‘నారింజ రంగు సిరా మరకలు’ – మహి బెజవాడ !

Mahy చిత్రం కావచ్చు

రచయిత పరిచయం:

వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. ‘డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్’ కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. ‘ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానిని విజువలైజ్ చేయడానికి రాస్తే బాగుంటుందని రాస్తున్నాను’ అంటారు.

‘నారింజ రంగు సిరా మరకలు’, ఒక విలక్షణమైన కథ. ‘అస్తిత్వ వేదన’ ముఖ్యాంశం గా వచ్చిన కథలు వున్నప్పటికీ, రాసిన పద్థతి వల్ల ఈ కథ ప్రత్యేకతను సంతరించుకుంది. కథలో చాలా మటుకు విజువల్స్ ప్రెజెంట్ చేస్తూ, సింబాలిక్ గా రాస్తూ వస్తారు రచయిత. కథంతా భావగర్భితంగానే ఉంటుంది.

కొన్ని కథలు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిలిస్తే, కొన్ని కథలు ఆలోచింప జేస్తాయి. ఈ రెంటిని సాధించగలిగారు మహి ఒకే కథలో.

ఆడియో పార్ట్ 1 లో , కథను మీరు వినవచ్చు.

ఆడియో పార్ట్ 2 లో , కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు.

‘నారింజ రంగు సిరా మరకలు’

in a highly disturbed state of mind. అతను మానసికంగా చాలా అలజడికి గురవుతున్నాడు. అసలేం జరిగింది ఇతనికి?

తెల్లని గోడల మధ్య పుస్తకాల గుట్టలు. రాత్రంతా నిద్దురపోడు. అతను దేనికోసమో తపిస్తాడు. ఏదో దొరకని దానికోసం వెతుకుతుంటాడు. ఆ వెతుకు లాటలో భాగంగా చదువుతుంటాడు. చాలా దూరం చదువుతుంటాడు. పగలూ రాత్రి కనబడని దూరం చదువుతుంటాడు. అంత దూరం చదివి, రాయడమే

మజిలీగా పెట్టుకుంటాడు. మళ్లీ పగలూ రాత్రి కనబడనంత దూరం రాస్తాడు. మళ్లా వెతకడం మొదలుపెడతాడు. చరిత్ర, పాలిటిక్స్, ఫిక్షన్- ఒకటని కాదు. రోజూ ఇదే పనిగా పెట్టుకుంటాడు. ఇవన్నీ చూస్తూ ఒక మూలగా ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ పై గుబురు గడ్డం ముసలివాడు సాక్షిగా వుంటాడు. ఈ రాసిన కాగితాలన్నీ అచ్చుకు పోతాయి. పత్రికలవుతాయి, కరపత్రాలవుతాయి. కానీ చదివిన పుస్తకాలన్నీ తన బుర్రలో శిథిలమవుతాయి. చరిత్ర చదివి బాధపడతాడు. కోపం తెచ్చుకుంటాడు. తనలో తాను మథనపడతాడు. చివరికి కథ చెప్పాలంటాడు. అతడు కథ భలే చందంగా చెబుతాడు. తనకిష్టమైన వెన్నెల రాత్రులలో దగా చేసి రాయబడ్డ మన గతాలను ఆ నక్షత్రాల సాక్షిగా చెబుతాడు. మనం మనం కాదు. ఎవరి కోసమో రాయబడ్డ చరిత్ర. చరిత్రను తిరగరాయాలి. మన గురించి మనమే రాసుకోవాలి అంటాడు.

Not a rare case. But sounds strange.

మొదట్లో నాకూ వింతగా అనిపించింది. డిప్రెషన్ అనుకున్నాను. కానీ అనుకోకుండా మారిపోయాడు. ఇప్పుడు అన్నింటికీ భయం భయంగా వున్నాడు.

