అప్పుడప్పుడూ ‘ఉదయించే’ మా సుడిగాడు!

“బాస్, ఏ బ్రాంచ్ నీది”, అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.

“ఫౌండ్రి ఇంజనీరింగ్”

“అదేంటి బాస్, పోయి పోయి, ఆ బూజు పట్టిన బ్రాంచ్ తీసుకున్నావా?, ఇక్కడ మెకానికల్ వాళ్లకి మెషీన్ టూల్స్ బ్రాంచి అన్నిటికంటే బెస్టు. నేనదే తీసుకున్నా!”

నేను ఖరగ్పూర్లో పీజీ చేరిన ఐదు రోజుల్లోనే, నాకీ ఉపదేశం చేసిన పదో కృష్ణుడు – రామారావు.

ప్రొడక్షన్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్లల్లో చేరిన ప్రతీ వాడూ నాకెదురైతే చెప్పేవాడు – “ఫౌండ్రి ఇంజనీరింగ్ ఓ బూజు పట్టిన కోర్స్” అని.

అసలే నాకు తిక్క తిక్క గా వుంది, మంచి స్కోర్ వచ్చి కూడా ఆప్షన్స్ సరైన క్రమంలో పెట్టకుండా ఫౌండ్రి ఇంజనీరింగ్ లో పడ్డందుకు.

ఈలోపల ఓ ఆజానుబాహుడొచ్చి వాడికి వాడే , “మామ, నా పేరు ఉదయ్, కడప దగ్గరున్న కమలాపురం నుంచి వచ్చా, బ్యాచలర్స్ మెకానికల్, ఎస్.వీ.యు లో చదివా, ఇక్కడ ఏరో నాటికల్ లో చేరా”, అంటూ మా టేబుల్ లో పైన కూర్చొని నన్ను పలకరించేసాడు.

ఎందుకో వాణ్ని, వాడి వాలకాన్ని, చూస్తే నాలో ఏదో ఒక కొత్త ఉత్సాహం వొచ్చేసింది –

రామారావులో మటుకు వీణ్ణి చూస్తే, ఏదో బెరుకు కన్పడతా వుంది.

ఎత్తుకున్నాడు ఉదయ్ , రామారావు కళ్ళలోకి చూస్తూ సూటిగా,

“ఏరా రామారావ్, అప్పుడే నీ బ్రాంచ్ మహత్తరమైందనిచెప్పి, సావ కొట్టేశావా! ఈ శాల్తీని. మనిషిలో వుండాలిరా మొగతనం, మడిచి ఆ మెషీన్ టూల్స్ ని తీస్కెళ్ళి జేబులో పెట్టుకో ! అంతకంటే ముందు, పప్పో సాంబారో అర్థం కాని ఆ సంకరజాతి సాధకాన్ని, నా ముందుకు నెట్టు” అంటూ రామారావుని తోమి పారేసాడు.

ఆ రెండు నిమిషాల “గ్రాండ్ ఇంట్రో” తో ఉదయ్ గాడి తో, పెర్మనెంట్ గా కనెక్ట్ అయిపొయ్యా! నేను.

క్యాంపస్ అంతా చెడ తిరిగేవాళ్ళం ఇద్దరం.

కనపడ్డ క్లాస్ మేట్ లని, వాళ్ళ పేర్లకి ముందు ఒక బీప్ పదం, వెనక ఒక బీప్ పదం తో వీడు పలకరించడం,

వాళ్ళు “వీడితో పెట్టుకోగూడదురా” నాయనా! అంటూ సణుక్కుంటూ పక్కకెళ్లి పోవడం, నాకైతే చాలా నచ్చేసేది.

నన్ను కూడా అలాగే బీపులతో పలకరించే వాడు

దేశం కానీ దేశంలో, నా పేరుకు ముందు వెనకా, ఆ అచ్చ తెలుగు బీపులు వింటుంటే, ఒళ్ళంతా పులకరించిపొయ్యేది నాకు.

ఇది గాక మా ఉదయ్ గాడు అభిమాన ధనుడు, సుయోధనుడు. మాట పడే వాడు కాదు.

మాటకి మాట ఉండాల్సిందే – అవతల వాడు ఎవడైనా సరే.

