తరలి రాద తనే వసంతం

‘తరలి రాద తనే వసంతం’ అనే నా పాట తోనే ఆ రోజు ఇళయరాజా లైవ్ కన్సెర్ట్ మొదలయ్యింది.

నేను పాడుతుంటే ఇళయరాజా చేతులూపడం మానేసి నా వైపే తన్మయత్వంతో చూస్తున్నారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు వరసలో కూర్చుని తల తెగ ఊపేస్తున్నారు.

ఇంతలో ఎక్కడో కోరస్ మధ్య లోంచి, మా ఆవిడ గొంతు, ఇంక పాడింది చాలు నిద్ర లోంచి లెమ్మని.

కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే పూజ గదిలోంచి వచ్చిన మా ఆవిడ , ఆ పక్కనే ఆ రింగ్ టోన్ తో మొబైల్ లోంచి నన్ను దీనం గా చూస్తున్న మా వెంకటరమణ మొహం కనపడ్డాయి.

ఇంత పొద్దున్నే వీడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడో అని అనుకుంటూ ఫోన్ ఎత్తాను.

చిరాగ్గా మా వాడి గొంతు ఫోన్ లో, ఎన్ని సార్లు రింగ్ చెయ్యాలి రా. ఫోన్ ఎత్తి చావొచ్చు గా అని.

ఎత్తాను గా! విషయం చెప్పండి రవణ గారు, అన్నాను, తెచ్చిపెట్టుకున్న వినయంతో.

ఇప్పుడు దుబాయ్ లో ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కుతున్నాను పది గంటలకల్లా హైదరాబాద్ లో వుంటాను. ఎయిర్ పోర్ట్ కొచ్చి, పిక్ అప్ చేసుకో. అట్టానే రెండు జతల బట్టలు సర్దు కొని, ట్యాంక్ ఫిల్ చేస్కొని తగలడు, అన్నాడు వాడు, వాడి యూజువల్ స్టైల్ లో.

విషయం ఏందీ అడిగాను నేను.

ఏం! చెప్తేగానీ రావా అన్నాడు వాడు.

వెంటనే ‘వస్తున్నా లే’ అని చెప్పి ఫోన్ పెట్టేసాను. మొగుడి తిట్ల కంటే, పెళ్ళాం గోల తో రోజు మొదలు పెడతామని డిసైడ్ అయిపొయ్యి.

స్నానం చేస్తూ వాడి గురించే ఆలోచిస్తున్నా!,

నాది వాడిది చిన్నప్పటి స్నేహం. హైదరాబాద్ లోనే కల్సి చదువుకున్నాం, ఇంటర్ దాకా.

ఇది కాక వాళ్ళ తాత గారి వూరు, మా తాత గారి ఊరి పక్క పక్క నే ఉండడంతో, స్కూల్ సమ్మర్ హాలిడేస్ గూడా, మేము ఇద్దరం, ఒకే వూళ్ళో గడిపేవాళ్ళం . ఇది గాక మా నాన్న, వాళ్ళ నాన్న కొలీగ్స్.

ఇప్పుడు వాడి సంసారం అమెరికా లో. వాళ్ళ నాన్న గార్ని, అమ్మగార్ని కూడా అక్కడికే తీసుకెళ్ళిపొయ్యాడు పదేళ్ల క్రితం .

చిన్నప్పట్నుంచి. వాడు అదో టైపు. మా వూరు మా ముసునూరు అని తెగ ఫీల్ అయ్యేవాడు.

మేము కాలేజీలో వున్నప్పుడు, వాళ్ళ తాత గారు పోతే, రవణ వాళ్ళ నాన్న గారు వూళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తుంటే చాలా ఇబ్బంది పడ్డాడు మా వాడు.

ముసునూరులో ఏవన్నా సెటిల్ అవుతావా నువ్వు! అని వెటకారంగా అడిగితే, అది కాదు మావా! ఎదో ఒక కనెక్షన్ అంటూ ఉండాలి గదా మన ఊరితో, అంటూ బాధ పడి పొయ్యాడు.