తనలో తనే వున్నాడు. ఈ లోకంతో పని లేనట్టు తన రూమ్ నుండి బయటకు రావట్లేదు. తన బులుగు రంగు జేబురుమాలును చేతిలోనే వుంచుకుంటున్నాడు. రాత్రుళ్లు గట్టిగా అరుస్తున్నాడు. ఎవరో తన మీద నిఘా పెట్టారంటూ మంచం కింద దాక్కుంటున్నాడు. కానీ చదవడం ఆపలేదు. రోజూ పేపర్ చదువుతున్నాడు. తన పుస్తకాలు చదువుతాడు.

కానీ రాయట్లేదు.

రాయడానికి భయం అడ్డుపడుతుంది. కానీ రాస్తున్నాడు. ఎవరికీ కనబడకూడదని రాసిన కాయితాలన్నీ అటక పైన వున్న పాత ట్రంకె పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాడు. అప్పుడప్పుడు తన బులుగు రంగు చేతిగుడ్డను ముఖంపై కప్పుకుంటాడు. ఏడుస్తాడు. ఇదంతా ఆ గుబురు గడ్డం ముసలి మనిషి చుస్తూవుంటాడు.

ఇలాగే వుంటే అతని పరిస్థితి ఏంటి డాక్టర్?

It all depends. ఈ అలజడి ఎక్కువైపోయి ఆవేశాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఆత్మహత్యకి దారి తీయడానికి అవకాశం వుంది. ఏమీ జరగకుండానే ఇలానే పిచ్చిలోకి జారిపోయే ప్రమాదమూ వుంది.

అతను తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదా? దీనికి ఏ రకమైన ట్రీట్ మెంట్ లేదా డాక్టర్?

ట్రీట్ మెంట్ అంటే, ఇది మందులతో మాత్రమే నయం కాని స్థితి. ఇది మనసుతో చెయ్యా ల్సిన వైద్యం . But it’s not a hopeless condition. అయితే అతన్ని మాములు మనిషిని చేసే ప్రయత్నం కేవలం ఒక్కరికే సాధ్యం.

ఎవరు డాక్టర్?

తనే! Yes he only can cure himself. ఈ పరిసరాలు ఇవీ మారి తన కిష్టమైన చోటుకు తీసుకెళ్లి తనకు అడ్డు చెప్పకుండా తను ఇష్టపడే పనులు తనను చెయ్యనివ్వండి. తను ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వండి. తనలో వుండే ఇమేజెస్ ని మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన మాట మీరు వింటున్నారు అంటే తనలో కూడా ఏదైనా మార్పు రావొచ్చు. But it’s a long shot!

Ok, Thank You, Doctor!

గ్త్ ఎఫెకు పెట్టాను.

మనం నీకిష్టమైన కన్యాకుమారి వెళ్తున్నాం. ఢిల్లీ టూ ఆగ్రా, ఆగ్రా టూ నాగపూర్, నాగ్ పూర్ టూ హైదరాబాద్, హైదరాబాద్ టూ బెంగుళూర్, బెంగుళూర్ టూ కన్యాకుమారి. On the road! అదీ ప్లాన్. వింటున్నావా?

ఇప్పుడెందుకు ఇదంతా? నేను బాగానే వున్నా కదా?

Yes! You are absolutely fine. జస్ట్ నాకు నీతో కన్యాకుమారి చూడా లని వుంది. వెళదాం. నీకు కాస్త ఛేంజ్ గా వుంటుంది కదా. ఎప్పుడూ ఆ నాలుగు గోడల మధ్య ఫ్లాట్ లో లోన్లీగా….

లోన్లీగానా? Never! I like to be alone. అంతే!

సరే. సరే. నువ్వు నాతోపాటు కన్యాకుమారి వస్తున్నావ్ అంతే. ఇది ఫిక్స్. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఎక్కువ ఆలోచించకుండా త్వరగా పడుకో. Bye.

ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు అతనికి. ఏదో వెతికాడు. పుస్తకాల షెల్ఫ్ నుండి Hard Bound పుస్తకం ఒకటి తీశాడు. అందులో కొన్ని పేజీలు వెతికి చదివాడు. ఆ పేజీలను చించి బులుగు రంగు రుమాలులో పెట్టి ముడి కట్టాడు. ఇంకా ఏదో పుస్తకం కోసం వెతికాడు. దొరికింది. ఆ అట్టపై ముక్కు విరిగిన శిల్పం

బొమ్మ వెక్కిరిస్తునట్టుగా వుంది. దాన్ని చించి ఆ రుమాలులో మూటకట్టాడు. భయంగా ఒక కాగితంపై రాస్తున్నాడు.

మనుషులు: రంగు-నలుపు-తెలుపు

చరిత్ర: వక్రీకరణ-రాసినవాడు ముక్కు కొట్టేసిన శిల్పం: ఎద్దు-గిట్టలు-నురగ

ప్రాంతం: ఉత్తరం దక్షిణం రాజ్యం: హత్య-ఆత్మహత్య-దాడి-నిఘా థి తాన్ని కూడా తన wు జురుమలులో మూటకట్టాడు. ఆ రాత్రి నిద్రపోలేదు. అలాగే కూర్చొని వున్నాడు. ఎదురుగా గుబురు గడ్డం ముసలి వాడు సాక్షిగా.

ఏరా? ఇంకా రెడీ కాలేదా? వెళ్లాలా? తప్పదా?

అదేంటి అంతా ఫిక్స్ చేశాను కదా! ఇప్పుడేంటి ఇదంతా? కళ్లేంటి ఎర్రగా వున్నాయి?

రాత్రి నిద్రపోలేదా?

లేదు.

సరే get ready. కార్లో రెస్ట్ తీసుకుందువులే!

Zolpidem 10mg ఇది వేసుకో నిద్రకి. మన నెక్స్ట్ స్టాప్ ఆగ్రా. ఇప్పుడు పదయ్యింది. ఇంకో నాలుగు గంటల్లో రీచ్ అయిపొతాం. ఏంటి వింటున్నావా?

ఆ..

లంచ్ కి ఆపుతా. అప్పుడు లేద్దువులే పడుకో. వొద్దు. ఏమీ తినాలని లేదు. నేరుగా ఆగ్రాకి వెళ్లిపోదాం. ఓకే. యువర్ విష్!

షాజహాన్ నిర్మించిన తన ప్రేమ సౌదం తాజ్ మహల్. దాదాపు ఇరవై రెండు వేల మంది శ్రమ, సృజన కేవలం ఒక రాజు ప్రేమకి చిహ్నంగా మిగిలింది. మరి ఇంతమంది సృజనకారుల ప్రేమకథలు ఎంత గొప్పవి. ఈ ఇరవై రెండు వేల

ప్రేమకథలు ఎక్కడా చరిత్రలో లిఖించబడలేదు. 22 ఏళ్ల వ్యవధిలో మనసు మనసుకొక, మనిషి మనిషికొక ప్రేమకథ వుంటుంది అంటాడు. షాజహాన్ తన

ప్రేమకు చిహ్నంగా నిర్మించిన సమాధిలో ఎన్ని ప్రేమకథలు భూస్థాపితం చేసారో. తాజ్ మహల్ చుట్టూ వున్న గాలి అంతరాలలో ప్రతి అణువునా, ప్రతి చలువరాతి స్పర్శలోను, ప్రతి నగిషీ ఒంపులోను ఈ ఇరవై రెండు వేల మంది ప్రేమకథలు నిక్షిప్తమై వున్నాయి అని అంటాడు.

Reaching agra రా. almost 10 Km. Time ఎంత ?

5.15 కావొస్తోంది, sunset ki reach అయిపోతాం . నీకోసమే ఇదంతా. నువ్వేమయినా పోయెట్రీ చదువుతావేమోనని ఆశ! అందుకే చేసా.

