Apple PodcastsSpotifyGoogle Podcasts

బెల్లంకొండ వెంకటేశ్వర్లు !

ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాము

ఒక రోజు బడికి వచ్చేసరికి, మా తరగతిలోనే ఓ కొత్తమొహం కనిపించింది నాకు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ వచ్చిన అబ్బాయి వివరాలు తెలిసి పోయాయి.

పేరు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు. అప్పటిదాకా బుచ్చి లో చదువులు వెలగబెట్టి,యీ రోజే మా బడిలో చేరాడు. వూరు మాత్రం మా వూరే, ఉప్పలపాడు.

వారం లోపులే సావాసం గాడు అయ్యాడు, వాడి కి తెలియని విద్యే లేదు. వాడి పుస్తకాల సంచి మాకో వింత ప్రపంచం. దాన్లో ఓ కేటర్బాల్ (స్లింగ్ షాట్) దార్లో కనపడ్డ చింత కాయలో లేక సీమ చింత కాయలో కొట్టడానికి, రాలిన తాటి పళ్ళు కాల్చడానికి ఓ అగ్గిపెట్టె, దారి మధ్యలో ఆగి ఆడడాని కో అరడజను గోళీలు, యూనో లాగ ఆడదానికి సిగరెట్ బాక్స్ కార్డ్స్.

ఇవన్నీ కాక వాడి కి అమోఘమైన మిమిక్రి కళ వుంది. వచ్చిన వారం పది రోజుల్లోనే అందరి అయ్యవార్లను అనుకరించడం నేర్చేసాడు. వాడే మాకు సెంటర్ అఫ్ అట్రాక్షన్. ఇంత టాలెంట్ సొంతమైన మా వాడిని అన్యాయంగా పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు అని తేల్చేశారు మా అయ్యోర్లు. మాకు మా అయ్యోర్ల అభిప్రాయం తో అస్సలకి పనిలేదు కదా, మా హీరో వాడే.

నేను వాడు ఓ ఒప్పందానికి వచ్చేసాము. పరీక్షల్లో వాడూ నేను పక్క పక్కన లేక పోతే నా వెనక వాడో కూర్చోవాలని. నాకు వచ్చినవన్నీ వాడు చూసి రాసేసుకోవాలి, వాడికి వచ్చిన విద్యలన్నీ నాకు నేర్పించేయాలి. ఆరోతరగతి యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ మరియు హాఫ్ యియర్లీ అన్నీ మేనేజ్ చేసేసాము.

రోజులు గడుస్తూనే వున్నాయి, మా అయ్యోర్లలో మార్పేమీ లేదు. ఒక్కో అయ్యోరు రావటం వాడినేదో ప్రశ్నలడగటం, వీడేమో వాళ్ళు అడక్క ముందే బెంచీ ఎక్కటం. వాళ్లేమో తా జెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అంట అంటూ ఇంకా చీవాట్లు పెట్టటం. మేము మాత్రం బుద్ధిగా వుండే పిలకాయల్ని కూడా కోతులుగా మార్చేస్తున్నాము. మా అయ్యోర్లేమో మళ్ళీ యూనిట్ పరీక్షలు వస్తున్నాయి, బాగా చదవండి అంటూ, అవేవో పబ్లిక్ పరీక్షలు అయినట్టు హెచ్చరికలు జారీ చేయటం మొదలు పెట్టారు. బెల్లంకొండోడి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు, ఏమీ చదవని వీడికి వీడికి ఇప్పటి వరకూ వచ్చిన మార్కులకి బాలన్స్ కుదరటం లేదు అంటూ, మొదటి సారిగా నన్నో మూల, వాడినో మూలా కుర్చోపెడతామని ముందే వార్నింగ్ ఇచ్చారు.

అయినా మా వాడి మొహం లో టెన్షన్ కనపడలా, దానిక్కూడా వాడి దగ్గరేదో సొల్యూషన్ ఉన్నట్టు. ఓ రోజు ఉన్నట్టుండి, యురేకా అనుకుంటూ వచ్చాడు నా దగ్గరకి.