ఎందుకురా ఈ మొండి వాగుడంటే –

దానికి వాడి సమాధానం –

“అమ్మా, నాన్నలు బడిలో స్కూల్ మాస్టార్లు రా హర్షా! మా నాయన నేను పుట్టంగానే, నా ఫేసు చూసి, “ఈ నా యొక్క కొడుకు ఒక మొండి నా పుత్రుడు, నా పేరు విషయంలో, నీ జోక్యం ఏందీ? అని రేపొద్దున, నన్ను నిలదీసే లక్షణాలు వీడి మొహం లో బాగా కన్పడుతున్నాయి అనుకోని ఏం జేసాడో తెలుసా ” ?

“చెప్పరా ! బాబూ , చాలా ఇంటరెస్టింగ్ గా వుంది” అన్నా !

“నాకు ఐదో ఏడు వచ్చి, స్కూల్ లో వేసే ముందు దాకా అసలు పేరే పెట్టలా. స్కూల్లో వెయ్యబోయ్యే ముందు, నా ముందు ఓ పది పేర్లు పెట్టి, నువ్వే చెప్పరా! ఈ పేర్లల్లో నీకేది నచ్చిందో, రేపొద్దున చెత్త పేరు పెట్టావు అంటూ నన్ను సతాయించ కుండా” అన్నాడు మా బాబు.

“అప్పుడు ఉదయ్ భాస్కర్ అని నాకు నేనే పేరు పెట్టేసుకున్నా ! కానీ నా ఫ్రెండ్సంతా, ఎందుకో ఉదయ్ లో, వై తీసేసి ఎక్స్ పెట్టేసి ఉడాక్స్ అంటార్రా, కావాలంటే నువ్వు కూడా పిలుచుకో”.

“వద్దు లేరా, అంత మంచి పేరు నేను ఖూనీ చేయను, నాకు ఉదయ్ బాగుందిరా” అన్నా నేను.

వాడెప్పుడూ మిగతా మా అందరిలాగ ఉద్యోగం కోసమే పీజీ చదివే వాడిలా కనపళ్ళా .

ఎవరయినా ఏరోనాటిక్స్ చాలా నారో కోర్స్ కదా, ప్లేస్ మెంట్స్ వుండవు అంటే, తెలిసే కదా నేను, చేరింది. ఇక నువ్వు దొబ్బేయ్యొచ్చు అనే వాడు.

“ఏరా నీకు ఉద్యోగం గురించి ధ్యాస లేదా!” అంటే.

“ఎందుకు లేదురా!. బాచిలర్స్ అయితే కోటా మీద సీట్ తీసుకున్నా, ఆ తర్వాత కాంపిటీటివ్ గా చదివా. ఒక్క సారి వాడుకున్నాక ఇక కోటా వాడుకోకూడదు అనిచెప్పి, మెషీన్ టూల్స్ కి, జేజెమ్మ లాంటి, బ్రాంచ్ వచ్చే అవకాశం వున్నా, ఓపెన్ లో ఏరోనాటిక్స్ వచ్చింది చేరిపోయా! ప్రైవేట్ సెక్టార్ లోనే నాకు తగ్గ ఉద్యోగమే చేస్తా!”.

అలా ఇంకా దగ్గరయ్యాడు వాడు నాకు.

జనాలంతా వాడి రూమ్ కి వెళ్లాలని తెగ ఉబలాట పడే వాళ్ళు. కానీ పైకి మాత్రం, అదోలాగా మొహం పెట్టి, వాడి రూమ్ ని ట్రిపుల్ ఎక్స్ రూమ్ అని పిల్చుకునే వాళ్ళు. ఎందుకంటే వాడి రూము గోడలంతా డెబోనైర్ సెంటర్ స్ప్రెడ్ లతో అలంకరించి ఉండేవి. వాడి రూము కెళ్ళి పరిస్థితి చూస్తే, అప్పుడర్థమైంది, నాకు వాడి పేరు చివర ‘ఎక్స్’ ఎందుకు తగిలిచ్చారో వాడి ఫ్రెండ్సు.

“ఎందుకురా నీ రూంలో గోడలమీదంతా, ఈ ఎదవ ఎక్సిబిషన్, ఏదో తేడా గాడిలా ” అన్నా , ఓ సారి.

“సెమిస్టెర్ ఎగ్జామ్స్ వస్తున్నాయిగా. నా రూమ్ లో కొచ్చి చదువుకో – ఆ పరమార్థం గ్రహించుకో” అన్నాడు వాడు.

వాడి ఛాలెంజ్ స్వీకరించి, వాడి రూంలోనే ఆ సెమిస్టర్ ప్రిపరేషన్ మొదలు పెట్టా.

ఓ పది రోజుల తర్వాత నా ముందర ఓ బార్ గ్రాఫ్ పెట్టాడు. డే వన్ నుంచి డే టెన్ వరకు.