మా ఆవిడ బాత్రూం తలుపు బాదుతుంటే ఈ లోకంలోకి వచ్చాను.

బ్రేక్ ఫాస్ట్ చేసి బయట పడ్డా.

ఫ్లైట్ ఒక గంట లేటు. మా వాడు కార్లో కూర్చుని, వాడే వీల్ తీస్కొని చెప్పాడు, ముసునూరు వెళుతున్నాం మనం అని.

ORR దిగంగానే , వాడి ఫోన్ రింగ్ అవ్వడం మొదలయ్యింది. స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే , వాళ్ళ అమ్మగారు.

స్పీకర్ లో వున్నావే నువ్వు! చెప్పాడు మా వాడు.

సుబ్బు గానీ వచ్చాడా ఎయిర్ పోర్ట్ కి అడిగింది ఆవిడ నన్ను గురించి, ఉభయ కుశలోపర్లు అయ్యాక చెప్పింది ఆవిడ నాతో, ఊరి రామాలయం లో ఇవ్వడానికి కొత్త బట్టలు తీసుకెళ్లడం మర్చి పోవద్దని.

పెట్టేసే ముందర రమణ తో చెప్పింది, వూర్లో జాగర్త! గొడవలకెళ్లొద్దు! అని.

గొడవలేంది! అడిగాన్నేను రమణని .

చెప్పడం మొదలు పెట్టాడు వాడు ,

వూళ్ళో పొలాలన్నీ అమ్మేసాం గానీ, ఈ మధ్యే తెల్సింది, ఒక రెండు ఎకరాలు మిగిలి పొయ్యాయి అని.

ఈ మధ్య, పక్కూరి రంగా రావు గారు, కొత్త గా ఫ్యాక్టరీ పెడదామని, మన వూర్లో పొలాలు సర్వే చేయిస్తూంటే, ఈ రెండెకరాలు మన పేరు మీద ఉన్నాయని బయట పడింది.

కానీ పేపర్లు మా పాలేరు ‘దేవయ్య’ గుర్తున్నాడు కదా. అతని దగ్గరే ఉన్నాయని తెల్సింది. అమ్మడానికి వీల్లేదు అని దేవయ్య గొడవ చేస్తున్నాడట.

అతను ఇప్పుడు వూర్లో కొత్తగా కట్టిన చర్చి కి పాస్టర్ గూడ అయ్యాడట.

ఒక్కో ఎకరం ఇప్పుడు యాభై లక్షలు ఉందట రేటు.

కొంచెం టైం కుదరడంతో, విషయం తేల్చుకుందామని వెంటనే బయలుదేరి వచ్చాను అని చెప్పాడు.

పిడుగురాళ్లలో కారు ఆపి, భోజనం చేసి, వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు రాముల వారికి పెడదామని ఒక చీర, పంచెల చాపు తీసుకున్నాం.

దార్లో అంతా రమణ ఏం మాట్లాడలేదు పెద్దగా. పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయేమో! ముభావం గానే వున్నాడు . చెప్పాగదా ఇంతకుముందు, వాడి ఊరి తో, డిస్ కనెక్షన్ గోల గురించి.

కావలికి చేరుకునేటప్పటికీ రాత్రి ఎనిమిది అయ్యింది.

ముసునూరు కావలికి రెండు కిలోమీటర్ల దూరం. నైట్ స్టే కావలిలో వుండే హోటల్ లో చేద్దామని ఆగి అక్కడున్న, ఒక చిన్న హోటల్లో దిగేసాం.

ముందు, నేను స్నానం చేసి, బాగా అలసట గా ఉండడంతో, వాడు బాత్రూం నించి బయటకొచ్చేలోపల, మంచం మీద పడి నిద్ర పొయ్యాను.