“నాకు నువ్వు అన్నీ ప్రశ్నలకి జవాబులు రాసివ్వు ముందరే” అన్నాడు.

“చిట్టాలు పెడతావా. ఎక్కడ దాచుకొని పోతావురా వాటిల్ని, జోబీలోనా, లేక నీ తలకాయ జుట్టులోనా” అని నవ్వా నేను.

“కాదురా! మనవేమో నేల బల్లలు, ఫ్లోరింగ్ అంతా మట్టి. ముందే వెళ్లి నేను నా ప్లేస్ లో చిన్న గుంత లోడి, నువ్విచ్చే పేపర్స్ అన్నీ అక్కడే కప్పెడతా” అన్నాడు పెద్ద హీరో లాగా.

“దొర్కవుగా” అన్న.

“లేదేహే! నువ్వొట్టి పిరిగ్గొడ్డు వి”

నిజమే మా బెల్లంకొండోడి ఐడియా నే ఐడియా. విజయవంతం గా రాసేసాడు తెలుగు, ఇంగ్లీష్.

కానీ మూడో రోజు లెక్కల పరీక్షలో పట్టుబట్టాడు వాడు మరీ ఓవర్ గా సంభాషణలతో పాటు నడకని కూడా మిమిక్రి చేసే మా సోషల్ అయ్యవారికి.

మరు నిమిషం వాడి వీపు మరియు నా వీపు బద్దలయ్యాయి. చిట్టాలు పెట్టింది వాడే, కానీ రాత నాది కదా. ప్రతీ అయ్యోరు రావటం, తీయండి రా గుంజీలు అనటం, తీసి తీసి మేము పడిపోయేదాకా తీయించటం. కాస్త ఓపిక రాగేనే ఇంకో అయ్యోరు తగులుకోవటం.

మా ఘన కార్యం తెలిసిన మా హెడ్ మాస్టర్ బహు ముచ్చట పడి వీళ్ళ సమయం మధ్యాహ్నం నుండి నాకు బహూకరించండి అని మా అయ్యోర్లను వేడుకొని, ఆయన రూమ్ ముందర ఆయనకు కనపడేలా మోకాళ్ళ దండన కార్యక్రమం మొదలెట్టారు. ఇదే మేలురా హర్షా అయ్యోర్ల బెత్తం దెబ్బలు , గుంజీళ్లు కంటే , ప్రాణం హాయిగా ఉందబ్బా అంటూ పళ్ళికిలిచ్చాడు వాడు.

ఆ రోజు నేనైతే ఇల్లెలా చేరానో నాకే తెలియదు, ఆ రోజే కాదు ఒక వారమంతా కదిలితే వొళ్ళంతా ఒకటే సలుపు, గుంజీళ్ల మహిమ.

అలా జరిగిపోయేదేమో కాలమంతా, ఆ రోజు ఆ అవ్వ మా అమ్మ కాళ్ళ బడకుండా వుండి ఉంటే.

మా ఊరి పొలాలకు పోవాలన్నా, పొలాలనుండి ఇళ్ల కు పోవాలన్నా అందరు మా వీధి గుండా, మా ఇంటి ముందర నుండే వెళ్ళాలి.

ఓ రోజు సాయంకాలం, ఓ ముసలవ్వ, వొంట్లో శక్తీ అంతా వొడిగి పోయినట్లుగా పొలం నుండి ఇంటికి వెళ్తూ కనిపించింది మా అమ్మకి.

“నర్సమ్మ బాగుండావా!” అంది అమ్మ.

“ఏమి బాగు సుజాతమ్మ, ఎదో ఇలాగా” అంటూ ఆగింది అవ్వ, బుట్టని ఇంకో సంకలోకి మార్చుకుంటూ.