వొద్దు. డైరెక్ట్ గా రూమ్ కి వెళదాం . అదేంటి నేనేమో ఇంత ఆశగా వుంటే. వొద్దు. ఎందుకు వొద్దు…? నాకు ఇష్టం లేదు.

అరే ఎప్పుడూ చెప్పేవాడివి కదా! సన్సెట్లో తాజ్ మహల్ ని చూస్తూ యమునానది ఒడ్డున కూర్చొని ప్రేమకథలు చెబుతాను అని ఊరించేవాడివి, ఇప్పుడే మయ్యిందిరా?

ఇప్పుడు ఉదయాలను, అస్తమయాలను కొన్ని అందాలతో కలిపి చూడ

లేకున్నా!

అదే ఎందుకు?

ఆ రంగే అత్యంత కిరాతకంగా సహజమైన చరిత్రను కప్పేస్తుంది.

What the fuck man!!! You are becoming cynical, self destruction ఇదంతా! ఎందుకిలా?

Yes destruction, but not self.

ఏమోరా! ఈ ట్రిప్ నీకోసమే. కాస్త మామూలు అవుతావనే. నీ మాటలు వినాలని, నీ రాతలు మళ్లీ చూడాలని, నీ బ్లాక్ ని క్లియర్ చెయ్యాలని, నేను బిజీ షెడ్యూల్స్ లో వుండి కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేసా, only because of you. బీ నార్మల్.

రూమ్ కెళదాం. మరి ఆగ్రా వచ్చి తాజ్ మహల్ చూడకుండా ఎలారా? వెళ్లడం. నాకు చూడాలని లేదు, Don’t force me. Okay. But one condition. నాకు రూమ్ కెళ్లాక కథ చెబుతానంటేనే.

హ్మ.

కాలం చెప్పిన కథలు కాలం చెల్లినట్టుగా, ఇది కానరాని కథ. మనం తెలుసు కోవాల్సిన కథ. చరిత్ర మట్టిపొరల్లో దాగిన కథ. మనల్ని మనమే తవ్వుకోవాలి అంటాడు. తను ప్రయాణం చెయ్యాలి అంటాడు. తనకి తన వేర్లు ఎక్కడ మొదల య్యాయో తెలుసుకోవాలని తపన పడతాడు. అందుకు అక్షరాలను సాయం అడుగు తాడు. ఆ అక్షరాలు తన గమ్యాన్ని పక్కత్రోవ పట్టిస్తాయి. అందుకే వెతకడం ప్రారం

భిస్తాడు. ఒక పురాతన మనిషి కోసం తన ప్రయత్నం మొదలుపెడుతాడు. అక్షరాలు తనని మోసం చేసినా, తన వెతుకులాటలో ఆ పురాతన మనిషి దొరుకుతాడు.

పొడవాటి జుట్టుతో గడ్డం మనిషి పూల పూల కంబలి సగం మడిచి భుజం మీదగా ఛాతికి అడ్డంగా కప్పుకొని వుంటాడు. కానీ ముక్కు చెదిరి వికృతంగా నవ్వుతుంటాడు. ఆ మనిషి తన చెయ్యి పట్టుకొని ఒక్క ఉదూటున లాకెళ్లిపోతాడు. ఎంతదూరం అంటే కొన్ని శతాబ్దాల కాలం అంత దూరం. సువిశాల మైదానం చక్కగా అమర్చినట్టు అగ్గిపెట్టెలాంటి రాతి ఇళ్లు. మనుషులంతా అందరు ఒకటే రంగు నలుపు. చూడటానికి రెండు కళ్లు చాలవన్నట్టు చూస్తుంటాడు. అద్భుతమైన కట్టడాలు. మనుషులు ఇంత సృజనకారులా? అని ఆశ్చర్యపోతాడు.

ఇంతలో తెల్లరంగు మనుషులు వలస వస్తారు. నెమ్మదిగా ఉత్తరం, దక్షిణం అంటూ విభజిస్తారు. వాళ్లు గొప్ప… వీళ్లు గొప్ప అని చర్చ లేవనెత్తుతారు. 

