మా తాత రాసిన రాత!

“చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు”

ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి, పక్కరోజు వినాయక చవితి అవటం తో,

డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని, సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నా, వళ్ళంతా నొప్పులు , పులిసిపొయ్యినట్టుంది ఎడ తెగని తిరుగుళ్ల వల్ల.

కాస్త నడుము వాలుద్దామని ఇంటికొచ్చా, లేక పోతే వంట వాళ్ళ దగ్గరే సరిపోయుండేది నాకు ఆ సాయంత్రమంతా.

అంత అలసట లో కూడా, నాకు పెళ్లి చూపులు అంటే ఎదో తెలియని ఉత్సుకత, ఉత్సాహం. అమ్మాయి ఫోటో ఉందా, నా ఫోటో అమ్మాయి చూసిందా అనే జ్ఞానం కూడా లేదు మరి. ముంజేతి కంకణానికి అద్దం ఏల అన్నట్టు.

“సరే నాన్న, ఒక గంట నడుము వాలుస్తా, ఐదున్నర పైన బయల్దేరి వెళ్తాము” అన్నా.

అలా ఆరుగంటలకు వాళ్ళ ఇల్లు చేరుకున్నాము, సదరు అమ్మాయి వాళ్ళ అక్క గారింటికి, పెళ్లి చూపుల బాధ్యత ఆవిడ తీసుకోవటం తో.

మేము వెళ్లే సరికి, వాళ్ళ తరపున కొందరు పెద్ద మనుషులు, అమ్మాయి తాత గారు కూర్చొని వున్నారు హాల్లో

వాళ్ళ అక్క పిల్లలు అనుకుంటా, ఒక రెండేళ్ల పాపా ఒక నాలుగేళ్ళ బాబూ అక్కడ వేసిన కుర్చీలు, టేబుళ్ల మధ్య పరిగెడుతూ ఆడుకుంటున్నారు.

వాళ్ళ ఆటలు గమనిస్తూ, వాళ్ళని దగ్గరకి రమ్మంటూ బతిమాలుకుంటూ, పెద్ద వాళ్ళు అడిగే చదువు, ఉద్యోగం, ఉద్యోగం వెలగబెట్టే ఊరి గురించి ప్రశ్నలు కొన్నిటికి మనస్కం గాను కొన్నిటికి అన్యమనస్కం గాను సమాధానాలు ఇస్తూ వున్నా.

ఈ లోపల కొన్ని బిస్కట్స్ , తాగడానికి కొబ్బరి నీళ్లు వచ్చాయి.

“బానేవుంది ఈ కొబ్బరి నీళ్ల ఏర్పాటు, రొటీన్ గా ఇచ్చే టీలు కాఫీలు కాకుండా ” అనుకుంటుండంగానే, అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటా, “కొబ్బిరి నీళ్లు తీసుకో నాయన! అవి మన ఊరి నుండి వచ్చినవే”, అంటూ పలకరించేశారు.

ఈ లోపల, నా చేతుల్లోని ఆడుకుంటున్న, ఆ రెండేళ్ల బుడ్డది, గబుక్కున దూకి, అక్కడే మా మధ్యన వున్న టేబుల్ మీద నున్న, ఓ క్రీం బిస్కట్ ను రెండు చక్రాలు గా విడ గొట్టి, వాటి మధ్యన వున్న క్రీం నాలుక పెట్టి నాక్కొని, ఆ చక్రాలు నా చేతిలో పెట్టి, “నువ్వు తిను బాబాయ్”, అనేసింది.

ఆ బుడ్డ దానికి మాటలకు చేతలకు, అప్పటికే మైమరిచిపోయి వున్న నేను ఏమాత్రం సందేహించకుండా వాటిల్ని తినేసాను.

ఆ లోపల అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టారు. చిన్న పాప తో ఆడుకుంటూనే , అమ్మాయిని గమనించడం మొదలు పెట్టాను. తాను బహు పొడగరి, బాగా కళగా వుంది అమ్మాయి, ఇదిగాక ఆమె కళ్ళల్లో ప్రశాంతత, సౌమ్యత నాకు చాలా ప్రత్యేక మనిపించింది.

ఎప్పుడు మా ఎక్సప్రెస్ పెళ్లి చూపులు ముగిసాయి కూడా నాకు తెలియదు.

లేచి వాళ్ళ ఇంటి ముందున్న ఆరు బయల్లో నిలబడ్డాము.

వాళ్ళ తాత గారు, దగ్గర కొచ్చారు, “అబ్బయ్య! నా మనవరాలు అని చెప్పుకోవటం కాదు కానీ, బాగా మెతకయ్యా! అందుకే ఓ మంచి అయ్య చేతిలో పెట్టాలని ఈ వయస్సులో నా తాపత్రయం నువ్వు నాకైతే నచ్చావయ్యా! అమ్మాయి గురుంచి ఏమంటావు” అంటూ.

“మీ మనవరాలుకేమి తాతా ! వంకలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికైనా నచ్చుతుంది”

“నీకు నచ్చిందా! అయ్యా” అన్నారాయన.

“అదే కదా తాతా నేను కూడా చెప్పేది” అన్నా నేను, డొంకతిరుగుడు గా. వెంటనే నచ్చేసింది అని చెప్పొచ్చో లేదో అన్న సందేహంతో.

“నేను ఉదయం, అమ్మాయి వాళ్ళ అన్నయ్యని, మీ అన్న పెళ్ళికి పంపిచ్చానయ్యా ! నిన్ను చూసి ఎలా వున్నావో వచ్చి చెప్పమని”.

“…”

“పిల్లగాడు బాగున్నాడు. కాక పోతే మన అమ్మాయికి పొట్టి అవుతాడు అన్నాడయ్యా.”

“…”

“కానీ నేను నా కళ్ళతో చూసిన దాకా నమ్మను. అందుకే ఈ ఏర్పాట్లు. మా అమ్మాయికన్నా నువ్వే రెండు అంగుళాలు హెచ్చు గున్నావు” అంటూ నవ్వారు ఆయన.

“మా అన్న పెళ్లి గురించి వీళ్లకు ఎలా తెలిసిందబ్బా ” అనుకుంటున్న నాకు,

ఆయనే, అక్కడ వున్న ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తూ, “ఇదిగోనయ్యా ఈయన మా బంధువు, ఇప్పుడు మీ అన్నకి బంధువు, మీ వదిన తరపున” అంటూ నా సందేహాన్ని తీర్చేసాడు.

“సరే వెళ్లొస్తాం తాతా!”, అని ఆయన దగ్గర సెలవు తీసుకొని మా ఇంటికి బయలుదేరాము, హడావుడిగా, మా అన్న రిసెప్షన్ టైం దగ్గర పడటం తో.

ఆ తర్వాత మా అన్న పెళ్లి ఆ తదుపరి కార్యక్రమాల హడావుడి తగ్గటం తో, మా వాళ్లంతా కలిసి నిశ్చయించేశారు, అందరు ఆ అమ్మాయిని చూసేసి, నాకు తగ్గ అమ్మాయి కాదో నిర్ణయించెయ్యాలని.

నాకు కనపడ్డ అమ్మాయిల్లా నచ్చేస్తుంది అని మా వాళ్ళ అభిప్రాయం.

తీరిగ్గా ఒక రోజు సాయంత్రం ఒక పటాలం వెళ్లి నట్టు వెళ్లి వాళ్ళ ఇంటి మీద పడిపోయారు. ఆ వెళ్లిన పటాలం లో ఏ లేడీ ఇన్స్పెక్టర్ కంటికి ఆ అమ్మాయి అనలేదు. మనోడు బాబు మోహన్ అయినా అవతల అమ్మాయి ఐశ్వర్య రాయ్ కావాలనే బ్యాచ్ అక్కడికి వెళ్ళింది.

మొహాలు వేలాడేసుకొని వచ్చారు ఇంటికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే నా మీద నిరసన వ్రత దీక్ష పట్టారు.

మా అమ్మ, మా అక్క అయితే ససేమిరా అంటే ససేమిరా అన్నారు.

నేను కూడా వాళ్ళ మాట విన్నంత సేపు విని, ఆ తరువాత మీరుఏవన్నా చెప్పండి, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అనే వాడిని.

మధ్యవర్తితో చెప్పి పంపిచ్చారు మా వాళ్ళు , ఏమీ అనుకోవొద్దు, మా అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చెయ్యట్లేదు , మీ అమ్మాయికి వేరే సంబంధాలు చూసుకోండి అని.

ఆలా చెప్పి పంపిన పక్క రోజు, నేను పెళ్లి చూపుల్లో కలిసిన తాత వచ్చారు మా ఇంటికి. ఇంకా మా ఇల్లంతా బంధువులతో సందడి గానే వుంది.

