సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష

అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పడి పొయ్యేనా, అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల  కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్,  అలాగే రాత్రిళ్ళు కూడా తొక్కేస్తా అనే ఉత్సాహం చూపి, ఒక నైట్ లాంప్, రెండు  రిఫ్లెక్టర్స్ కూడా కొనిపిచ్చేసుకున్నా. 

మా ఆవిడ తరవాత రోజు ఆ సైకిల్ కి పసుపు పూసి, కుంకుమ బొట్టు పెట్టి, రెండు నిమ్మకాయలు తొక్కించి, తాను ఎదురొచ్చి నా సైకిల్ యాత్ర ప్రారంభించింది. సైకిల్ తొక్కటం మొదలు పెట్టిన నాకు ఆ తర్వాత కానీ వెలగ లేదు, నా యాత్రకి ఓ రూట్ మ్యాప్ తయారు చేసుకోలేదని. సరే ముందు కాలనీ లోనే తొక్కదామని బయలుదేరా! రెండు వీధులు తొక్కినాక  గానీ అర్థం కాలేదు మా కాలనీ లో అడుగడునా స్పీడ్ బ్రేకర్స్ అని మేము భ్రమ పడేవి  సిమెంట్ కట్టలు అని. సైకిల్ ఎక్కి దిగుతుంటే కూసాలు కదిలిపోతున్నాయి. ఓ పదినిమిషాలు తొక్కాక లాభం లేదు రేపు కాలనీ బయటకి వెల్దాము అని ఇంటికొచ్చేసా. పాపం మా ఆవిడ  ఆ ముందురోజే నాకు తెలియకుండా బూస్ట్ బాటిల్ తెప్పిచ్చి పెట్టింది నేను తొక్కి తొక్కి అలిసిపోతే అవి తాగి నేను, “బూస్ట్ ఈజ్ సీక్రెట్ అఫ్ హర్షాస్ ఎనర్జీ” అనడానికి. 

పదినిమిషాలకే తిరిగొచ్చిన నన్ను చూసి ముఖం ముడుచుకొని, నా ఎదురుగానే బూస్ట్ కలుపుకొని, ఉస్ ఉస్ అనుకుంటూ తాగేసింది. 

నా సమస్యంతా ఏకరువు పెట్టి, రేపటి నుండి బయట తొక్కతా అని తనని తీసుకెళ్లి, ఒక హెల్మెట్, సైక్లింగ్ గాగుల్స్ కొనిపిచ్చేసుకున్నా. పాపం పిచ్చిది మా ఆయనకీ ద్వితీయ విఘ్నం కలగ కూడదని నా డిమాండ్స్ అన్నీ తీర్చింది. పక్కన రోజు, కొన్న సరంజామా తో నన్ను అలంకరించుకొని, నా సైకిల్ ని కూడా అలంకరించి, రాజూ వెడలె రభసకు అని పాడుకుంటూ యాత్ర మొదలు పెట్టా. వెనకనుండి మా ఆవిడ అరుస్తూ వుంది ఎక్కు తొక్కు అని. మన కాలనీ దాటిందాకా నడిపిచ్చుకుంటూ వెళ్లి, బయటకు వెళ్ళగానే తొక్కతా అని తనకి అభయం ఇచ్చి బయల్దేరా. వెనక నుండి తాను అరుస్తూనే వుంది, మన కాలనీ లో చాలా శునకాలు వుండాయి, అందులో ఒక నల్ల శునకరాజం కరుస్తుంది, అసలే అంతరిక్షం నుండి ఊడిపడ్డట్టున్నావు నువ్వు అంటూ. భయపడుతూ భయపడ్తూ కాలనీ దాటా.

కాలనీ బయటకు వచ్చి మెయిన్ రోడ్ మీద తొక్కటం మొదలెట్టా! నా వెనక నుండి బోయ్ మంటూ హార్న్ కొట్టందే ఏమీ తోచని వాళ్లంతా వాళ్ళ సరదా తీర్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడి రోడ్ చాలటం లేదు, నన్నేదో వాళ్ళ అర్జెంటు పనులకు అంతరాయం కలిగించే శత్రువులాగా చూస్తూ నన్ను దాటుకుంటూ వెళ్తున్నారు. ఒకరిద్దరైతే శుద్ధమైన రోడ్ వుండగా మట్టిలో దిగి నా మొహాన  ఇంత దుమ్ము కొట్టీ మరీ వెళ్లారు. 

చూద్దాం ఈ రోజు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్తున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా. ఆయాసపడుతూ రెండు మూడు కిలోమీటర్స్ వెళ్ళా. ఈ లోపు కొత్తగా కొన్న వాటర్ బాటిల్ లోంచి నాలుగు సార్లు నీళ్లు తాగా. 

ఇంతలో నా ముందర ఒక హెవీ లోడ్ తో వెళ్తున్న లారీ ముందు అప్ రావటం తో, డ్రైవర్ గాడు ఒక్క సారి ఆక్సిలేటర్ అంతా అదిమాడెమో, నేను, నా సైకిల్, నా వెనక వచ్చే నాలుగైదు వాహనాలు మాయమయ్యేలా ఒక నల్లని మేఘాన్ని గిఫ్ట్ గా ఇచ్చింది. అప్పుడర్థ మయ్యింది నాకు ఆరోగ్యం గా ఉండాలంటే ముందు మనం  బతికుండాలి అని,  ఇంక నేను ఎప్పుడు ఇలాటి మెయిన్ రోడ్ లో సైకిల్ తొక్క కూడదని. 