“మనవడు ఎలా వున్నాడు నర్సమ్మ”

“బాగానే వున్నాడమ్మా! మొన్నటి దాకా బుచ్చిలో చదువుకొనే వాడు, గవర్నమెంటోళ్ళ హాస్టల్ లో వుండి. అక్కడుంటే చదువు అబ్బటం లేదు, సావాస గాళ్ళతో కలిసి ఒకటే ఆటలు, తిరుగుళ్ళు. నాకాడే పెట్టుకుందామని తీసుకొచ్చాను అమ్మా. ఇక్కడ చదువులు బాగుంటాయని”

“ఏమి చదువుతున్నాడు నీ మనవడు”

“ఆరో తరగతి అమ్మా. ఆ ఏడుకొండల స్వామి పేరు పెట్టుకున్నా, వెంకటేశ్వర్లు అని”

“అయితే మా వాడు రోజూ జపం చేసేది నీ మనవడి గురుంచే అన్న మాట” అంటూ, అమ్మ గబ గబా వెళ్లి ఒక చేట నిండా బియ్యం తెచ్చి అవ్వ గంపలో పోసింది, వాటిల్తో పాటు కాస్త గోకాకు కొన్ని పచ్చి మిరపకాయలు కూడా గంపలో చేరాయి

“సల్ల గుండు తల్లా!, కనపడి నప్పుడల్లా ఎదో ఒకటి ఇస్తావుంటావు” అంటూ బయల్దేరింది అవ్వ.

అవ్వ వెళ్ళగానే, “చిన్న! నువ్వు పలవరించే బెల్లంకొండా వెంకటేశ్వర్లు ఈ అవ్వ కూతురి బిడ్డే. వాడి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతే, ఈ అవ్వ ఈ వయస్సులో కూడా కూలీ పని చేసి వాడిని పెంచుతుంది”

“వెంకటేశ్వర్లు వాళ్ళ, నాన్న ఏమయ్యాడమ్మా!”

“ఏమయ్యాడా! వాడిని వాళ్ళ ముసలి అమ్మమ్మ ఎదాన పడేసి మాయమయ్యాడు. వీడన్నా సక్రమంగా చదువు కుంటే ఆ ముసలామెకి ఈ దిగులెందుకు చెప్పు” అన్నది కోపం గా.

అసలే ఆ అవ్వని చూసి దిగులుగా వున్న నాకు, మా అమ్మ కోపంతో ఇంకా ఎక్కువయ్యింది. రాత్రంతా కలలో ఆ అవ్వే, ఇంకా ఏమిటేమిటో కలలు. బెల్లంకొండ ముందు దేవుడు ప్రత్యక్షమయినట్టు, వాడినేదో కోరుకోమన్నట్టు, వాడు నాకు చదువు కావాలి అన్నట్టు, దేవుడు తధాస్తు అన్నట్టు. ఇంకా చాలా కలలు.

తెల్లారింది. యధావిధిగా భుజాలకు సంచులేసుకొని బడికి బయలుదేరాము. వాడేమో ఈ సారి ఇనప గోళీలు తెచ్చాడు. దారంతా వాటితో ఆడుతూ బడికి చేరాము. దార్లో ఆటలాడుతూనే వాడికి నా కల చెప్పా. “పిచ్చోడివిరా నువ్వు ” అన్నాడు వాడు నవ్వుతూ. “ఎందుకురా నన్ను పిచ్చోడివి” అంటున్నావు అంటే, ఆ అడిగేదేదో డబ్బులే అదగొచ్చుకదారా అంటు కిసుక్కుమన్నాడు వాడు.

వాడి ఆ నవ్వుతో నాకర్థమయ్యింది వాడు మారే అవకాశం లేదని. బెల్లంకొండోడి తో ఆటలైయితే సరే కానీ పరీక్షలకి సంబంధించి వాడి బ్రిలియంట్ ఐడియా లకి చాలా దూరంగా వుండాలని. కానీ వాడికేమో నా ఈ మార్పు నచ్చలా.