తెలుపు రంగు వుత్తమమైనదిగా తేలుస్తారు. దీని పైన సృజనకారులు తమదైన పద్దతిలో నిరసన మొదలుపెడుతారు. కథలు రాస్తారు. పాటలు పాడుతారు. బొమ్మలు వేస్తారు. కరపత్రాలు పంచుతారు. అప్పుడు గొప్పవాళ్లుగా నిర్ధారించుకున్నవాళ్లూ తమ ఆధిపత్యం కోసం వేట మొదలెడతారు, మనుషులు దిక్కులు చూసుకొని చెల్లాచెదురవు తారు. ఇక కొంతమంది సృజనకారులు బట్రాజుల అవతారం ఎత్తుతారు. వారిచే చరిత్రను తిరగరాస్తారు. నిరసన తెలియజేస్తున్న సృజనకారులను వేటాడుతారు. ఎదురుగా సింహాసనంపై ధర్మశాస్త్రన్ని ప్రతిష్టింపజేస్తారు. దానినే అనుసరించాలంటూ బట్రాజులు ప్రచారం మొదలెడతారు. అందుకు బహుమతిగా కొత్త జోళ్లను బహుమతిగా ఇస్తారు. ఇక బట్రాజులందరూ వారికి గుర్తింపుగా ఆ జోళ్లను తొడుక్కుంటారు. ఇదంతా కళ్లకు కట్టినట్టు ఆ పురాతన మనిషి తన చెయ్యి పట్టుకొని చూపిస్తాడు. వెంటనే ప్రయాణం మొదలెట్టి ఎక్కడ కలిశారో అక్కడ ఆగుతారు. ఆ పురాతన మనిషి శిలలా మారిపోతాడు. ముక్కు కొట్టేసిన శిల్పం వెక్కిరింతగా చూస్తుంటుంది. ఇది చరిత్ర అన్నట్టుగా.

ఏమైంది రా what the hell are you doing???

ఫీలింగ్ ద పెయిన్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా?

యెస్. యు ఆర్ ఇన్ బ్లడ్ పూల్! యెస్ ఐ నో! పద ముందు హాస్పిటల్ కి వెళదాం.

నో!

రా. నువ్వు ఆ చెయ్యి ఇలా ఇవ్వు ముందు. కర్చీఫ్ వుందా?

యెస్ ఏంటి ఏవో మూట కట్టావ్? కాగితాలు. చిత్తు కాగితాలు. ఆ నెమ్మదిగా కట్టు. పద ముందు.

డీప్ గానే కట్ అయ్యింది. త్రీ స్టిచెస్ వేశాను. తను చాలా డిప్రెస్సెడ్ గా వున్నారు. It’s better to go back to your doctor. తన కండిషన్ క్రిటికల్ గా నే వుంది. మెడికేషన్లో వున్నట్టున్నాడు.

యెస్ డాక్టర్.

అంబులెన్స్ లో షిఫ్ట్ చెయ్యండి. కొద్దిగా డ్రోసీగా వుంటారు. కాస్త మాట్లాడుతూ తీసుకెళ్లండి.

ఓకే! థ్యాంక్యూ.