ఆ మాట ఈ మాట మాట్లాడారు తాత గారు, వెళ్తూ వెళ్తూ, మా వాళ్ళతో –

“మీ ఇల్లు చూసాను, బంధు బలగం చూసాను, నా మనవరాలు మీ ఇంట్లో బాగుంటుంది అని గట్టి నమ్మకం వచ్చేసింది నాకు. అయినా మీ అబ్బాయికి నచ్చినప్పుడు, ఇక అభ్యంతర మెందుకు” అన్నారు.

మా వాళ్ళు కూడా , “ఎందుకులే తాతా! మీ అమ్మాయికి మంచి సంబంధమే దొరుకుతుంది” అని ఆయనకి సర్ది చెప్పి పంపారు.

అదే రోజు రాత్రి! మా అక్క కూతురు, రెండు నెలల పాప, ఆకారణం గా ఏడుపుకెత్తుకున్నది. ఎవరు ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. కొన్ని గంటల తర్వాత కానీ మామూలు కాలేదు.

మా అక్క భయపడి పోయింది ఆ రోజు, తాను ఒక ఆడ పిల్లని వద్దు అని చెప్పినందుకు, ఇలా జరిగింది అని నమ్మేసింది. తర్వాత రోజు ఉదయం తను నా పక్షం లో చేరిపోయింది.

ఇప్పుడు నా పక్షాన, నాతో పాటు పెళ్లి చూపులకు వచ్చిన మా పెద్దమ్మ కూతురు, ఆవిడ భర్త, మా అక్క.

త్రాసు కొంచెం నా వైపే తూగుతూ వుంది.

అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటిలో తాత గారు నా గురించే పట్టుబట్టడంతో,

“వాళ్ళు వద్దు మొర్రో అంటున్నా మనకేమన్న గతి లేకనా వాళ్ళ వెంట పడటం” అనిఆయన మీద యుద్ధాలు జరిగాయి.

అమ్మాయి సహితం గా గుడికి గూడా వెళ్లి, వాళ్ళు టెంకాయ కూడా కొట్టేసుకున్నారు, “హమ్మయ్య వీళ్ళ సంబంధం తప్పి పోయింది” అని

ఇక నా ప్రయాణం రెండు రోజులే నేను పెట్టిన సెలవుల అనంతరం ఉద్యోగం లో చేరడానికి.

ప్రయాణం రేపు అనగా, సాయంత్రం నాలుగప్పుడు, మేము అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము మా ఇంట్లో, మా ఇంటి ముందు ఓ అంబాసిడర్ కారు ఆగింది, అందులోంచి తాత , ఆయన అన్న గారు, ఆయన తమ్ముడు గారు దిగారు.

వాళ్ళ కారు డ్రైవ్ చేసుకొని వచ్చిన అమ్మాయి అన్న మటుకు , కారులో వీళ్ళని దించి మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చక్క బోయాడు.

వీళ్ళు వచ్చారు లోపలకి త్రిమూర్తులు లాగా. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడారు –

“ముగ్గురం పెద్ద వాళ్ళం వచ్చాము, మేము వచ్చామన్న గౌరవం తో మీరు పునరాలోచించు కుంటారని అనుకుంటున్నాము” అంటూ బయల్దేరారు.

అంతే ఆ మాట మా వాళ్ళను చాలా సూటిగా తాకింది!

నవ్వుతూ నడిచారు ఆ ముగ్గురు, మా ఇంటి బయటకి, మా వాళ్ళ సమాధానమేదో వాళ్లకి ముందే తెలిసినట్టు.

ఆశ్చర్యం గా అమ్మాయి వాళ్ళకీ తెలుసట, “ఈ ముసలి త్రయం కలిసి వెళ్లిన పనేదీ ఇప్పటి వరకూ జరగ కుండా పోలేదని”

మా పెళ్లి అయిన ఓ సంవత్సరం తర్వాత. తాతను అడిగా, “ఎందుకు అంత పట్టు పట్టావు, ఇంకెవరూ దొరకరన్నట్టు, అనుకున్నది సాధించుకునే దాకా పట్టు విడుపులు లేవా మీకు” అని

“హర్షయ్య! నీకేనా నా మనవరాలి మొహం లో ప్రశాంతత కనిపించింది, నీ మొహం చూస్తే నాకు ఏమీ కనపడదా ఏందీ? నా మనవరాలు ఎక్కడ నిశ్చింతగా ఉంటుందో! అరచేతుల్లో పెట్టి పెంచుకున్నానయ్యా పిల్లని ” అన్నాడాయన.