ఎదో శబ్దం అయ్యి కళ్ళు తీర్చి చూస్తే, టైం రాత్రి పదయ్యింది.

రమణ నా పక్కనే, మంచం మీద, లాప్ టాప్ ముందర వేస్కొని కూర్చోనున్నాడు.

నన్ను చూసి, చేస్తున్న పని ఆపి అడిగాడు వాడు, ఈ హోటల్ లో రూమ్ సర్వీస్ లేదు. కింది కెళ్ళి భోజనం చేద్దామా అని.

రెండు ఫ్లోర్లు దిగి వెళ్తే, కింద రెస్టారెంట్ అనబడే ఒక వరండా లో టేబుల్స్ వేసి వున్నాయి .

మేము వెళ్లేసరికి అంతా సర్దేస్తున్నారు క్లోసింగ్ టైం కావడం తో.

వెయిటర్ చెప్పాడు. రైస్ కాకుండా ఐటమ్స్ పెద్ద మిగిలి లేవని.

ఏం వుంది అడిగాన్నేను?

వంకాయ కూర తప్ప ఏం లేదు చెప్పాడతను.

ఇద్దరం మొహ మొహాలు చూసుకున్నాం.

నన్ను కలిసిన దాదాపు పది గంటల తర్వాత, గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు మా రమణ. నేను నవ్వడం మొదలు పెట్టాను. ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావడం తో. చిన్నపట్నుంచి మా రమణ గాడు వంకాయ కూర అంటే పడి చచ్చేవాడు. వాడు నేను, ఒకసారి సెలవలకి ముసునూరు వెళ్తే, వంకాయ కూర రూపం లో మా వాడికి పెద్ద ప్రమాదం వచ్చి పడింది.

అదేమిటంటే, మేం సెలవలకి వూరు చేరే నెల ముందర వాళ్ళ తాత గారు, బామ్మ గారు కాశీ కి వెళ్లి, ఇష్టమైంది ఏదన్నా వదిలి పెట్టాలి అనిచెప్పి, వంకాయ కూర వదిలేశారు. సో, మేము వూరు చేరేటప్పటికి మా వాడికి తెల్సింది ఇంక ముసునూరులో వున్న, ఆ నెల మొత్తం వంకాయ కూర వాళ్ళింట్లో వండరు, అని చెప్పి.

ఇట్టి క్లిష్ట పరిస్థితుల్లో, ఒక రోజు వాళ్ళ దేవయ్య పాలేరు తో పొలానికి వెళ్లి అక్కడ అతను తెచ్చుకున్న వంకాయ కూర మేము ఇద్దరం తినేసాం.

ఇంటికి వచ్చేలోపల, ఈ విషయం చారుల ద్వారా బామ్మ గారికి ఎలానో తెలిసిపోయింది. మేము ఇంటికి వచ్చేటప్పటికి సీను ఏందంటే, ఇంటి ముందు వసారాలో వాళ్ళ తాత గారు వాలు కుర్చీ లో కూర్చొని పేపర్ చదువుతున్నారు.

పక్కనే వున్న బావి పక్కన, ఆగ్రహోదగ్రురాలై వాళ్ళ బామ్మ గారు, నడుము మీద చెయ్యి వేస్కొని నిల్చోనున్నారు. మేము అడుగు పెట్టంగానే, బామ్మ గారు మా వైపుకి లంఘించి, ఏకధాటిగా, సహస్ర నామాల తో మమ్మల్ని స్తోత్రం చెయ్యడం మొదలు పెట్టారు.

అంత కొంపలు ఏం ముణిగాయనీ? అడిగారు తాత గారు ఒక ఐదు యుగాలో, నిమిషాలో గడిచిన తర్వాత.

ఏం అయ్యిందంటారేమిటి, ఈ పిల్ల వెధవలిద్దరూ, తిన రాని చోట తిని నేరుగా ఇంటికి వస్తే అన్నారు కోపం గా బామ్మ గారు.

