పెద్దంతరం చిన్నంతరం!

“కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!”

“ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!”

“కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ కూర వేద్దామనుకున్నా!”

“ఇంక ఇక రసం వేసుకొని, అరటికాయ కూర నంజుకో, ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుందురు కానీ!”

నాకర్థమయ్యింది మా అమ్మ మా నాన్న కి భోజనం వడ్డిస్తుందని, కాదు, కాదు, ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరిల్లు భార్యలా ఆయన చేయి పట్టుకునే ఉందని.

“అమ్మా! ఆయన ఏమి తినాలో కూడా నువ్వే శాసిస్తే ఎలా? ఆయన అడగ గలరు గా ఏమి కావాలో అప్పుడు అడిగింది, వడ్డించ వచ్చుగా”

“పోరా! గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందట! నువ్వు కూడా నాకు చెప్పే వాడివే”

మరి కొన్ని రోజుల తర్వాత –

“అవునే! పిల్ల బాగుందా!”

“మరి ఎత్తు?”

“ఐదడుగుల ఐదంగుళాలా! అబ్బో మంచి ఎత్తే, మనోడు ఐదు పది ఉంటాడా! పిల్ల మంచి రంగు కూడానా”

“ఉద్యోగం కూడా చేస్తుందా! గవర్నమెంట్ జాబ్ నా! ఇంకేందయితే జాబ్ గురుంచి విచారించేది”

“నా మాట విని పద్మజ కి చెప్పు కట్నాలతో పెట్టుకోకుండా చేసేసుకోమని”

నా కర్థమయ్యింది, మా అమ్మ తన స్నేహితురాలితో, ఫోన్ సంభాషణ లో ఉందని.

ఫోన్ అయ్యాక, “అవునే అమ్మ! నా పెళ్ళికి మా నాయన, అంటే మీ ఆయన కట్నం తీసుకోకుండా ఎంత మాత్రం ఆప గలిగావ్”

మొహం ఎర్ర బడుతుండగా, “ఆఖరికి నీతో కూడా చెప్పించు కోవాల్సి వచ్చింది”, అనేసి అలిగేసింది మా అమ్మ.

మా అమ్మ అలిగితే, “ఆమె అన్నం తిన్నదాకా నాకు చుక్కలే!”

ఇదంతా చూసి మా దగ్గరే ఉంటూ, ఉద్యోగం చేసుకొనే మా అక్క కూతురు, కయ్య్ మని, “అమ్మమ్మ! మొన్న పెద్ద మామయ్య అంతలేసి మాటలంటున్న, నీకు చీమ చిటుక్కుమన్నా లేదు, చిన్న మామయ్య ఒక్క మాట అనగానే నీకు అంత రోషం వచ్చేసింది అని”

మరల షరా మాములే, దానిక్కూడా, తలంట్లే! “గుడ్డొచ్చి పిల్లనెక్కిరిస్తుందా అంటూ.”

అమ్మ, కోపం ఇంకా తగ్గలా!

“నేను నీ దగ్గర హాయిగా లేను, మీ అన్న దగ్గర హాయిగా లేను, మీ నాన్న దగ్గర అస్సలకే లేను”

“మరి ఎవరి దగ్గర హాయిగా వున్నావే! అమ్మా”, నువ్వు అన్నా ఇంకా రెచ్చకొడుతూ.

“మా నాన్న దగ్గఱ రా”

డెబ్భై రెండేళ్ల మా అమ్మ! తన నాన్న దగ్గర వున్న కాలాన్ని, ఇన్నేళ్లకి మరువలేదు.

మా అమ్మని నేను బాగా చూసు కుంటున్నాను అనే నా అహానికి ఓ చెంప పెట్టు.

టేబుళ్ల మీద పదార్థాలు పెట్టి వెళ్లి పోతే మన పాటికి మన వడ్డించుకు తినటం అలవాటు అయినమన తరానికి, అలా కొసరి కొసరి ఏమి తినాలో, ఎంత తినాలో చెప్పు కుంటూ అన్నం వడ్డించే ఆ తరం –

పక్కనోడు ఏమి చేసుకున్నా మనకెందుకు అని మనలా అనుకోకుండా, పాటించరని తెలిసినా వాళ్లకు ఉబుసు పోక సలహా అయినా మంచిదే ఇచ్చే ఆ తరం –

మన కళ్ళకి మన లేక ఇతరుల వ్యక్తి గత స్వేచ్ఛను హరించే శకం!

ఇలా అయితే మనకి మాటలు చెప్పే తరమే ఉండదేమో ఇక. తలా ఒక స్మార్ట్ డివైస్ పట్టుకొని, ముంగిల్లా ఓ మూల పడి ఉండవచ్చు, ఎవరన్నా ఏదన్న మాట చెప్ప బోతే, “మైండ్ యువర్ ఓన్ బిజినెస్” అనే ఎక్స్ప్రెషన్ మొహానికి తగిలించేసుకొని.

ఇప్పటి తరానికి సలహా అనేది ఇప్పటికే చాలా ఇర్రిటేటింగ్ గా వుంది. అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా వెళితే ఇద్దరి మధ్య మాటలు ఎలా సాగుతాయి

భయం వేసింది నా ఆలోచనలకు. నాకు మాటలు కావాలి. వింటారో లేదో కూడా పట్టించుకోకుండా మా అమ్మ స్వపర బేధం లేకుండా అందరికీ చెప్పే మాటలు నాకు వినపడాలి, నిత్యం.

తటాలున వెళ్లి హత్తుకున్నా అమ్మని.

“పోరా! ఈ వేషాలకి తక్కువ లేదు! వదులు నన్ను”

“వదలను నేను! అస్సలకి, నువ్వు తోసినా! తిట్టినా”

“పిచ్చోడా!!”

“అవును, నేను అమ్మ పిచ్చోడినే! ఇంకెప్పుడూ అనకు, మీ నాయనే, పెద్ద ఇది అని”

“అంటానురా! ఒక సారి కాదు! వెయ్యి సార్లు!”

“నేను మీ నాయన, శంకరయ్యను అయితే!”

“అవటానికి ట్రై చెయ్యి రా అప్పుడు చూద్దాం!”

హత! విధీ, ఈ నాయన లని కట్ట కట్టి ఎక్కడన్నా పడెయ్యాలి.

14 thoughts on “పెద్దంతరం చిన్నంతరం!

  1. ఎవడెలా పోతే నాకేంటి నేను బాగుంటే చాలు అనే ధోరణికి మనం అతీతులం కాదు.మీ అమ్మగారి కొసరి వడ్డించిన ఉదాహరణ తో మన లోని పాశ్చాత్య పోకడలను ఎత్తి చూపిన వైనం బాగుంది. నిజమే మెలుకోరి ఒక్క మాట చెబితే చాదస్తం లేదా పిచ్చి అనుకొనే రోజులివి.

    మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s