“ఏందిరా, నాయనా ఈ గ్రాఫ్ లు అంటే, – మాస్టర్స్ చదువుతున్నావు, నా పుత్రుడా!, బొత్తి గా డేటా ఇంటర్ప్రిటేషన్ తెలీదురా నీకు”, అని వాడి వ్యంగ్యోక్తి.

“అర్థ మయ్యిందిరా నాయనా. గోడ మీదున్న డెబోనైర్ అమ్మళ్లను మొదటి రోజు దొంగతనం గా 400 సార్లు చూసా, ఆపైన రోజులు గడిచే కొద్దీ, అవి 200, 100, 50 లెక్కన తగ్గుతూ వచ్చి, గత రెండు రోజులుగా, సంఖ్యలు అంకెల్లోకి వచ్చాయి”

“అదేరా హర్షాగా, నేను పాటించింది. మూస్తే ఆసక్తి, తెరిస్తే విరక్తి. ఏదైనా అంతే”, అన్నాడు చిదానంద స్వామి లా.

“ఓహ్! అయితే తమరి రూమ్ లో వుండే ఫుల్లు మందు బాటిల్స్, కూడా, ఆలా తమరి షో ఆఫ్ యేనా”

“అంతేగా మరి!”

ఒక సారి నాకు విపరీతమైన జ్వరం జ్వరం తోబాటు నీరసం గా ఉండటం తో, మా కాలేజీ డిస్పెన్సరీ కి వెళ్ళా, వాడికి చెప్పకుండా.

ఆ డాక్టర్ వూళ్ళో వైరల్ జ్వరాలున్నాయి, దిక్కు దివాణం లేకుండా హాస్టల్ రూమ్ లో పడి వుండే కన్నా, వెళ్లి కాలేజీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిపో అని సలహా ఇచ్చాడు.

నేను సక్కా వెళ్లి చేరిపోయా.

చేరటమే తెల్సు నాకు.

మళ్ళీ మెలుకువ వచ్చేసరికి చేతికి సెలైన్,అంత పెద్ద రూమ్ లో నాలుగ్గోడల మధ్య, అది పగలో రాత్రో కూడా అర్థం కాలా.

నేను తప్ప ఎవరూ లేరు.

మళ్ళీ ఎప్పటికో నాకు కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగ్గా ఉదయ్ గాడు, నా మంచం పక్కనే కూర్చోని, కునికిపాట్లు పడ్తూ.

“ఏరా! నీకెలా తెలుసురా నేను హాస్పటల్లో వున్నాను “అని

“రెండు రోజులుగా కనపడలేదురా నువ్వు. అన్ని చోట్లా వెతికా, అందర్నీ అడిగా, ఎవరూ చూడ లేదు అన్నార్రా!, నేను వెతక్కుండా మిగిలింది, ఎవడూ రాకూడదు అనుకొనే యీ కాలేజీ హాస్పిటలే! వాకబు చేశా, మొన్నటినుండి నువ్వు ఇక్కడే పడున్నావురా. ముందు ఒక్క మాటన్నా చెప్పి చావొచ్చుగా నాకు … బీప్ బీప్” అన్నాడు వాడు.

“ఏమోరా జ్వరమేగా అనొచ్చేసా ! ఇక్కడికి వచ్చాకే తెలిసింది వైరల్ అని. అడ్మిట్ అయిపో అన్నారు. అయిపొయ్యేసా !” అన్నా, నీరసంగా.

ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పి “రేపొస్తారా” అంటూ వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు లంచ్ టైం కి వచ్చాడు, ట్టాట్టడాన్, “ఏమి తెచ్చానో చూడరా హర్షా!” అంటూ ఒక కారియర్ బయటకు తీస్తూ.

“నీ పాసు కూలా!, ఎక్కడ పట్టావురా!”

” ఈ హాస్పిటల్ తిండికి నీ నోరు చచ్చున్టుందని తెల్సు రా, నిన్న మెస్ వర్కర్ కి వార్నింగ్ ఇచ్చారా, రేపు మీ ఇంటి నుండి ఖాళీ కారియర్ పట్టక రాకపోతే మర్యాద దక్కదు అని.”

“అదే హాస్టల్ కూడు నా మొహాన కొడ్తూ , మళ్ళీ నీ పెద్ద ఫీలింగు ఒకటి, నాకేదో తలంటి పోసినట్టు”

“నాకు తెలీకనా మై సన్ ! దుర్గా ప్రసాద్ సార్ ఉన్నాడు గా, ఆయన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళింటి భోజనం పట్టకొచ్చా . నీ పేరు చెప్పుకోని నేను కూడా ఆంద్ర భోజనము తింటా” అంటూ అసలు గుట్టు విప్పాడు.

అట్టా సాగిపోయింది వీడితో, ఖరగ్పూర్ లో ఉన్నన్నాళ్ళు.

వీడితో నా స్నేహం ఓ నారి కేళ పాకం.

మాస్టర్స్ అయ్యాక ఎవరి దారిన వాళ్ళం అయ్యిపొయ్యాం.. ఉద్యోగం రావటం తో నేను ఢిల్లీ కి, రాక పోవటం తో వాడు కమలాపురంకి.

మళ్ళీ వాణ్ని కల్సింది, డెన్వర్ లో 2001 లో.

నేను డెన్వర్లో ఉన్నానని ఎట్టానో తెల్సుకొని, లాస్ ఏంజిల్స్ నుంచి హుటా హుటిన వచ్చేసి ఓ వారం ఊరంతా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగేసి, నేను మర్చిపోయిన వాడి బీప్ లాంగ్వేజ్ అంతా వినిపించేసి, సుడి గాలి లా వెళ్లిపోయాడు.

పునర్దర్శనం 2011, నేను చెన్నై లో వున్నప్పుడు, “మామా మీ కంపెనీ లో ఓపెనింగ్స్ ఉన్నాయా” అంటూ.

కిందా మీద పడి మా బెంగుళూరు బ్రాంచ్ లో దూర్చా వాణ్ని.

ఎప్పుడైనా పుష్కరానికోసారి, ఫోన్ల మీద మాటలు, కష్ట సుఖాలు చెప్పుకునే వాళ్ళం.

ఇంకొన్నేళ్ల గ్యాప్ తర్వాత, “మామా ప్రస్తుతం నేను మెల్బోర్న్ లో సెటిల్ అయిపోయా” అంటూ వాడి దగ్గరనించి ఫోన్ కాల్.

ఇప్పుడు నాలుగు ఐదేళ్లనించి కాల్స్ లేవు మా సుడి గాడి దగ్గర్నుంచి.

ఈ సారి ఏ చంద్రమండలం లో వున్నాను అంటూ హడావుడి చేస్తాడో మా వాడు??.

కొన్ని పర్సనాల్టీలు అంతే !

దగ్గర లేకపోయినా, దూరం పెరగదు వాళ్ళతో.

23 thoughts on “అప్పుడప్పుడూ ‘ఉదయించే’ మా సుడిగాడు!

 1. చాలా బాగుంది. ఓ చెయ్యి తిరిగిన రచయిత రాసిన దానికంటే బాగుంది. హాస్యం, కొద్దిగా వేదాంతం జోడు గుర్రాళ్ళ పరిగెత్తాయి. హర్ష గారికి కంగ్రాట్స్. అల్ ది బెస్ట్.

  మెచ్చుకోండి

 2. ఈ కధ, కధనం సగటు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంటుకు వర్షంతో తడిసిన మట్టి వాసనలా ఎక్కేస్తుంది. అది బ్యాచిలర్స్ అయినా మాస్టర్స్ అయినా!! దుర్గాప్రసాద్ సార్ ఇంటి భోజనంలా..
  నాకు ఈ మెషిన్ టూల్స్, ప్రొడక్షన్, ధర్మల్, ఫౌండ్రీ ఇంజినీరింగ్ ఆనే శబ్దాలు వింటుంటే కడుపు, మనసు నిండిపోయింది.
  ఇది మా కధ అని గర్వంగా చెప్పుకునేలా నాలాంటోళ్ళకు మళ్ళీ ఆ రోజులు గుర్తుకు తెచ్చారు.. మెస్సు, హాస్టల్లో పోస్టర్లతో కలిపి!!
  మనకు చాలా దగ్గరగా జరిగిన విషయాలను ఇంకొకరు తమ కధగా చెబితే మనసులు పోలిన మనసులు ఉంటాయేమో అన్న ఆలోచన ఒక విచిత్రానుభూతికి లోనౌతుంది.
  ప్రస్తుతం నేను ఆ స్థితిని ఆస్వాదిస్తున్నాను.

  మెచ్చుకోండి

  1. మనసులు పోలిన మనసులు అని ఎంత బాగా చెప్పారు రవి గారు. మట్టి వాసన రావాలంటే చిరు జల్లులు కురవాలి. అలాగే కథకుడి కి మీలాటి వారి మెచ్చుకోళ్ళు.

   మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s