ఓ రెండు క్షణాలు మా మొహాల్లో కి చూసి, మళ్ళీ పేపర్లో తల దూర్చారు తాత గారు.

అలా నిమ్మకి నీరెత్తినట్టు , మాట్లాడరేమిటి మీరు , అయినా దేవయ్య రేప్పొద్దున వచ్చినప్పడు చెప్తాను సంగతి అని, రెట్టించారు బామ్మగారు.

ఆ దేవయ్య చేతుల్తో పండించిన వంకాయలతో చేసిన కూర, మన ఇంట్లో వున్న రాముడికి మహా నైవేద్యంగా పెట్టినప్పుడు, లేని అభ్యంతరం, అదే చేతుల్తో వండిన కూర మన రమణ గాడు తింటే, ఉండగూడదేమో అన్నారు తాత గారు గుంభనంగా , పేపర్ లోంచి తలెత్తకుండా.

ఏం అనుకున్నారో ఏమో, ఆ మాట విన్న బామ్మ గారు, గబ గబా బావిలోంచి రెండు చేదలు నీళ్లు తోడి మా నెత్తిన పోసి, ఇంట్లోకి రమ్మన్నారు. ఇంక అక్కడ మేమున్న మిగతా నెల రోజులు, మా రమణ, వంకాయ మాటెత్తితే ఒట్టు.

గతం లోంచి వర్తమానం లోకి వచ్చి, భోజనం కానిచ్చి రూమ్ కి వెళ్లి పడుకున్నాం. నాకు నిద్ర పట్టింది కానీ, రమణ మటుకు రాత్రంతా లాప్ టాప్ ముందే వున్నాడు, కళ్లంతా ఎర్రగా చేసుకొని.

పక్క రోజు ఉదయాన్నే ముసునూరు వెళ్ళేటప్పటికి, పొలం కొనాలనుకునే, పక్కూరి రంగారావు గారి తరఫున, వాళ్ళ అల్లుడు, రాజేష్, నెల్లూరు నుంచి వచ్చి మాతో కలిసాడు, రోడ్డు మీద.

ముసునూరు, వూరు గుర్తు పట్టలేనంత గా మారి పొయ్యింది. ఊరి కి రెండు కిలోమీటర్ల దూరం లో రమణా వాళ్ళ పొలం. పొలం పక్కనే, కొత్త గా ఇల్లు కట్టుకున్నాడు దేవయ్య, అని రాజేషే చెప్పాడు.

రాజేష్ ని కార్లో ఎక్కించుకుని బయలు దేరాం దేవయ్య ఇంటికి.

వాళ్ళ ఇంటికి వెళ్లే దార్లో నే రామాలయం కనిపిస్తే , మా వాడు అన్నాడు, పని పూర్తి అయింతర్వాత దర్శనం చేసుకొని, రాములవారికి వస్త్రాలు ఇద్దామని.

నేరుగా వెళ్లి దేవయ్య ఇంటి ముందర ఆగాం…. రోడ్డు మీద. పొలం పక్కనే ఇల్లు. ఓ రెండు మూడు గదుల ఇల్లు. మిద్దె మీద ఇంకా ఒకటో రెండో గదులు ఉన్నట్టున్నాయి. ఇంటి పైన శిలువ. ఇంటి ముందర ఓ చిన్న వసారా.

పక్కనే ఒక చిన్న బోర్డు, ‘పాస్టర్ దేవరాజు ‘ అనిచెప్పి.

దేవయ్య కదా పేరు అన్నాన్నేను. మార్చుకున్నట్టున్నాడు అన్నాడు క్లుప్తం గా ఇంటి పైనున్న శిలువ వైపు చూస్తూ రమణ.

ముగ్గురం గేట్ తీస్కొని, లోపలి వెళ్తే, దేవయ్య ఇంటి బయటే కుర్చీలో కూర్చున్న వాడు, మమ్మల్ని చూసి, లేచి ఇంట్లోకి తీసుకెళ్లి , కూర్చోపెట్టాడు.

