‘సచ్చి సాదించడం’ – ఎండపల్లి భారతి గారు

ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు మరియు వ్యక్తులు నిలబడి ఉన్నారు చిత్రం కావచ్చు

‘సచ్చిసాదించడం ‘ ఎండపల్లి భారతి గారు రాసిన ‘ ఎదారి బతుకులు’ లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు.

మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముందరా ముండమోపి బతుకు బతకాల్సి వచ్చింది.

మాది పెద్ద సంసారం. నాకు కొత్తగా పెండ్లయినబ్బుడు అందరం కూడా ఉండేవాళ్లం. మా ఇంట్లో మాయత్త, మా మామ, నేను, నా మొగుడు, మా తోడు కోడలు, మా బావ ఉండేవాళ్లం.

నాకు ఒక కూతురు. మా బావకి గూడా ఒక కూతురు. బిడ్డలకి ఒక ఏడాది వయసు ఉంటాది….

దినమ్మూ అట్లానే ఆపొద్దు గూడా నా మొగుడు, మా బావ ఇద్దరూ సేద్యంకాడికి పోయిరి. మా మామ ముసిలోడు. పనిచేయలేడు. ఆయప్ప ఒక మూల కుచ్చోని బిడ్డల్ని ఆడిచ్చుకుంటా ఉండాడు. నేను, మా తోడుకోడాలు తలా ఒకపని చేసి కూలికి పోయేదానికి పొద్దయిందని, అదరాబదరాగా మొగాలు కడిగేదానికి పొయిలో బొగెత్తి నోట్లో వేసుకుని దుద్దుకుంటా ఉంటిమి.

మాకాడికి ముందే, మాయత్త మొగం కడిగి, అద్ది, గోడకు అతికిచ్చిన అద్దంలో మొగం చూసుకుంటా దాసరోళ్ల దగ్గర తీసుకున్న సునో డబ్బాలో పట్టెడు సునోను చూపుడేలుతో లోడుకుని గోరుమందం మొగానికి రుద్దుకునింది. నొస్టన వేలితో మైనం మెల్లించుకుని, అరచేతిలో వేసుకున్న ఎర్రకుంకాన్ని నడిమేలుతో ఎత్తుకుని అనపగింజంత ఎడం బొట్టు పెట్టుకుంటా ఉండాది. ఈ ముసిలిది ఏమి సొగసు పడతా ఉండాది. వయసులో ఇంకెట్ల ఉండిందో అనుకుంటా నేను నా పండ్లను పరపరా దుద్దు కుంటుండా.

ఈలోపల మొగంపని చూసుకుని, మాయత్త తలకాయ నున్నంగా దువ్వి కొప్పేసింది. దానికితోడు మా ముసిలోడు ఇంటి ముందర దాసాని పువ్వు పూసుంటే పెరుక్కొచ్చి, ఇందే తలకాయలో పెట్టుకో అని ఇచ్చె. మాయత్త, దేవునికి పువ్వన్నా ఏమారతాది కాని తలకాయలో పువ్వు ఏమారదు. ఆయమ్మ మరిచిపోయినా మామామ గుర్తుచేసేవాడు, పువ్వు పెట్టుకోమని. ఆయమ్మ సొగసు ఉండేదే కదా అని నేను, మా తోడుకోడలు సంగటి తిని, పనికి పోయేదానికి దండెంమింద ఉండే పై గుడ్డల్ని బుజానేసుకుని, బిడ్డలకి పాలిచ్చి, వాళ్లరినీ ముసిలోళ్ల దగ్గర వదిలితిమి.

నా కూతురు పాలు మానలేదు. చిన్న కలబందని రొమ్ములకి పూసుకున్నా గూడా అట్లే పాలు తాగే సేది. ఇంక నాకు వల్లకాక పాలిచ్చేసి బిడ్డల్ని బద్రంగా చూసుకోమని మా మామకి చెప్పేసి వాకిట్లోకి ఒక అడుగు పెడితిని.