“నా విషయం లో మీ అంచనా నిజమో కాదో నాకు తెలియదు, కానీ మీ అమ్మాయి విషయం లో నా అంచనా నిజమే” అన్నా గర్వం గా.

“ఈ మాట ఓ మూడేళ్లు ఆగాక కూడా అను, అప్పుడు ఏకీభవిస్తా నీ మాటతో నేను” అంటూ నవ్వేశాడాయన బోసి నోటితో.

నిజమే, పెళ్ళికి ముందర జరిగిన ఘట్టాలు, అపోహలతో, ఇరు పక్షాలకీ మూడేళ్ళకి పైగా పట్టింది ఒకరి మీద ఒకరికి నమ్మకాలు కుదరటానికి.

దాని తర్వాత ఆ అమ్మాయి మా ఇంట్లో అందరికీ ఫేవరేట్ అయిపోయింది, అత్తా మామలకి, నలుగురాడబడుచులకి, ముగ్గురు తోడి కోడళ్ళకి, సకల బంధు జనాలకి.

ఆ అమ్మాయి మొహం లో అదే ప్రశాంతత ఇప్పటికీ , కష్ట మొచ్చినా, నష్ట మొచ్చినా.

ఓ ఐదేళ్ల క్రితం శ్వాస కష్ట మవటం తో హాస్పిటల్ లో చేరాడు తాత. అందరం నెల్లూరు చేరాము. ఎందుకో నన్నే ముందు వెళ్ల మన్నారు ఐ.సి.యూ కి ఆయన కి స్పృహ రావటం తో.

కళ్ళు తెరిచి నా చెయ్యి పట్టుకున్నాడాయన, బోసి నోటితో ఓ నవ్వు నవ్వాడు.

నా తర్వాత వెళ్లిన ఆయన ఆయన మనవడు, మనవ రాళ్లు, ముని మనవరాళ్లకు, ఆయన కళ్ళు తెరవటం కనపడలా, ఆ బోసి నవ్వు కనపడలా.

18 thoughts on “మా తాత రాసిన రాత!

  1. ఇది రక్షాబంధన్ సందర్భంగా అన్నయ్య చెల్లెలికి ఇచ్చిన పెళ్ళి కానుక.
    తన చెల్లెలి కోసం వరుణ్ణి వెతికి అతని గుణగణాలు, తీసుకునే ఇంటి బాధ్యతలు, అందరితో కలిసిపోయే విధానాన్ని బేరీజు వేసుకుని తమ ఇంటి పెద్ద అయిన తాతగారి ద్వారా సంప్రదింపులు జరిపించి పెళ్ళి కుదిరేలా చేశాడని నా అభిప్రాయం..

    మెచ్చుకోండి

  2. Supriya and Harsha are one of the sweetest couple I love to meet anytime. They always make you feel comfortable with their calmness and pleasantness. I would say they are ‘made for each other’😊
    Harsha, you made me feel how pelli chupulu event goes as I didn’t experience it. While I was reading the part your sisters (all ladies) going and seeing Supriya, I visualized myself one among them who went and saw Supriya too. I really enjoyed it.
    Keep writing many more stories which will take us back to good old memories😊

    మెచ్చుకోండి

  3. Saradaaa pelli chuuoulatho modalaina ee sanghatana , end chaalaaa bagaaa chesaaru . Adi baadhaakaram ayinaa santhrupthi karam. Pelli chupulu zarigina vaaallaki konni ghattaaalu manakeee zarigaaaye anipinchelaaaa unnaaayi.

    I have never met Mrs Harsha but the way you refer Mrs Harsha ‘s name “Supriya” always gives the love and affection you have towards her. Tatayyani kaka poyinaaaa manushula maatala venuka unna mano bhavana , vaatsalyamu appudappudu artham avutoo untundi. Feel good narration Harsha 💕💕👏👏💕💕

    మెచ్చుకోండి

  4. “హర్షయ్య! నీకేనా నా మనవరాలి మొహం లో ప్రశాంతత కనిపించింది, నీ మొహం చూస్తే నాకు ఏమీ కనపడదా ఏందీ? నా మనవరాలు ఎక్కడ నిశ్చింతగా ఉంటుందో! అరచేతుల్లో పెట్టి పెంచుకున్నానయ్యా పిల్లని ” అన్నాడాయన. Great to see both the first impressions coming true in lfe. I heard this from you Harsha and lovely reading as well. Saw the same calmness as i interaacted many times with you and Supriya garu.

    మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s