రమణ ని వెంటనే గుర్తు పట్టి మాట్లాడం మొదలు పెట్టాడు.

నన్ను గుర్తు పట్టలేదనుకుంటా…

ఈ లోపల నా మొబైల్ ఒకటే మోగడం మొదలైంది. రెండు సార్లు చూసి చెప్పాను నేను . ఫోన్ మాట్లాడుతూ బయట వుంటాను అనిచెప్పి.

ఆలా మాట్లాడుకుంటూ ఇల్లు దాటి కొంత దూరం వెళ్ళిపోయాను. అవతల్నించి ఒక కస్టమర్ కాల్. వదిలిపెట్టట్లేదు పదిహేను నిమిషాల పైన కంటిన్యూ అవుతూనే వుంది..

ఫోన్ మాట్లాడుతూ, దూరం నించి ఇంటి వైపు చూసాను. రమణ ఇంట్లో నించి కార్ దాకా వచ్చి మళ్ళీ ఇంట్లో కి వెళ్ళాడు.

నా కాల్ కంటిన్యూ అవుతూనే వుంది, ఫైనల్ గా, రమణ, రాజేష్ ఇంటినించి బయటకొచ్చి, కార్ తీస్కొని నా వైపే వస్తే కార్ ఎక్కాను.

ముసునూరులోకి వచ్చింతర్వాత, రాజేష్ కారు దిగితే నేను రమణ కూడా దిగాము.

రాజేష్ కి సెండ్ ఆఫ్ ఇచ్చే లోపలే, ఎవరో తెల్సిన వాళ్ళనుకుంటా. కార్ దగ్గరికొస్తే గుర్తు పట్టి రమణ గబ గబా, వాళ్ళ తోటి కొంచెం దూరం గా వెళ్లి , మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

నా కాల్ అయిపోయింది.

రాజేష్ వైపు తిరిగి అడిగాను. ఏమయ్యింది వాళ్ళింట్లో అని ?

నిరుత్సాహంగా చెప్పాడతను.

మీ రమణ వాళ్ళ తాత గారు, ఈ పొలం పేపర్లు దేవయ్య చేతిలోపెట్టి చెప్పారట, ఈ పొలం నువ్వే చూసుకోవాలని, మీ రమణ గూడ, వాళ్ళ తాత గారి మాట తీసెయ్యడం ఇష్టం లేకో లేదా దేవయ్య తో గొడవపడ్డం అనవసరం అనో, మీకు పొలం అమ్మట్లేదు అని, నాకు వాళ్ళ ఇంటి నించి బయటకు రాంగానే చెప్పేసారు.

ఈ లోపలే పక్కకి వెళ్లిన రమణ తిరిగి కార్ దగ్గరికి వచ్చాడు. రాజేష్ కి సెండ్ ఆఫ్ ఇచ్చి హైదరాబాద్ కి బయలు దేరాం. నేనే డ్రైవ్ చేస్తున్నా.

మా రమణ మొహం ప్రశాంతం గా వుంది. కళ్ళు మూసుకొని సీటు వెనక్కి, జారగలబడి కూర్చున్నాడు.

ఏం చేసావు అక్కడ అడిగాన్నేను.

ఏం లేదు, ఊరి తో కనెక్షన్, ఎప్పుడూ కట్ కాలేదు, అన్నాడు రమణ ఆర్థోక్తిగా.

తెలుగులో చెప్పు ? అడిగాన్నేను.

చెప్పాడు వాడు. ఈ పొలం మీద వచ్చే ఆదాయం అంతా రామాలయం కి వెళ్లేట్టు చూడు అని చెప్పారట మా తాత గారు, దేవయ్య కి. ఇన్నాళ్లు గా అదే పని చేస్తున్నాడట ఈయన. ఈ మధ్యలోనే ఫ్యాక్టరీ పెట్టడానికి, పొలం అమ్మాలని వత్తిడి వస్తే కుదరదని గట్టిగా చెప్పాడట.