వేట ప్రారంభమైంది. నలుగురు మనుషులు పెద్ద మోకును పట్టుకుని పరిగెడుతున్నారు. ఎద్దు గాబరాగా పరిగెడుతోంది. ఒక గుండె ప్రాణం కోసం రొప్పు తోంది. నాలుగు గుండెలు దాని ప్రాణం కోసం అన్నట్టు రొప్పుతున్నారు. ఒకడు పక్కగా వచ్చి రెండు కొమ్ములకి గురి చూసి ఉచ్చులా చేసిన మోకును గురి చూసి విసిరాడు. అంతే ఒక్కసారిగా అది పరిగెత్తడం మాని కొమ్ములకి వేసిన ఉచ్చును తీసుకోవాలని చూస్తోంది. పక్కగా ఎద్దు కుడి కాలి గిట్టలకు మోకు వుచ్చును బిగించి వేసాడు. ఇంకొకడు మోకును దాని నడుము చుట్టూ రెండు మెలికలుగా వేసి ఒడుపుగా దాన్ని కింద పడేస్తారు. అది బెదురుగా నేల కూలుతుంది. ఈ తంతు ఊరి చివర అమ్మోరు గుడి ముందు జరుగుతుంది. అది రంకెలు వేస్తుంది. అత్యంత కిరాతకంగా దాని నాలుగు కాళ్లూ కట్టివేస్తారు. అప్పుడు లాల్చి వేసుకుని గళ్ల లుంగీ కట్టుకుని, నుదిటిన మచ్చతో, పొడవాటి గడ్డంతో, ప్రాణంతో మాత్రమే వున్న బక్క పలచని మనిషి తన పెట్టె తీసుకొని వస్తాడు. ఆ పెట్టె నుండి తీసిన ఇనుప నాడాలను ఎద్దు గిట్టలకు కొట్టే ప్రయత్నం మొదలుపెడుతాడు. అది కన్నీరు పెడుతుంది. కంట నీరు దారలుగా నేల కారుతుంది. తనది కానిదేదో తాను తొడుక్కోలేను అని మూగగా గింజుకుంటుంది. అది గింజుకున్న ప్రతిసారీ ఆ నలుగురు మనుషులు గట్టిగా పట్టు కుంటారు. ఒప్పుకోదు కానీ వీళ్లూ ఒప్పుకోరు. తన సహజమైన పాదాలకు ఇవి ధరించడం ఇష్టంలేదు. కనుకనే పోరాటం. ఇవి తొడిగి తమకు నచ్చినట్టుగా నడిపించుకోవటం కోసం ఆ నలుగురి పోరాటం. ఈ పనే నువ్వు చెయ్యాలి. ఇదే నీ వృత్తి అన్నారు కాబట్టి ఆ బక్క పలచని మనిషి పోరాటం. కాని ప్రకృతి ఒకటి వుంది కదా అది ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవడానికి సహజసిద్ధంగా కొన్ని పోరాట లక్షణాలను స్వభావాలుగా పొందుపరుస్తుంది. అందుకే ఇక ఎద్దు పోరా టానికి సిద్ధమైంది. పెద్దగా రంకెలు వేస్తూ నోటి నుండి నురగలు కక్కుతూ, మోకుల్ని తెంపుకొని ఒక్కసారిగా అస్తమిస్తున్న ఆ సూర్యుడి ఎదురుగా రెండు కాళ్లు పైకెత్తి ధిక్కరింపుగా చూస్తోంది.

10

3

Electro Compulsive Therapy-ECT. దీన్నే షాక్ ట్రీట్ మెంట్ అని అంటుంటారు. మెడికేషన్ కి ఏమీ రెస్పాండ్ కావట్లేదు. పైగా సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడు. ఇక మీరు డిసైడ్ చేసుకోండి తన ఫ్యామిలీ ఎవరైనా వుంటే ఇన్ఫార్మ్ చెయ్యండి. కన్సెంట్ ఇవ్వాల్సి వుంటుంది. మేక్ ఏ క్విక్ డెసిషన్ ప్లీజ్.

ఫ్యామిలీ ఎవరూ లేరు డాక్టర్! ఎవరన్నా వున్నారు అంటే మేమే. ఫ్రెండ్స్ మాత్రమే. షాక్ ట్రీట్ మెంట్ అంటున్నారు.

దానివల్ల ప్రాబ్లమ్ ఏం వుండవు కదా డాక్టర్?

హుమ్ వుంటాయి. కన్ఫ్యుషన్, మెమొరీ లాస్, హెడేక్, ఇలాంటివి వుంటాయి. ఇది కాకుండా మేజర్ రిస్క్ అంటే ట్రీట్మెంట్ సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరిగి కార్డియాక్ అరెస్ట్ కావొచ్చు. It’s a chance.