అంతలోకే చుట్టం వచ్చె, చెంబుతో నీళ్లిచ్చి నట్టింట చాపేసి కుచ్చోమంటిమి. ఆ చుట్టాన్ని మేమెరగం. ఆయప్ప “ఏమొద్దు, పలానాయన కాలమైపొయినాడు” అని మాయత్తకు చెప్పె. కాలం అయిపొయినాయప్ప మాయత్తకు తెలిసినట్లుంది. మాకు తెలీదు.

అంతవరకు సంతోసంగా ఉండిన మాయత్తా మామా మొగాల్లో మబ్బు కమ్మేసింది. ఇద్దరూ నిరుజీవులై పోయిరి. వాళ్లను చూసి మేము గమ్మున అయితిమి. ఇంతకూ సచ్చిపొయినాయప్ప వీళ్లకి బాగా కావల్సినాయప్పో ఏమో అందుకే వీళ్లు వెతపడతుండారు అని అనుకుంటిని.

కబురు తెచ్చినాయన మాయత్తతో మాట్లాడతా “సరేక్కా నేను ఊర్లో చానామందికి చెప్పల్ల, మన్నుపొద్దుకి చేరుకోవల్ల. వెనుకాముందు అయితే శవాన్ని ఎత్తరు” అని ఆయప్ప పోయె. కబురు చెప్పను వచ్చినోడు ఎంతదూరమన్నా పోనీ, వేళకి గుంటకాడకి చేరుకోవల్ల.

ఆయప్ప అట్ల పోతానే మా ఇంట్లో చిన్నబిడ్డ అరుపులు తప్ప సద్దే లేదు. అంతా గమ్మునే వుండారు. ఇంతలో మా పక్కింటి పెద్దమ్మ వచ్చె. “ఏమ్మేవాడు కాలం అయిపొయినాడంట, ఏం చేద్దాము, పదే పోదాము, వాడు కట్టిన తాళి వాడికే తెంపల” అనింది మాయత్తతో.

నేనుండుకుని అర్దంకాక, “ఏందమ్మా ఏం జరిగింది, ఎవరికి ఆయమ్మ తాళి తెంచేది” అని అడిగితి. ఒక పక్క మా మామ నెత్తిన చేతులు పెట్టుకుని కుచ్చో నుండాడు. నేను బలే నసుగుదాన్ని మా పెద్దమ్మ నడిగితి “కాదు పెద్దమా చచ్చిపోయినాయప్ప
నాకేమవుతాడు” అని.

కాదే నా బట్ట ముండా, మీకేంగాడే వాడు. మీయత్తకు తొలీత బొట్టు కట్టినోడు. మీయత్తకు ఏడేండ్లబుడు వాళ్లమ్మ తమ్మునికిచ్చి పెండ్లి చేసి. వాడు మీయత్తని ఈదాబాదా పెడతా ఉంటే, ఆయన దగ్గిర ఇమడలేక వదిలేసి వచ్చేసింది. మల్లా మీ తాతను తగలాటం చేసుకునింది. లెక్క పకారం తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్ల” అనింది.

నేను “అయ్యో ఇదెక్కడ న్యాయమమ్మ, ఎబుడో చిన్నబుడు నెరవాది కాకముందు పెండ్లైతే ఇబుడేందమ్మా ముండమోసేది. మా మామని పెండ్లి చేసుకుని ఇబ్బుటికి ఏ ఏబైయేండ్లో కావస్తా ఉండాది. అబుడు నింటి బిడ్డా పాపలను కని సంసారం చేసి, ఇబుడు ఆయప్ప ప్రాణంతో ఉంటే ఎట్లమ్మా వదిలేసి ముండ మోసేది” అంటిని.

దానికి మా పెద్దమ్మ “అయ్యో కాదమ్మా, అట్ల ఒప్పుకోరు. ఎవరు తొలిత బొట్టు కడితే వాడు కట్టిన తాళి వానికే తెంపల్ల, లేదంటే మీ కుటుంబానికి మంచిదికాదు” అనింది.

మామామ ఏమి జరగతాదో అని కుమిలిపోతా ఉండాడు. నిజమే కదా ఆయప్ప ప్రాణంతో ఉన్నెబుడే ముండ మోయల్లంటే ఆయప్పకి ఎంత బాదయితుంది.

ఇంక అయిందెట్లా అయింది అని, ఇంట్లో వాళ్లు బాదపడుకుంటా ఆయమ్మని పిలుసుకుని పోతిమి. ఆడికి పొయినంక నాకు ఇంకా కొత్త కతలు తెల్సినాయి. ఆ సచ్చినోనికి, మాయత్త వచ్చేసినంక మాయత్తకి చెల్లిలివరసైన ఆమెను ఇచ్చి పెండ్లి చేసిరంట.

తొలిది తోలు తెగదు, మలిది మాను తెగతాదా అన్నెట్లు ఆయమ్మ గూడా ఆయప్ప దగ్గిర సంసారం చేయకుండా యెల్లిపోయి వేరే ఆయనను పెండ్లి చేసుకుని నలుగురు బిడ్లకు | తల్లయింది. ఇబుడు బిడ్లకు పెండ్లిండ్లు అయినాయి. పెండ్లి చేసుకున్నాయన బతికే ఉండాడు.

ఆయమ్మని గూడా ఇట్లనే తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్లని చెప్పినట్లుండారు. ఆయమ్మ వచ్చి నట్టింట కుచ్చోని ఉండాది. సచ్చిపోయినాయన, ఇద్దరు పెండ్లాలూ వదిలేసినంక ఇంకొకరి ఆలిని తోడుకొచ్చుకున్నాడు. ఈయప్పకు ఆయమ్మ కుదిరి నిలబడిపోయింది. ఆయమ్మా ఉండాది. ఆయమ్మ ఒగని ఆలి కాబట్టి, ఈయప్పకు ముండమోసే పనిలేదంట.

మాయత్తని, రెండో ఆయమ్మని నట్టింట కుచ్చోబెట్టి, వచ్చిన అమ్మలక్కలు ఊరికే ఉంటారా, వాళ్లకు పసుపుకుంకుమ పూసి, గంగమ్మ బొట్టు పెట్టి, తల నిండా పూలు పెటి. ఆయప్పకు తెచ్చిన పూలారాలు వీళ్లకూ ఒకొకటి వేసి తలకాడ ఒకరిని, కాళ్లకాడ ఒకరిని కుచ్చోబెట్టిరి.

ఆ ఊరు చిన్నూరు కాదు. సుమారు మున్నూరు పైన ఇండ్లుండాయి. వీళ్లకు పెండ్లిండ్లు అయినబ్బుటి నింటి ఇబ్బుటికి ఏబైయేండ్లు అయింది. కొత్త కోడాండ్లు, మల్లా పుట్టిన పిల్లోళ్లు, వాళ్ల బిడ్డలు, చుట్టుపక్కల ఊర్లనించి వచ్చిన చుట్టాలు, ఇట్లా లెక్కేస్తే నన్నూరు మందికి పైనే వచ్చింటారు. వచ్చిన ప్రతి ఒక్కరూ, ఎవరు ఆయప్ప పెద్ద పెండ్లాము, చిన్న పెండ్లాము , ఇబుడు ఉండే ఆయమ్మ ఎవరు అని ఆరా తీసేది. సచ్చినోడిని చూడను వచ్చి ఆయప్పను కాదు చూసేది, తొలిత వీళ్లను చూసేది. నేను అనుకుంటి, పెండ్లి చూపుల్లో గూడా ఇంతమంది వచ్చి చూసిండరు, ఈ పొద్దే వీళ్లకు పెండ్లిచూపులు జరగతున్నట్లుండాయే అని.

అమ్మలక్కల్లో కొందరు చిన్నాయమ్మకంటే పెద్దాయమ్మ బాగుండాదే అంటే, మరికొందరు చిన్నాయమ్మ కూడా బాగానే ఉండాదే, వీనికి పెండ్లాలను పెట్టుకొనే రాతుంటే కదా అని మాట్లాడుకుంటుండారు.

కడాకు ఆయప్పను మంటి మరుగు చేసిరి. మేము మాయత్తను ఆడనే వదిలి వచ్చేస్తిమి. దినాలు అయ్యేంతవరకు ఆయమ్మ ఏడకూ రాకూడదు. తొమ్మిదో దినం, గాజూ పూసా తీసేసి, తెల్లచీర ముసుగు వేసుకుని దీపం చూడను ఇంటికి రావల్ల. కొత్తగా ముండమోస్తే ఏడేడ చుట్టాలు ఉండారో వాళ్లిండ్లకు పోయి దీపం చూడల్ల. లేదంటే మల్లా జీవితంలో వాళ్ల ఇండ్లకు పోకూడదంట. అన్ని ఊర్లూ చూసుకుని మా ఇంటికి వచ్చింది.

మేము నట్టింట దీపం పెట్టి, కడప మానులో ఆ పక్క , ఈ పక్క, నాలుగు బియ్యం గింజలు వేసి, దీపం చూపించి, ఉప్పుసట్లో చేయి పెట్టిస్తిమి. పెండ్లయినబుడూ అదేపని చేపిస్తారు, ముండమోసినబుడూ అదేపని చేపిస్తారు.

ఎబుడు మాయత్త తెల్లచీర కట్టుకుని వచ్చెనో, మామామ ఆయమ్మ మొగం చూడలేక ఇంటెనకాలకు పొయి ఏడుసుకుంటా ఉండాడు.

మాకూ ఏడుపు వచ్చె. ముత్తైదువుగా మాకండ్ల ముందర కళకళలాడతా ఉండింది, ఇబుడు ఇట్లైపోయిందే అని. ఎబుడో బొట్టు కట్టిచ్చుకున్న పాపానికి, ఈ పొద్దు మామామ బతికే ఉండినా అన్నీ తీసేసి తిరగాల్సి వచ్చిందే అని.

“ఎర్తి తెలీని వయసులో వానికిచ్చి పెండ్లి చేసిరి. వాని దగ్గర వంగినా తప్పే లేసినా తప్పే. అయినదానికి కానిదానికి, ఆచింతకి ఈచింతకి తగువేసుకుని కొట్టేది. వాని దగ్గిర నాకు విరిగిన ఎమకేకాని విరగని ఎమక లేదే! గుణం చెడినా సుకందక్కాల అని యెల్లిపోయి, నా బతుకు నేను బతకతా ఉంటే, వాడు ఇబ్బుడు సచ్చి నన్ను సాదిస్తుండాడు. తొలిత బొట్టు కట్టినోడికి తాడు తెంపల్ల అనే సాంగెం వల్ల నాకు ఈ బాద. లేకుంటే నాకేం కర్మ”

అని మాయత్త బాదపడతా ఉంటే, మామామ ఆయమ్మ చేత్తో ఇచ్చిన నీళ్లు గూడా తాగేదిలే..

మాయత్తను బాగా చూసుకుంటా ఉండిన మామామ అబ్బుటి నింటీ ఎడంగా చూసే!

మాతృక మాసపత్రిక, 2017

నెరవాది : సమర్త / పెద్దమనిషి

మంతిమరుగు : పూడ్చిపెట్టడం

ఎర్తి : జ్ఞానం

ఈ పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/edari-batukulu-endapalli-bharathi-2

‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

2 thoughts on “‘సచ్చి సాదించడం’ – ఎండపల్లి భారతి గారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s