ఇదంతా మధ్యలో వుండే వాళ్ళు , దూరాన వున్న, మాకు వేరే రకం గా మోసేసారు , గుళ్ళూ చర్చిలూ అంటూ.

నాకు దేవయ్య విషయం అంతా చెప్తే, కాయితాలు ఆయన దగ్గరే ఉంచి పొలం జాగర్తగా చూసుకోమని చెప్పాను.

నాకు ఏమి అంతా కన్విన్సింగ్ గా లేదు అన్నా నేను, వాడు చెప్పిందంతా విని.

వాడేం మాట్లాడలేదు.

మరు క్షణం లో నేనే అన్నాను, ఒరేయ్ రమణా అమ్మ పెట్టమన్న వస్త్రాలు గుళ్లో ఇవ్వడం మర్చిపొయ్యాం వెనక్కి వెళ్ళ్లాల్సి వస్తుంది అని తల బాదుకుంటూ.

అదేమీ పట్టించుకోకుండా అన్నాడు రమణ ,

నిజవే, నాకు ఆ ఇంటి వాతావరణం, చూసి, దేవయ్య చెప్పేది మొదట్లో నమ్మాలనిపించలేదు.

వెళ్లిన పది నిముషాల్లో పొలం కాగితాలు నా చేతి లో పెట్టాడ్రా .ఆయన.

కానీ ఇచ్చేటప్పుడు నా కళ్ళలోకి సూటిగా చూసి ఆయన ఒక మాటన్నాడు రా సుబ్బూ…..

నేను పేరు మార్చుకున్నాగాని, మీ తాత గారికి ఇచ్చిన మాట కాదు అని.

అది విన్న తర్వాత , నేను కారులో వున్నా వస్త్రాలు తీసుకొచ్చి, పొలం కాగితాలు తో పాటు, రెండూ ఆయన చేతిలో పెట్టి చెప్పాను, “రాముల వారి గుళ్లో ఆ వస్త్రాలిమ్మని, రాముల వారిని బాగా చూసుకోమని”.

ఆ తర్వాత నాకు వాణ్ని , ఇంకేమి అడగాల్సిన అవసరం కనపళ్ళేదు.

FM ఆన్ చేసాను కార్లో. ఎస్పీబీ నాకంటే బాగా పాడుతూ వినిపించడం మొదలు పెట్టాడు . ‘తరలి రాద తనే వసంతం” అని.

26 thoughts on “తరలి రాద తనే వసంతం

  1. చాలా బాగుంది అనిల్ మామా…ఇంపైన భాషతో రాసిన కథను వినసొంపైన ఉచ్ఛారణతో రక్తి కట్టించావు…

    నిజానికి నీ చక్కనైన వ్యాఖ్యానం ఈ కథలోని విభిన్న పాత్రలను శ్రోతల కళ్ళముందు నిలిపింది…

    అదిసరే ఇది ఫిక్షనా! లేక నిజంగా జరిగిందా!?

    ఎందుకంటే చివర్లో దేవయ్య మీ రమణ చేతిలో కాగితాలు పెడుతూ చెప్పిన మాటలు దానికి రమణ స్పందించిన తీరు అద్భుతంగా వున్నాయి…కానీ ఇవి కేవలం కే.విశ్వనాధ్ సినిమాలలో మాత్రమే సాధ్యమౌతాయని నా ఫీలింగు..

    ఒకవేళ నిజంగా జరిగితే మాత్రం అద్భుతం..

    అభినందనలు మామా!

    P.S: Reading Harshaneeyam after a long time as i am bit busy…will try to cover the rest as and when possible…

    As i always says, i really love Harshaneeyam for the soul and Honesty in the writings!

    Congrats Harsha, Anil and others!!

    మెచ్చుకోండి

  2. చాలా బాగుంది గురూగారూ..