“నాకు చదువు రాకపోవటం వల్లే కదా మనకీ కష్టాలు. మరి నాకు చదువుకోవటం ఎలాగో నేర్పు” అంటూ మొదలు పెట్టాడు. నాక్కూడా నిజమే కదా, వాడికి రాక పోవటం వల్లే కదా మేము చిట్టాలు పెట్టాల్సి వచ్చి, పిక్కలు పెట్టె వరకూ గుంజీళ్లు తీయాల్సి వచ్చింది అని. సరే చదువుకుందాం అని నిర్ణయానికి వచ్చేసేము.

ఒక మనిషి వాడితో పది నిమిషాలు మాటలాడితే వాళ్ళ మాటలు మరియు హావ భావాలు పట్టేసే ధారణ వాడుకుంది. అది వాడి బలం. ఆసక్తి లేక వాడు దాన్ని చదువులో పెట్టలా. నేను వాడికి చదవటం మొదలు పెట్టాను, వాడు వినటం, విన్నది మరలా నన్ను మిమిక్ చేయటం, దానికి నేను నా గొంతు మార్చటం, వాడు దాన్ని కూడా మిమిక్ చేయటం, ఇలా నవ్వుల్తోనే సాగేది మా చదువు.

మావాడు అయ్యోర్లు అడిగిన ప్రశ్నలకి చిలక పలుకుల్లా సమాధానాలు చెప్పటం మొదలు పెట్టాడు. వాళ్ళు కూడా మేము చేసిన పనులు మర్చిపోయి వాడిని “పర్వాలేదురా దార్లో పడుతున్నావు, దెబ్బకి దెయ్యం వదిలిన్దిరా నీకు. ఈ పని మేము ఎప్పుడో చేయాల్సింది” అంటూ సానుకూల పడటం మొదలెట్టే సరికి మా ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

ఓ సారి ధైర్యం చేసి మా ఎల్.ఏ సెక్రటరీ ని బతిమాలుకొని మా వాడి పేరు ఎలక్యూషన్ కి ఇచ్చేసాము. నచ్చిన స్వతంత్ర సమరయోధులు మా టాపిక్. తెగ ప్రిపేర్ అయ్యాము. సుభాష్ చంద్ర బోస్ గారి బాల్యం, చదువు, ఐ.సి.ఎస్ ఎంపిక, ఆజాద్ హింద్ ఫవుజ్ స్ధాపన, ఆయన మిస్టీరియస్ మరణం గురుంచి మా వాడు రక రకాల మోడ్యులేషన్స్ తో చెప్తుంటే ఆహా నేతాజీ కదా అసలు సిసలు లీడర్ అంటూ గుండెలు పొంగని వాడు లేడు.

అలా మా బెల్లంకొండ ఆ రోజుకి మా స్కూల్ హీరో అయ్యాడు.

మేము మా చదువు అలానే కంటిన్యూ చేసాం.

సరిగ్గా సంవత్సరం తర్వాత మా ఆరు ఊర్లలో సంచలనం లేపాడు ఏడో తరగతి పబ్లిక్ హిందీ తో సహా 284 మార్కులతో గట్టెక్కి.

“బెల్లంకొండ వెంకటేశ్వర్లు !” కి 4 స్పందనలు

  1. హాయిగా సాగిపోయింది మీ కధనం. మొత్తానికి బెల్లంకొండని మార్చారన్నమాట.ఇంతకీ ఏడోతరగతి తరువాత ఏమయ్యాడు ఆ అబ్బాయి?ఒక చిన్న సందేహం, ఏడో తరగతి 600 మార్కులకా 300 మార్కులకా?కొంచెం గురు చేద్దురూ

    1. Thanks andi Vatsalyagaaeu. Seventh is for 600 marks including Hindi. We do not know why we used say our marks with Hindi and with out Hindi in those days. Like most of the childhood friends, we never met after seventh as we both left the villages.

  2. బాల్య జ్ఞాపకాలు బాగా గుర్తు వచ్చాయి. చాలా చక్కగా కథను చెప్పారు… ముగింపు different గా వుంది.

    1. Thank you sir. I thought of ending it with successful completion of seventh grade.

Leave a Reply to Muralidhar KCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading