సాబువ్వ

మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి “ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా” అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది.

“కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా” అని దేవమ్మను చూసి అంటూంటే..

నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, నువ్వు ఆ మూలంతా సదను సేసి రా.. క్యారీరు చింతచెట్టుకు ఏలాడ గట్టినా, నువ్వొచ్చినంక బువ్వ పెడతా అంటూ వెళ్లిపోయింది దేవమ్మ. 

:వానెప్పుడు పడాలని, ఈడ నేను ఊరకే పీకులాడాల’ అని గొణుక్కుంటూ వరదయ్య పన్లో పడ్డాడు. 

మధ్యాహ్నం రాగి ముద్దను ఎర్రకారం పచ్చడితో మింగుతూ పక్కనే ఉల్లిగడ్డ కొరుకుతూ చివర్లో చిలికిన మజ్జిగ తాగి “దేవమ్మా ఈ పొద్దు ముద్దలో ఏం కలిపినావే.. మా రుచిగుండాది అంటే “స్పూను మంచినూనె ఏసినానయ్యా మెత్తగా ఉండాది” అంది దేవమ్మ. 

నాకు “సాబువ్వ ఎప్పుడు పెడతావే” అంటే “ఇప్పుడేం పండగలు లేవు. సామికి పూజ చేసి బెల్లం బువ్వ పెట్టిన రోజే నీకు” అంటూ దేవమ్మ తింటోంది. 

రాయలసీమలో అనంతపురం తీవ్ర వర్షాభావానికి లోనైన జిల్లా. టెక్నికల్ గా “రెయిన్ షాడో రీజియన్”. దశాబ్దాలుగా వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా ఇంకిపోయి, జిల్లాలో పారే నది లేకపోవడంతో పంట కాలువలు కూడా కనిపించవు. కొన్ని చోట్ల ఎడారిలా ఇసుక మేటలు దర్శనమిస్తాయి. వర్షాధారిత పంటలే దిక్కు. అందులో ముఖ్యమైంది వేరుశనగ. 

ఇతరత్రా పంటలు కూడా ఉన్నా ఏదో అంతంత మాత్రమే.. వర్షం ఎంతుంటే అంతలా.

ఇదే జిల్లాలో వరదయ్య దంపతులుండే ఊరు సీతారామపురం. గుడి, బడి, చిన్నాసుపత్రి, సర్పంచ్ ఆఫీసు.. 

ఇలా పల్లెలో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. వరదయ్య ఇల్లు ఓ మోస్తరుగా ఉంటుంది. 

ఒక్కడే కొడుకు శ్రీనివాస్. భార్యతో టౌనులో ఉంటూ ఇద్దరూ ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తూ తమ ఇద్దరాడపిల్లలతో కలిసి వీరిద్దరికీ తోడుగా ఉంటూ అపుడపుడూ పల్లెకు వచ్చిపోతుంటారు. 

వరదయ్యకు ఉండే ఆరెకరాల పొలంలో సెనక్కాయతో పాటు టమాటో ఇంకొన్ని కూరగాయలు పండించి అవి టౌనుకెళ్ళే మస్తాన్ కు అమ్మి జీవితం సాగిస్తున్నాడు. ఉన్న బోరులో నీళ్ళు కూడా ఎక్కువ రావు. ఇంకాస్త లోతుగా మళ్ళీ బోరేస్తే నీళ్ళొస్తాయని ఆశ.

“దేవమ్మా.. ఈతూరి గూడా పంట మీద ఆశలు ఇడిసేయాలా.. పంట కోసం తీసిన బ్యాంకు లోను ఎట్టనే కట్టేది” అంటూ బీడీ పొగ మద్య, ఎటో చూస్తూన్న వరదయ్య ప్రశ్న, ఆమె కళ్ళను కిందికి దించేశాయి. 

ఇద్దరి మౌనం మద్య “వానాకాలం ఇంకా వొచ్చేదుంది కదయ్యా.. సూద్దాం. బ్యాంకోళ్ళతో మాట్లాడు. వడ్డీ కట్టనీకి టైమడుగు. లేదంటే పిల్లోడిని అడుగుదామా”

“వొద్దొద్దు.. నువ్వట్టాంటి ఆలోశన చైరాదు. మనం పిల్లోల్లకి పెట్టాల్నే గానీ ఆల్లనెట్టా అడుగుతావే” అన్నాడు. 

సాయంత్రం శ్రీనివాస్ ఫోన్ చేసి ఇద్దరితో మాట్లాడి పెట్టేశాడు. బ్యాంకు ప్రస్తావన రాలేదు.

ఆ వారం చివర్లో ఊళ్ళో ఒక చాటింపేశారు. 

భూదేవమ్మ ఇంటికొచ్చి “అయ్యా! సర్పంచాఫీసోళ్ళు చెప్పినారు. మూడు రోజుల తర్వాత ఎవల్నీ బైట తిరగొద్దంటన్నారు. బీడీల కోసం ఊరంతా తిరగొద్దు. శెట్టి గారి అంగట్లో సామాన్లు తీసకరా.. మళ్ళీ బైటికి పంపిస్తారో లేదో” !!

వరదయ్య వెళ్ళి తెచ్చిన సరుకులు చూసి “ఏందయ్యా ఇన్ని సబ్బులు, నురగ నీళ్ళు తెచ్చినావు, ఇయన్నీ మనవేనా.. రాగులు తక్కవ రంగులెక్కువైనాయి” అంటే “ఏమో అందరూ కొంటున్నారు.. నన్నూ కొనమన్నారు. దేశంలోకి రోగమేందో వచ్చిందట. చేతులు కాళ్లు సబ్బుతో బాగా కడిగి మూతికి బట్ట కట్టుకోమన్నారు. అందరితో పాటు మనం అని తెచ్చినా” అన్నాడు.

“ఇదేం బాధ” అని దేవమ్మ వంటింట్లోకి దూరింది. 

వరదయ్య కొడుక్కి ఫోన్ చేసి “ఏం సీనయ్యా.. ఆడ ఎట్టుండాది. అన్నీ మూసేస్తారంట గదా.. నువ్వు టీచరమ్మను, పిల్లోల్లను తీసుకొని ఊరికొచ్చేయ్. టౌన్లో వొద్దులే” అంటే సరే అన్నాడు శ్రీనివాస్.    

ఆ సాయంత్రం ఊరుచేరిన అందరినీ చూసుకుంటూ, ఈ ఇద్దరూ తెగ మురిసిపోయారు.

“తాతయ్యా మా స్కూల్ కూడా మూసేశారు.. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. అంతవరకూ మనమంతా ఇక్కడే ఉంటామని నాన్న చెప్పాడు” అంటే “మీకెన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఈడనే ఉండండమ్మా” అని తాత వాళ్ళతో ఆటలు మొదలెట్టాడు. 

వరదయ్యకు కోడలంటే చాలా గౌరవం. ఆమెను టీచరమ్మా అని పిలుస్తాడు. కోడలు ఎప్పుడు వంటింట్లో సాయానికి వచ్చినా దేవమ్మ ఆనందమే వేరు. 

“దేవమ్మా పిల్లోల్లకి కారం ఎక్కువ పెట్టాకు, తినలేరు” అంటే రాత్రికి కొర్రన్నం లోకి వంకాయ కూర, టమాటా చారు, చివర్లో చిలికిన మజ్జిగతో ముగించారు.

రాత్రి ఇంటి ఆరు బయట వేపచెట్టు కింద మంచాలేసి తండ్రీకొడుకులు మాటామంతీ మొదలెట్టారు. చేతిలో బీడీతో “సీనయ్యా.. ఇట్టా స్కూళ్ళు మూసేస్తే పిల్లోల్లకి సదువెట్టా అబ్బేది. మీ అయ్యవార్లకి జీతాలు ఎట్టయ్యా! అసలు ఇత్తారా లేదా” అంటే తలొంచుకున్నాడు శ్రీనివాస్. 

“నీది మీ అమ్మ పోలికరా.. ఇద్దరూ ఏమడిగినా తలకాయ దించేత్తారు” అంటుంటే, తలెత్తిన కొడుకు కళ్ళలోంచి కారిపోతున్న నీళ్ళు చూసి గబుక్కున పక్కన కూర్చొని కళ్ళు తుడిచి, “ఏమైందయ్యా” అంటూ ఓదార్చాడు, వరదయ్య.

“మస్తాన్ కు మనం బాకీ ఉన్నామయ్యా.. స్కూల్ లో అందరినీ నెల కిందే తీసేశారు. జీతాలు లేకపోతే, ఈ నెలంతా నువ్వు పంపిన టమాటాలు, మస్తాన్ మాకిస్తే అమ్ముకుని ఏదో ఇంత తిన్నామయ్యా. నీకు తన కష్టంలోంచి డబ్బులిఛ్ఛాడు. మమ్మల్ని చెప్పొద్దన్నాడు”

వరదయ్యకు నోట మాట రాలేదు. ‘ఒగరికి ఇంగొగరు సాయం’ అనుకుని ఏవో ఆలోచిస్తూ ఆ రాత్రి వరదయ్య నిద్ర పోలేదు. గుండెలోని భారాన్ని దించుకున్న శ్రీనివాస్ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.

టపా టపా శబ్దాలకు నిద్ర లేచిన వరదయ్యకు దేవమ్మ చుట్టూ చేరిన కొడుకు, కోడలు, పిల్లలను చూస్తూ ఉండిపోయాడు. 

“సూసింది సాల్లేగానీ పల్లు తోమి రా! టీ నీళ్ళు ఇస్తా” అని దేవమ్మ అంటే దగ్గరగా పోయి చూస్తే ప్లేటులో జొన్నరొట్టె, పుంటికూర పప్పు, ఎర్ర కారం, ఉల్లిగడ్డతో వేరే లోకంలో ఉన్న కొడుకు, పిల్లలు, పక్కనే రొట్టెలు టపా టపా తడుతూ దేవమ్మ, అవి కాలుస్తున్న టీచరమ్మను చూసి నిద్రలేని ఆ రాత్రి మొత్తం మర్చిపోయాడు.

“అయ్యా.. నువ్వు తిన్న తర్వాత పొలం చూసొద్దాం” అంటూ ఇంకో రొట్టె మీద పడ్డాడు కొడుకు.

చిన్నప్పటి నుండి చూస్తూ, కాసింత వ్యవసాయం నేర్పించిన పొలమంతా తిరుగుతున్న, కొడుకు అడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ అలవాటుగా ఆకాశాన్ని చూస్తూ, ఇద్దరూ చింతచెట్టు కింద చేరారు.

  “అయ్యా.. నీ బ్యాంకు లోన్ సంగతి సర్పంచ్ యాదన్న చెప్పాడు. వాళ్ళొచ్చి నోటీసులు ఇస్తే బాగుండదు. మాలాంటి లక్షలమంది టీచర్ల ఉద్యోగాలు ఏమైతాయో కూడా తెలీదు. అందుకే ఆ విషయాన్ని పక్కనబెట్టి నీతో కలిసి ఇక్కడే వ్యవసాయం చేస్తాను. మీ కోడలు ఇల్లు, పిల్లల సంగతి చూస్తుంది. మస్తాన్ బాకీ కూడా ఇచ్చేద్దాం” అన్నాడు.

ఇంటికొచ్చి దేవమ్మకు చెప్తే ‘సరే’ అంది పిల్లల కష్టాన్ని తలుచుకొని, మాయదారి రోగాన్ని తిట్టుకుంటూ..  

సర్పంచ్ యాదిరెడ్డి ఇంటికెళ్ళిన ఇద్దరికీ ట్రాక్టరు బైట కనిపించింది.

“ఏంది సీనయ్యా మీ నాయనతో వచ్చినావు, అంతా బాగానే ఉంది కదా! లోనికి రండి” అంటూంటే “యాదన్నా.. పొలం పనులు అయిపోయాయా.. ట్రాక్టరు ఇక్కడుంది” అని శ్రీనివాస్ అంటే “ఏం పనుల్లే అయ్యా.. కూలికి ఎవరూ రావట్లేదుగా.. ఖాళీగా పడుంది” అన్నాడు యాదిరెడ్డి. 

“యాదన్నా.. నువ్వు సరేనంటే ఓ రెండు వారాలకు ట్రాక్టరు తీసుకుపోతా.. ఖర్చులు, రిపేర్లు నా లెక్క” అన్నాడు శ్రీనివాస్. 

“రెండు కాకపోతే నాలుగు వారాలు పెట్టుకో.. నీకన్నానా సీనయ్యా” అనడంతో తండ్రీకొడుకులు బండెక్కి ఇల్లుజేరారు.

శ్రీనివాస్ దంపతులిద్దరికీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీలున్నాయి. ఇద్దరూ కలిసి ముందుకెలా వెళ్ళాలని చిన్న ప్రాజెక్ట్ లాంటిది రాసుకుని, అందుకు ఊళ్ళోనే ఉంటున్న అగ్రికల్చరల్ ఆఫీసర్ తో మాట్లాడి కొన్ని వ్యవసాయపు మెళుకువలు తెలుసుకున్నారు.

వ్యవసాయం తగ్గటంతో మిగిలిపోయిన రకరకాల పంటల విత్తనాలు ఉచితంగా ఇచ్చారు ఆఫీసర్.

ట్రాక్టరుకు డీజల్, ఆయిల్ ఇబ్బంది కాకుండా మస్తాన్ చూశాడు.

“అయ్యా.. ఉన్న నీళ్ళతో ముందు ఆకుకూరలు, కూరగాయలు సాగుతో ఆదాయం పెంచాలి అని, ఓ మంచి రోజు చూసి వాడకంలో లేని భూమిని ట్రాక్టర్ తో చదును చేస్తే, తోడుకు కొన్ని చినుకులు పడి భూమి కాస్త మెత్తబడింది. 

“ఈసారి సేంద్రియ వ్యవసాయం దానికి తగ్గట్టుగానే ఎరువులు వాడదాం.. మార్కెట్లోవి వద్దు” అంటే 

అయోమయంగా మొహం పెట్టాడు వరదయ్య.

పొద్దున్నేఎర్ర కారం దోసెలు శెనక్కాయ చెట్నీతో  తింటూ పాత రోజులు గుర్తు చేసుకుంటే పిల్లలు “మాకు దోసెలు వద్దు తెల్లన్నం కావాల “న్నారు. 

వరదయ్య వాళ్ళతో “ఈ వారమంతా నాన్నమ్మ పెట్టింది తినండి, వచ్చేవారం మీకు శెనగబేళ్ళ పాయసం, సామికి పెట్టే వరి అన్నంతో సాబువ్వ, చెనిక్కాయ బెల్లం ఉండలు ఇస్తా” అంటే ఇద్దరూ తాత పక్క చేరిపోయారు. 

వరదయ్య ఇంట్లో భోజనమేదైనా సరే.. వెన్న తీసిన మజ్జిగ ఎప్పుడూ ఉండాల్సిందే.

మస్తాన్ ను కలిసొస్తానని శ్రీనివాస్ వెళుతుంటే దారిలో శెట్టి కనిపించి “సీనయ్యా నీ స్కూలు కధ తెలిసిందయ్యా. యాదన్న తన ట్రాక్టర్ ఇచ్చినాడని విన్నా. నా దగ్గర డ్రిప్ తో నీళ్ళు పారించే సామానంతా ఉంది. ఇస్తాను, ట్రాక్టర్ లో పెట్టుకుపో” అన్నాడు. కొత్తగా చేరిన ఈ పరికరాల వల్ల నీళ్ళు ఎంతో పొదుపై ఖర్చు చాలా  తగ్గుతుంది. 

పనులు చకచకా పరుగులు తీస్తున్నాయి. వేపాకు, రావాకు లాంటి ఇతరత్రా ఆకులతో కషాయాలు కలిపి పిచికారీగా టమాటాలకు ఇతర కూరగాయలు, ఆకుకూరలకు కొట్టడం, భూసారం పెంచేలా పశువుల పేడను చల్లడం, డ్రిప్ వల్ల తక్కువ నీళ్ళు పంటలకు పుష్కలంగా సరిపోవడం, పొలంలో ఇంకుడు గుంతలు తవ్వడం లాంటి పనుల్లో అందరూ చాలా శ్రమించారు.