నా మొహం చూడంగానే, మా ఆవిడక్కూడ అర్థమయ్యింది మనోడు ఎదో సీరియస్ డెసిషన్ తో ఇంటికొచ్చేసాడని. 

సర్లే పో అని ఒక క్వార్టర్ కప్పు బూస్ట్ ఇచ్చి, ఏంటి కథ అంది. అమ్మాయీ ఒకటి అర్థమయ్యింది నాకు, సైకిల్ అస్సలు మెయిన్ రోడ్ లో తొక్క కూడదు అని. మరెక్కడ తొక్కాలని డిసైడ్ య్యావు స్వామీ అంది మా ఆవిడ, ఈ టాపిక్ మళ్ళీ తన చేత ఏమి ఖర్చుకు దారి తీస్తుందో అని చాలా క్లుప్తం గా మాట్లాడడానికి ట్రై చేస్తూ. 

హాయిగా ప్రశాంతం గా వుండే ప్రదేశాల్లో తొక్కాలి, కానీ అక్కడకు సైకిల్ ఎలా తీసుకెళ్ళాలి, మన కార్ లో పట్టదు గా అని చెప్తున్న నాకు, అడ్డు తగిలి, అనుకున్నా, నువ్వు నిన్న సైకిల్ షాప్ లో కార్ కి పెట్టుకునే  స్టాండ్ ని తదేకం గా చూస్తున్నప్పుడే, నా బుజ్జి కార్ వెనకాల దిష్టి బొమ్మలు తగిలించబాక అని వార్నింగ్ కూడా పారేసింది. 

సరే డియర్ , మన కార్  చిన్నది, సైకిల్ పట్టదు, దానికి స్టాండ్ పెట్టడానికి నువ్వు ఒప్పుకోవు, ఇప్పుడు కారు మార్చలేమో  అంటూండగా, మా ఆవిడ ఒక్క సారి ఫిట్స్ వచ్చినట్టు విరుచుకు పడిపోయింది. 

ఆ సాయంత్రం మా శీను గాడు ఇంటికి వచ్చాడు. 

“అబ్బో హర్ష సైకిల్ కొన్నట్టున్నాడే, బాగా తగ్గినట్టున్నాడు తొక్కీ తొక్కీ, నేను కూడా పాపకి చాలా రోజుల నుండి చెబుతూ వున్నా సైకిల్ కొనుక్కో అమ్మా, అది తొక్కితే చాలు ఇంకేమీ అవసరం లేదు” 

 ఆ మాటలు వింటున్న మా ఆవిడకి కళ్ళు మెరిసాయి. కొత్త సైకిల్ కొనటం ఎందుకన్నా, దీన్ని పట్టుకెళ్లండి అంటూ నా సైకిల్, దాని అలంకరణలు మరియు నా అలంకరణలు జాగ్రత్త గా ప్యాక్ చేసి మరీ రెడీ చేసింది. 

శీను గాడి చేతిలో  సైకిల్ పెడుతూంటే, పిల్ల పెళ్లి జరిగిన ఆనందం మా ఆవిడ మొహంలో. 

మా వాడు ఎలా తొక్కి తొక్కి తగ్గిపోయాడో చూద్దామని క్రితం వారం వాడింటికెళ్ళా . ఇంటి గేట్ తీస్తూంటే వాళ్ళావిడ విప్పారిన మొహంతో ఎదురొచ్చింది. ఎప్పుడు మీరు వొస్తారా అని ఎదురు  చూస్తున్నా అన్నా, అంది. 

దేనికమ్మా అన్నా !

“అన్నా! ఇవిగో మీ దగ్గర లేని యాక్ససరీస్ అంటూ ఒక తాళం చెవి , రెండు ట్యూబులు , నాలుగు సైకిలింగు షార్ట్లూ నా చేతిలో పెడుతూ, దయచేసి తీసుకెళ్ళన్నా ఈ భూతాన్ని . ఇప్పుడు దీన్ని ఎత్తుకొని తిరగడానికి మా ఆయన ఎస్.యు.వీలు బేరం చేస్తున్నాడు అంది స్వరం తగ్గించి , మూలున్న సైకిల్ ని చూపిస్తూ. “

 డ్రైవ్ చేస్తూ ఇంటికొస్తూంటే, పక్కనే, ఎవరో ఇద్దరు స్కూలు పిల్లలు బాగుల్తో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు. 

వెనకొచ్చే ఆటోలో  సైకిల్ జాలిగా విరుచుకు పడుకునుంది, కారునే ఫాలో అవుతూ. 

చిన్నప్పుడు మా ఇంట్లో వుండే  హీరో సైకిల్ గుర్తుకొచ్చింది. ఇంట్లో వున్న ముగ్గురం అదే సైకిల్ వాడే వాళ్ళం వంతులేస్కుని.  ఆరు నెలలకి ఒకసారి ఓవర్ హాల్ కి ఇస్తే పదో పదిహేనో తీసుకొని కొత్త కరుకులా చేసే వాళ్ళు రిపేర్ షాప్ లో. ఓ పదేళ్ళన్నా  వాడి ఉంటాము ఆ సైకిల్ ని అపురూపంగా.

మారింది ఏమిటి?  అని ఆలోచిస్తూ ఇంటి ముందర కారు ఆపా.  కారు శబ్దం విని బయటికొస్తోంది,  మా ఆవిడ  గేట్ తీద్దామని.   

7 thoughts on “సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s