Okay Doctor, How best we can treat అనేది మీ డెసిషన్.

ఓకే. ఒకసారి అనెస్టిటిస్ట్ ఒపినియన్ తీసుకుందాం. ముందు అడ్మిట్ అవ్వండి. రిపోర్ట్స్ అన్నీ క్లియర్ గా వుంటే రేపు ఎర్లీ మార్నింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం.

ఆ ఉదయం ఇలా వుంటుంది అని ఊహించలేదు. తనని రూమ్ లోకి తీసుకొని వెళ్తారు. వెళ్తూ తను పట్టుకున్న బులుగు రంగు జేబురుమాలు ఎదురుగా వున్న స్నేహితుడికి ఇచ్చి వెళ్తాడు. ఆశగా చూస్తూ వెళ్తాడు. రక్తపు మరకలతో తడిసిన ఆ రుమాలుకున్న ముడి విప్పుతాడు. అందులో వున్న కాగితాలను చదువుతాడు. ఒకటి తను చేతివ్రాతతో రాసుకున్న కాగితం.

మనుషులు: రంగు నలుపు-తెలుపు

చరిత్ర: వక్రీకరణ-రాసినవాడు 

ముక్కు కొట్టేసిన శిల్పం: ఎద్దు-గిట్టలు-నురగ

ప్రాంతం: ఉత్తరం దక్షిణం 

రాజ్యం : హత్య-ఆత్మహత్య-దాడి-నిఘా 

రెండోది ఆర్టికల్ నెం: 19, 20, 21, 22 కాగితాలు. 

మూడోది: ది ఇండస్ సివిలైజేషన్ పుస్తకం కవర్ పేజీ.

ఆ కాగితాలన్నిటికీ తన రక్తపు మరకలు అంటాయి. తను ఆత్రుతగా గ్లాస్ డోర్ నుండి వాడిని చూస్తుంటాడు. లోపల డాక్టర్లు ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు. తను వాడినే చూస్తూంటాడు. వాడి కాళ్లకు ఉచ్చులాంటి క్లిప్స్ ఏవో పెడతారు. కదలకుండా నవా లాంటి దానితో అడ్డంగా కడతారు. వీడు చలనం లేనట్టు పైకి చూస్తుంటాడు. వాడి కణతలకి హెడ్ ఫోన్స్ లాంటివి పెడతారు. అందరూ వాడిని గట్టిగా పట్టుకుంటారు. డాక్టర్ మీటర్ చూసుకొని బటన్ నొక్కుతాడు.

చీకటి గుహలో, గజిబిజి దారుల వెంట ఇరుక్కుని వున్న అక్షరాలు. వరదలా వస్తున్న రక్త ప్రవాహంతో ఎటు కొట్టుకుపోవాలో అర్థం కాకుండా తేలుతూ వుంటాయి.

తన కంటనీరు దారలుగా కారుతుంది.

సూర్యోదయానికి సాక్షిగా నురగులు కక్కుతూ విగతజీవిలా తననే చూస్తూ వాడు.

ఆకాశానికి రంగులు అద్దేవాడు. నక్షత్రాలను లోకానికి తెచ్చేవాడు. చీకటిని ప్రశ్నించేవాడు. సహజసిద్ధంగా స్పందించేవాడు. పిడుగులు పడినా వెరవనివాడు. ఎవరు వాడు? ఇక వాడు వాడిలాగే స్పందించగలడా?

వాడు మళ్లీ మామూలు మనిషై తనకు కథలు చెబుతాడని తను ఎదురు చూస్తుంటాడు.

ఇవన్నీ తెలియని ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ పై వున్న గుబురు గడ్డం మనిషి వాడి కోసం ఎదురుచూస్తూ వుంటాడు.

*********************************************************************************************************************

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s