మూడు వారాల్లో పంట దిగుబడి పెరగడం వరదయ్యకు నమ్మబుద్ది కాలేదు. పెరిగిన దిగుబడి నాలుగు భాగాలు చేసి సాయం చేసిన మస్తాన్, యాదిరెడ్డి, ఆఫీసర్, శెట్టికి పంచారు. వరదయ్యకు తెలియకుండానే బ్యాంకుకు కొంచెం వడ్డీ కూడా చేరింది. 

ఆరోజు వరదయ్యకు సాబువ్వ తినే అదృష్టం దొరికింది. అందరితో కలిసి..

కొడుకు నేర్పిన కొత్త వ్యవసాయ పాఠాలతో వరదయ్య, దేవమ్మ కష్టం తోడై పొలం మిశ్రమ పంటలతో కళకళలాడుతూ నిలకడగా కాపు పెరిగి ఇద్దరికీ ఆత్మవిశ్వాసం నింపింది. 

ఆఫీసరు చెప్పినట్టు కొత్తగా పాలీహౌస్ లో వేసిన క్యాప్సికమ్ మూడు రంగుల్లో చూస్తూ వరదయ్య “దేవమ్మా..ఇది మన పొలమేనా” అంటే ఈసారి తల దించలేదు ఆమె.

పల్లెలో కౌలుకు కొంత భూమి తీసుకుని పంట ఉత్పత్తి పెంచి ఊరివాళ్ళ అభిమానం పెంచుకున్నాడు.

వచ్చిన పంటలో మస్తాన్ కు కొంత భాగమిచ్చి మిగతా పంటను నేరుగా కస్టమర్లు కొనేలా ఉద్యోగం లేని తోటి టీచర్లను ఎక్కడికక్కడ చిన్న గ్రూపులుగా చేసి మార్కెటింగ్ ప్రారంభించాడు శ్రీనివాస్. 

ఈ ప్రేరణ పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేని వారికి తమ పల్లె మూలాలు వెతుక్కునే అవకాశం కల్పించింది. 

బ్యాంకు లోన్ మొత్తం తీరిపోయి పొలం పాసుబుక్కు వరదయ్య చేతిలో పెడుతున్న కొడుకును చూసి దేవమ్మ పడ్డ సంతోషం తడిసిన కళ్ళు చెప్పకనే చెప్పాయి. 

పల్లె తల్లి లాంటిది. అందరినీ అక్కున చేర్చేసుకుంటాది.

18 thoughts on “సాబువ్వ

      1. Ravi, I liked this story a lot. Story is very contemporary. Mandalikam is very well presented. Value of interdependency over independence was told very beautiful. You are soft and amenable and hence your stories comes with feel good factor. You can not bear Srinivas failing in his initial attempts of farming, so you made him sail smoothly.

        మెచ్చుకోండి

  1. ఈ కధలా నిజ జీవితాలు ఉంటె ఎంత బాగుండును. నేను నా భార్య పట్టణం నుండి పల్లెకు వఛ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేసి అందరికి చూపించాలని కష్టపడుతున్నాం. పాతకాలం నాటి నిజాయితీలు లేవు. నా జేబులో ఎంత డబ్బు ఉంది.. అది ఇలా అందుతుంది అనే ఆలోచన తప్పితే ఈ నాటి యువతకు కష్టపడదాం అనే ఆలోచన లేదు. మాటమీద నిలబడి పనికి రారు. అందరు దాదాపు త్రాగుడుకు అలవాటు పడ్డారు. వస్తున్నాం పద అంటారు. కానీ రారు. చేసుకున్న ఏర్పాట్లు వృధా… ఇలా ఉంటె పల్లెలు ఎలా బాగు పడతాయి అని విచారం వేస్తున్నది. పాత కాలపు ఆలోచనలు ఇంకా మాలో జీర్ణించుకొని ఉండటం వలన పట్టుకొని వేలాడుతున్నాము. ఈ రొండు సంవత్సరాలలో రొండు రెళ్ళు నాలుగు లక్షల నష్టము .

    మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s