమటి దిక్కున వున్న మొగల్తూరు గ్రామవాసి మన నాయకుడు పార్వతీశం.

అతడక్కడే టేలర్ ఉన్నత పాఠశాలలో ఒక సంవత్సరమే చదవ వలసిన అయిదవ ఫారం రెండు సంవత్సరములు చదివి, ఇక చాలు అనుకోని, అప్పటి పాలితుల రాజధాని అయిన లండన్ వెళ్లి బారిష్టర్ కావాలి అనుకొని, అక్కడికి బయలుదేరటంతో కథ ప్రారంభం అవుతుంది.

ఆ రోజులలో భారత దేశంలో న్యాయశాస్త్రం చదివితే వకీలు అనేవారు, అదే బ్రిటన్ లోని లండన్ లేక ఎడింబరో లో న్యాయశాస్త్రం చదివితే బారిష్టర్ అనేవారు.

బారిష్టర్ కి హోదా మరియు రాబడి ఎక్కువ కూడాను.

అతని అసందర్భపు ప్రలాపాలు, చర్యలు, ప్రతి చర్యలు, సంకల్పితాలు, అసంకల్పితాలు నవ్వు పుట్టిస్తాయి.

మనల్ని ఆనందింపజేస్తూ, తాను ఆనందిస్తూ భారత దేశము నుండి ఆంగ్లదేశానికి తీసుకెడతాడు మన హీరో పార్వతీశం.

పార్వతీశం ఒక కల్పిత పాత్ర అయినప్పటికీ, ఆ పాత్ర మూలాలు సృష్టికర్త మొక్కపాటి వారివి. మొక్కపాటివారు కూడా మొగల్తూరు నుండి ఎడింబరో వెళ్లి వ్యవసాయ శాస్త్రం చదివి వచ్చారు.

వారి మీద, వారి స్నేహితుల ప్రోత్సాహం మీద పార్వతీశం పుట్టుక, ఎదుగుదల వగైరాల మీద మొత్తము మూడు భాగాలుగా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకు వచ్చారు.

1924 సంవత్సరములో ఆయన మొదటి భాగం మాత్రమే వ్రాశారు. అదే పునః ప్రచురణ 1937 మరియు 1952 లలో అచ్చు అయినది.

కానీ నలభై ఆరు సంవత్సరముల తర్వాత 1970 -71 సంవత్సరములో మొక్కపాటివారు రెండవ, మూడవ భాగములు వ్రాసి “తన పార్వతీశం” మీద ఆయనకున్న వున్న ఎనలేని మక్కువను మనకి చూపించారు.

కానీ బహుజనాభిప్రాయం ఏమిటంటే – మొదట భాగపు స్పిరిట్ రెండవ మరియు మూడవ భాగాలలో లేదు. కానీ ఆ అభిప్రాయంతో రచయిత విభేదించటం జరిగింది.

అంతే కాదు, కొత్త వినోద మాధ్యమము అయి అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న చలన చిత్ర ప్రపంచం లోకి కూడా పార్వతీశం అడుగుపెట్టాడు.

1940వ ప్రాంతములో శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారు “బారిష్టర్ పార్వతీశం” అని నాలా రామమూర్తి, జి.వరలక్ష్మి కథానాయకా, నాయికలుగా సినిమా తీశారు.

మరో విచిత్రం కూడా.! ఆ రోజుల్లో “బారిష్టర్ పార్వతీశం “, ” బోండం పెళ్లి” అనే మరో హాస్య చిత్రము, ఈ రెండు సినిమాలు కలిసి ఒకే సినిమాగా ఇంటర్వెల్ ముందు ఒకటి ఇంటర్వెల్ తరువాత ఒకటి, ఒకే టికెట్ పై రెండు సినిమాలు అన్నట్టు, శివరాత్రి మరియు ముక్కోటి జాగరణలకు వేసే మాదిరిగ ప్రదర్శించారు.

ఇక్కడ కూడా పార్వతీశం ఒరవడిని సృష్టించాడు.

అదే మాదిరి బాలల చిత్రాలుగా అపుడే “ధ్రువ” మరియు “సతీ అనసూయ” అనే చిత్రములు ఒకటిగానే విడుదల అయ్యాయి. అన్నీ డబ్బులు చేసుకున్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s