    “నేను పేరు మార్చుకున్నాగాని, మీ తాత గారికి ఇచ్చిన మాట కాదు అని”..
    మనస్సుకి హత్తుకుంది..

    ఈ మధ్యనే మీ బ్లాగు పరిచయం అయింది.. మీ మిగతా టపాలు ఒక్కొక్కటీ ఇప్పుడుప్పుడే చదువుతున్నా.. మీదైన మీ రచనాశైలి, పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి.

    మెచ్చుకోండి

    1. మీ ప్రోత్సాహానికి మా కృతజ్ఞతలు రవి గారు. ఈ బ్లాగ్ లో ఎక్కువ కథలు నా స్నేహితుడు హర్ష వ్రాసినవి. అనిలాయనం పేజీ క్రింద వ్రాసినవి నావి , మరి సుందర కాలం క్రింద వచ్చినవి మా గురువు గారు , శ్రీ సుందరబాబు గారివి.

      మెచ్చుకోండి

  3. నమ్మకం అన్నది ఒక గొప్ప అనుబంధం. ఇది సమాజంలో గొప్ప మార్పులను, అవకాశాలను తెస్తుంది.
    కుటుంబంలో అందరితో బాధ్యతగా మెలిగి వారి మన్ననలు పొంది జీవిత మూలాల పట్ల గౌరవం చూపిస్తూ ఏదో సాధించాలన్న ప్రయత్నం ప్రశంసనీయం. కానీ దాని మూల్యం ఎంతంటే నా మొదటి మాట నమ్మకం అంత అలాగే నమ్మటం అంత కూడా!!
    నాకు దేవయ్య అలియాస్ దేవరాజుగారు అదే నమ్మకానికి, విధేయతకు నిలువెత్తు అద్దంలా అగుపించారు. విషయాలు ఆయన చేతుల్లో చాలా సురక్షితంగా ఉన్నాయని ఎవరికి తెలియాలో వారికి అర్థమైంది. మొత్తం కథలో ఓ చిన్న పాత్ర పోషించినా ఖచ్చితంగా దేవయ్యే నా హీరో.
    మాట కోసం బాధ్యతలను అప్పజెప్పిన యజమానికి అతనికి మద్య ఉన్న అనుబంధం అసాధారణం. ఒక విషయం ఐతే ఖచ్చితంగా చెప్పొచ్చు.. అతను ఉన్నంత వరకు ఆ నమ్మకం అలాగే ఉంటుంది. మనం అక్కడి భౌతిక ప్రపంచ సమస్యలను విస్మరించవచ్చు.
    ఇక్కడ తరాల మధ్య వారధిగా నిలబడి బాంధవ్యాల విలువలను నేర్పించిన తల్లిదండ్రులను మనం మరువరాదు.
    చివరి మాట :
    దేశం కాని దేశంలో ఉంటున్న వారికి నమ్మకంగా ఉన్న దేవయ్యకు ఆ పట్టు వస్త్రాలు చెందితే ఆ ఆలయంలోని దేవుళ్ళు కూడా ఆనందించేవారేమో 🙏

    మెచ్చుకోండి

    1. చాలా చక్కటి విశ్లేషణ రవికాంత్. కథ సారాంశం అంతా మూడు నాలుగు వాక్యాలలో అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా దేవయ్య కి వస్త్రాలిచ్చినా కూడా, కథ చాలా చక్కగా ముగిసేది.

      చాల థాట్ ఫుల్ గా ఉంటున్నాయి మీ కామెంట్స్.

      కథ పబ్లిష్ చేసిన ప్రతీసారి , మీ వ్యాఖ్య కోసం ఎదురు చూసేంతలా.

      మెచ్చుకోండి

  4. Very good story story about Trust and human emotions. The way Ramana reacted initially about is true (should I dare to say normal) in today’s world. Very few may react the way he did in the end. However, Devaraj’s stand on Trust and sticking to the word is Amazing.

    Excellent story telling with apt title Anil.

    మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s